
కొత్త జిల్లాల ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పాదయాత్ర చేస్తున్న ప్రజలు
సాక్షి నెట్‌వర్క్: కొత్త జిల్లాల ఏర్పాటును హర్షిస్తూ రాష్ట్ర ప్రజలు ఆదివారం కూడా జిల్లాల్లో నీరాజనం పట్టారు. అనేకచోట్ల ప్రార్థనలు, బైక్ ర్యాలీలు, క్షీరాభిషేకాలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పాదయాత్ర కూడా చేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని బాపట్లను జిల్లా కేంద్రంగా ప్రకటించటంతో అక్కడ హయ్యర్‌నగర్‌లోని లూథరన్ చర్చిలో ఆదివారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొన్నారు. అలాగే, పల్నాడు జిల్లాను కూడా ప్రకటించటం హర్షణీయమని పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు తెలిపారు.
పట్టణంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం ఉద్దానంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఆయన సతీమణి శ్రీదేవి ఆధ్వర్యంలో వేలాది మందితో మహాపాదయాత్ర నిర్వహించారు. 26 జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం మండలంలోనూ భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ ఆశయాల మేరకు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేస్తున్నారన్నారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు.
క్షత్రియ సంక్షేమ సమితి హర్షం
పాడేరు కేంద్రంగా అరకు, రంపచోడవరం, పాడేరు నియోజకవర్గాలను కలుపుకుని ‘అల్లూరి సీతారామరాజు’ జిల్లాగా ఏర్పాటుచేసినందుకు క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో గల క్షత్రియ కల్యాణ మండపం నుంచి సీతమ్మధార అల్లూరి విగ్రహం వరకు నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తమ చిరకాల వాంఛ నెరవేర్చిన సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోనూ సంబరాలు కొనసాగాయి. కొవ్వూరు నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లాలో కలిపినందుకు కృతజ్ఞతగా దేవరపల్లి వైఎస్సార్ సెంటర్‌లో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నేతృత్వంలో మహిళలు క్షీరాభిషేకం చేశారు. ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు వివిధ వర్గాల ప్రజలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెలే గ్రంధి శ్రీనివాస్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.