రాష్ట్ర జలవనరుల శాఖ అధికారుల ప్రతిపాదన
శనివారం ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూలుపై చర్చిద్దామన్న అంతర్జాతీయ నిపుణులు
గ్యాప్–1, గ్యాప్–2లో ప్రధాన డ్యాం డిజైన్లపై ప్రజెంటేషన్ ఇచ్చిన ఆఫ్రి సంస్థ ప్రతినిధులు
వర్క్ షాప్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న సీడబ్ల్యూసీ చైర్మన్ రాకేశ్‌కుమార్ వర్మ
నేటితో ముగియనున్న వర్క్ షాప్
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ పనులకు సమాంతరంగా ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ పనులు చేపడతామని రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ కె.నరసింహమూర్తి ప్రతిపాదించారు. అప్పుడే కేంద్రం నిర్దేశించిన షెడ్యూలులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూలుపై శనివారం చర్చించి, నిర్ణయం తీసుకుందామని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు, అంతర్జాతీయ నిపుణులు నిర్ణయానికొచ్చారు.
పోలవరం ప్రాజెక్టుపై సీడబ్ల్యూసీ సీఈ విజయ్‌శరణ్ అధ్యక్షతన వర్క్ షాప్ మూడో రోజూ శుక్రవారం కొనసాగింది. అంతర్జాతీయ నిపుణులు డేవిడ్ బి.పాల్, రిచర్డ్ డొన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్‌బెర్గర్, పీపీఏ సీఈవో అతుల్ జైన్, సభ్య కార్యదర్శి రఘురాం, కాంట్రాక్టు సంస్థ మేఘా, ఆ సంస్థ తరఫున డిజైనర్ ఆఫ్రి, బావర్ సంస్థల ప్రతినిధులు ఈ వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్తగా నిర్మించే డయాఫ్రం వాల్ పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు తేల్చేందుకు నిర్వహించాల్సిన పరీక్షలపై తొలుత చర్చించారు.
ఆ తర్వాత ప్రధాన డ్యాం డిజైన్లపై ఆఫ్రి ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాన డ్యాం గ్యాప్–3లో ఇప్పటికే 140 మీటర్ల పొడవుతో కాంక్రీట్ డ్యాంను పూర్తి చేశామని చెప్పారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో 564 మీటర్లు పొడవున 50 మీటర్ల ఎత్తుతో.. గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడవున 50 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా రూపొందించిన డిజైన్‌లో సాంకేతిక అంశాలను వివరించారు. గ్యాప్–1లో డ్యాం నిర్మాణానికి 16.6 లక్షల క్యూబిక్ మీటర్లు.. గ్యాప్–2లో 95.85 లక్షల క్యూబిక్ మీటర్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. కాగా, ప్రధాన డ్యాం డిజైన్లపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు.
జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులు
ప్రధాన డ్యాం డిజైన్లపై చర్చించిన తర్వాత వర్క్‌షాప్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీడబ్ల్యూసీ చైర్మన్ రాకేశ్‌కుమార్ వర్మ పాల్గొన్నారు. బుధ, గురు, శుక్రవారం వర్క్ షాప్‌లో చర్చించిన అంశాలను సీడబ్ల్యూసీ సీఈ విజయ్‌శరణ్ వివరించారు. ప్రాజెక్టును షెడ్యూలు ప్రకారం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రాకేశ్‌కుమార్ వర్మ ప్రశ్నించగా.. జనవరి నుంచి ప్రధాన డ్యాం గ్యాప్–2లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. అంతర్జాతీయ నిపుణుల సూచనల మేరకు డయాఫ్రం వాల్ డిజైన్‌లో మార్పులు చేసి.. వాటితోపాటు ప్రధాన డ్యాం డిజైన్లను ఎంత తొందరగా పంపితే అంత తొందరగా వాటిని ఆమోదించే ప్రక్రియను పూర్తి చేస్తామని రాకేశ్‌కుమార్ వర్మ చెప్పారు.
పోలవరం జలవిద్యుత్ కేంద్రంలో కీలక పనులు ప్రారంభం
పోలవరం రూరల్/దేవీపట్నం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పోలవరం జలవిద్యుత్ కేంద్రంలో టర్బైన్‌ల ఏర్పాటులో కీలకమైన స్టేరింగ్‌ల అమరిక పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వీటిని అమర్చేందుకు 320 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన క్రాలర్ క్రేన్ వినియోగిస్తున్నారు. ప్రాజెక్టులో ఈ స్టేరింగ్ కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో స్టేరింగ్ నాలుగు విభాగాలుగా ఉంటుంది. దీని బరువు 136 మెట్రిక్ టన్నులు. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే కప్లాన్ టర్బైన్లు సమర్థవంతంగా పనిచేయడంలో ఈ స్టేరింగ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment