సాక్షి, అమరావతి: నేటి ఆధునిక కాలంలో ఇంటర్‌నెట్ అనేది నిత్యావసరాల జాబితాలో అతి ముఖ్యమైన విషయంగా మారింది. ఇంటర్‌నెట్ లేకపోతే సగం ప్రపంచం ఆగిపోయినట్లే ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పనులలో 70 శాతం వరకు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అందుకే ఇంటర్ నెట్ అవసరాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ లిమిటెడ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం హైస్పీడ్ ఇంటర్ నెట్ సేవలను అందించాలని ప్రతిపాదించింది. టీవీ సర్వీస్‌తో పాటు ఇంటర్నెట్‌ను వినూత్నంగా అనుసంధానం చేయడం ద్వారా వినియోగదారుడి ఇంటి వద్ద ఇన్‌స్టాల్ చేసిన ఆండ్రాయిడ్ ఐపిటివి, జిపిఓఎన్ బాక్స్ సహాయంతో నేరుగా టీవీలో వినియోగించే వెసలుబాటు కల్పిస్తోంది. అదే విధంగా ఇంటర్నెట్ లీసెడ్ లైన్లు, ఎంటర్‌ప్రైజ్ బ్రాడ్ బ్యాండ్, ఆడియో కాన్ఫరెన్స్ సేవలను రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ అందిస్తోంది.
సరికొత్త ప్యాకేజీలు
బేసిక్ ప్యాక్ (300 రూపాయలకు)తోపాటు వినియోగదారుడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సెన్షియల్ ప్యాక్ జీఎస్టీతో సహా 449 రూపాయలకు 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో, ప్రీమియం ప్యాక్ జీఎస్టీతో సహా 599 రూపాయలకు 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ప్యాకేజ్‌తో అధిక టీవీ ఛానెళ్లు, అపరిమిత టెలిఫోన్ కాల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మధుసూదనరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్‌నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం, కేబుల్ కనెక్షన్ అందజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షలమంది చందాదారులకు కనెక్టివిటీని అందిస్తుంది. (చదవండి: సమగ్ర భూ సర్వేతో ప్రజలకు మేలు)
మారుమూల గ్రామాల్లోనూ అత్యంత వేగంగా
ఫైబర్‌నెట్ ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాలైన ఐటిడిఏ రంపచోడవరం, ఐటిడిఏ పాడేరు మొదలైన ప్రదేశాలలో సైతం అత్యంత వేగవంతమైన ఇంటర్‌నెట్, టీవీ, టెలిఫోన్ సేవలనుపొందుతున్నారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంతో ఉపకరిస్తుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో నెలకొని ఉన్న గ్రామ / వార్డు సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాలు, వైస్సార్ ఆరోగ్య కేంద్రాలు , పాల సేకరణ కేంద్రాలు, నాడు - నేడు పాఠశాల కార్యక్రమాలను అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయం టెలిఫోన్ సేవలను అందించడం గమనార్హం.
కాగా ట్రంక్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలు 24 ,000 కిలోమీటర్ల నిడివిలో రాష్ట్రవ్యాప్తంగా 2,600 పాయింట్ అఫ్ ప్రెజెన్స్ (పిఒపి) తో బలమైన నెట్‌వర్క్ కలిగివుంది. ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ రాష్ట్రంలో 55,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను భారత్ నెట్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ ద్వారా గ్రామ పంచాయతీతో కలుపుతుంది. స్థానిక కేబుల్ ఆపరేటర్లతో భాగస్వామ్యం ద్వారా గృహాలకు ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌సేవలను అందిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రానున్న రోజులలో 50 లక్షల గృహాలకు ఫైబర్ నెట్‌వర్క్ సేవలు అందించే దిశగా ముందుకు సాగుతోంది. క్రమేపి పెరుగుతున్న చందాదారుల సంఖ్యకు తదనుగుణంగా నెట్‌వర్క్ సామర్థ్యానికి తగినట్లుగా సిపిఇ బాక్సుల సరఫరాను పెంచే యోచనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment