ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఏపీ కీలక కేంద్రం అవుతోంది. పలు గ్లోబల్ సంస్థలు రాష్ట్రంలో కంపెనీలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకు తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) వేదికగా మారింది. వీటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం పట్ల పారిశ్రామికవేత్తలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఒక్కో పరిశ్రమ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ నిశ్శబ్ద విప్లవంగా కొత్తపుంతలు తొక్కుతోంది. యువత ఉపాధికి కొత్త దారులు చూపిస్తోంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి / సాక్షి, తిరుపతి: ‘మీకు మాటిస్తున్నా.. మీ వెంటే ఉంటా.. ఒక్క ఫోన్ కాల్ చేయండి.. సమస్య ఎంతటిదైనా పరిష్కరిస్తాం’ అని ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపిస్తున్న పారిశ్రామికవేత్తలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం వికృతమాల పరిధిలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) వేదికగా మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, మరో మూడు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పేడు, ఇనగలూరులో పారిశ్రామికవేత్తలు, శ్రీకాళహస్తి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎప్పుడు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా ఒక్క ఫోన్ కాల్ ద్వారా తనతో పంచుకోవచ్చని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల ప్రయాణం అత్యద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..
ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో భారీగా ఉపాధి
– టీసీఎల్ సంస్థ ద్వారా రూ.1,230 కోట్ల పెట్టుబడితో టీవీ ప్యానల్స్, మొబైల్ డిస్‌ప్లే యూనిట్లు తయారు చేసే మంచి వ్యవస్థకు తిరుపతి కేంద్రం కావటం శుభ పరిణామం. దీని ద్వారా దాదాపు 3,200 మందికి ఉపాధి కలిగింది. అది ఈ రోజు (గురువారం) నుండే శ్రీకారం చుట్టడం అభినందనీయం.
– రూ.1050 కోట్ల పెట్టుబడితో ఫాక్స్ లింక్ సంస్థ యుఎస్‌బీ కేబుళ్లు, సర్క్యూట్ బోర్డులు తయారు చేసే పరిశ్రమ పూర్తయ్యింది. దీని ద్వారా మరో 2 వేల మందికి ఉపాధి కలుగుతోంది. సన్నీ ఓపోటెక్ ద్వారా సెల్‌ఫోన్లలో కెమెరా లెన్స్ తయారు చేసే మరో సంస్థ రూ.280 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైంది. దీనిద్వారా 1200 మందికి ఉద్యోగాలు లభించాయి.
– ఈ పరిశ్రమల ద్వారా నెల రోజుల్లోనే దాదాపు 6,400 మందికి ఉద్యోగాలు వస్తాయి. డిక్సన్ టెలివిజన్‌కు సంబం«ధించిన మరో సముదాయానికి శంకుస్థాపన చేశాం. దాదాపు రూ.110 కోట్ల పెట్టుబడితో సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఏడాదిలో పనులు పూర్తి చేసి, 850 మందికి ఉద్యోగాలు ఇస్తుంది.
– ఫాక్స్ లింక్ ఇండియా లిమిటెడ్ సంస్థ ద్వారా రూ.300 కోట్ల పెట్టుబడితో మరో ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభ దశలోకి రానుంది. తద్వారా 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మొత్తంగా ఎలక్ట్రానిక్స్ కంపెనీల రాక వల్ల రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి లభిస్తుంది.
2023 సెప్టెంబర్ తర్వాత అపాచీలో 10 వేల కొలువులు
– అక్క చెల్లెమ్మలకు హిల్‌టాప్ ఎస్‌ఈజెడ్ డెవలప్‌మెంట్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్(అపాచీ)లో 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తాం. అపాచీ ప్రతినిధులకు అభినందనలు. అపాచీ గ్రూపు అంటే ఆడిదాస్ షూలు తయారు చేసే కంపెనీ.
– మంచి ఉపాధి అవకాశాలు రావడమే కాకుండా సుమారు రూ.800 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ నిర్మాణాలు ప్రారంభమవుతాయి. 2006లో నాన్నగారు (దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఇదే అపాచి, ఆడిదాస్ కంపెనీలను తడలో ఏర్పాటు చేయించారు. ఈ రోజు తడలో ఈ ఒక్క కంపెనీలోనే 15 వేల మంది పని చేస్తున్నారు. అందులో దాదాపు 60 శాతం మంది చెల్లెమ్మలే. ఉద్యోగాలకు మంచి కేంద్రంగా నిల్చింది.
– ఆ తర్వాత ఇదే అపాచీ కంపెనీకి సంబంధించి.. ఇటీవల పులివెందులలో మరో 2 వేల మంది చెల్లెమ్మలకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన పనులకు శంకుస్థాపన చేశాం. మరో 9 నెలలల్లో పనులు పూర్తి చేసుకుని ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభిస్తుంది.
– ఇవాళ మనం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు మరో 15 నెలల్లోనే అంటే.. సెప్టెంబర్ 2023 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. దీనివల్ల 10 వేల మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇందులో 80 శాతం మంది చెల్లెమ్మలే ఉద్యోగులుగా ఉంటారు. ఈ ప్రాంతంలో కొత్త ఉషోదయం మొదలవుతుందని ఆశిస్తున్నా.
అక్కడికక్కడే సమస్యల పరిష్కారం
ఇనగలూరులో సభ అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రజల నుంచి అభ్యర్థనలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఆ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రులు కె.నారాయణస్వామి, సత్యనారాయణ, విద్యుత్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నా«థ్, టూరిజం శాఖ మంత్రి ఆర్‌కే రోజా, ఎంపీలు మిథున్‌రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, ఎడ్యుకేషన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్, ఏపీఐఐసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ అవుల సుకన్య, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, అపాచీ వైస్ ప్రెసిడెంట్ సెర్గియాలీ, వైస్ జనరల్ మేనేజర్ ముత్తు గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనకు చక్కటి ప్రోత్సాహం
వేగవంతంగా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా సహకరించారు. వెనువెంటే అనుమతులు ఇప్పించారు. అపాచీ పరిశ్రమలో అడిదాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్టులు తదితర ఉత్పత్తులను తయారు చేస్తాం. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి ప్రోత్సాహం అందిస్తోంది.
– టోనీటూ, అపాచీ సీఈవో, తైవాన్
ఈఎంసీ వేదికగా పలు ఒప్పందాలు
– ఇనగలూరులో అపాచీ కంపెనీ భూమి పూజ సందర్భంగా భూసేకరణ, పరిశ్రమల నిర్వహణ, తయారీ, ఉద్యోగ కల్పన తదితర అంశాలపై తైవాన్ దేశానికి చెందిన అపాచీ సీఈవో టోనీటూతో పాటు పలువురు డైరెక్టర్లతో సీఎం జగన్ చర్చించారు. అనంతరం ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, అపాచీ సీఈవో టోనీటూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో భూ కేటాయింపుల పత్రాలను మార్చుకున్నారు. అంతకు మందు సీఎం జగన్ అక్కడ ఓ మొక్కను నాటారు.
– ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీతో స్మార్ట్ డీవీ టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకుంది. హై ఎండ్ వీఏఎల్‌ఎస్‌ఐ డిజైన్ టెక్నాలజీలో దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతోంది. హై ఎండ్ వీఏఎల్‌ఎస్‌ఐ డిజైన్ టెక్నాలజీ 10 వేల మంది యువతకు శిక్షణ కూడా ఇవ్వనుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది.
– టీసీఎల్ కార్పొరేషన్‌కు సంబంధించిన పీవోటీపీఎల్ ఎలక్ట్రానిక్స్ ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకుంది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా పంపిణీ వ్యవస్థ అనుబంధ పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
– దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్ రంగం అవసరాలు తీర్చేందుకు రాష్ట్రాన్ని తయారీ కేంద్రంగా మార్చేందుకు జెట్‌వర్క్ టెక్నాలజీస్ ఒక ఎంవోయూను కుదుర్చుకుంది. బ్రహ్మాండంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న యూనికార్న్ కంపెనీల్లో జెట్‌వర్క్ టెక్నాలజీస్ ఒకటి.
– ఐటీ సేవల ఎగుమతి కోసం టీయర్ రెండు, మూడు నగరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఈఐటీఏతో టెక్‌బుల్స్ ఎంవోయూను కుదుర్చుకుంది.
నాడు వైఎస్సార్.. నేడు జగన్
శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరుకు సమీపంలో దాదాపు పాతిక కిలోమీటర్ల మేర ఇప్పటి వరకు ఒకే ఒక్క పరిశ్రమ ఉంది. అది కూడా 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విద్యుత్ ఉపకరణలకు చెందిన మన్నవరం ప్రాజెక్టును తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రాంతంలోని భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలు పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా వైఎస్సార్‌ను దేవుడిగా కొలుస్తుంటారు.
మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే బాటలో ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు అపాచీ పరిశ్రమను తీసుకురావడంతో స్థానికుల సంతోషానికి అవధులు లేవు. అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. జై జగన్ ప్ల కార్డులతో పెద్ద ఎత్తున అన్నదాతలు ట్రాక్టర్లలో వేలాదిగా తరలి వచ్చారు. పరిశ్రమకు చుట్టుపక్కల ఎటూ చూసినా జనమే కనిపించారు. ఆ ప్రాంతమంతా జై జగన్.. జై జగనన్న.. నినాదాలతో హోరెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment