సమస్యలు వింటూ.. అక్కడే పరిష్కరిస్తూ.. వరద బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా | AP CM YS Jagan Assures Flood Victims | Sakshi
Sakshi News home page

సమస్యలు వింటూ.. అక్కడే పరిష్కరిస్తూ.. వరద బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా

Published Sat, Dec 4 2021 4:32 AM | Last Updated on Sat, Dec 4 2021 4:52 PM

AP CM YS Jagan Assures Flood Victims - Sakshi

నెల్లూరు జిల్లా పెనుబల్లిలో బాధితులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి

సాక్షి, తిరుపతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇటీవలి వరదల్లో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, సహాయం చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఆయన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. తొలుత తిరుపతిలో వరద నష్టానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం సరస్వతినగర్, శ్రీకృష్ణానగర్, తిరుచానూరులో కాలినడకన నేరుగా బాధితుల వద్దకు వెళ్లారు. వారి కష్టాలను స్వయంగా విన్నారు. ప్రభుత్వ సాయం అందిందా? లేదా? అని ఆరా తీశారు.


నెల్లూరులో బైనాక్యులర్‌ ద్వారా పెన్నా ప్రవాహాన్ని, పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి 

అన్నా.. అక్కా.. అని ఆప్యాయంగా మాట్లాడుతూ, చిన్నారులను ఎత్తుకొని ముద్దు చేస్తూ.. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండని అడుగుతూ ముందుకు సాగారు. ప్రతి ఇంటి వద్ద ఆగి.. వారు చెప్పినవన్నీ శ్రద్ధగా విని, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వరద బాధిత కుటుంబాలకు చెందిన యువతీ యువకుల ఉపాధి అవకాశాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ను ఆదేశించారు. శ్రీకృష్ణానగర్‌ ముంపునకు గురికావటానికి గల కారణాలను స్థానికుడు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రమణారెడ్డి సీఎంకు వివరించారు.  

అన్నా.. అమ్మ మిమ్మల్ని చూడాలంటోంది
► తిరుపతి నగరంలోని సరస్వతినగర్‌కు చెందిన విజయకుమారి (స్విమ్స్‌లో హెడ్‌ నర్స్‌) రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచం పట్టింది. ఆమె కుమార్తె వైష్ణవి.. ‘అన్నా.. అమ్మ మిమ్మల్ని చూడాలంటోంది. ఓ సారి ఇంటికి రండన్నా’ అని సీఎంను కోరింది. స్పందించిన సీఎం.. నేరుగా వారి నివాసంలోకి వెళ్లి విజయకుమారిని పరామర్శించారు. ఆ తర్వాత.. రెండేళ్లుగా మంచం పట్టిన కిడ్నీ బాధితురాలు కుసుమ గురించి కుటుంబ సభ్యులు సీఎంకు వివరించారు. ఆయన నేరుగా వారి ఇంట్లోకి వెళ్లి.. ఆమె పక్కన కూర్చొని ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. పింఛను అందుతుందా? లేదా? అని అడిగారు. పింఛన్‌ వస్తోందని భర్త తెలిపారు. వీరిద్దరికీ అవసరమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 

► రుయా ఆస్పత్రిలో 15 ఏళ్లుగా ల్యాబ్‌లో పని చేస్తున్న తనను ఉన్నట్లుండి విధుల నుంచి తొలగించారని, తనకు న్యాయం చేయాలని శివకుమార్‌ అనే వ్యక్తి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ‘అందరికీ సాయం అందింది. ఎప్పుడూ మీరే సీఎంగా ఉండాలి’ అని కోమల, మస్తానిలు సంతోషం వ్యక్తం చేశారు. డీకేటీ స్థలంలో ఇల్లు నిర్మించుకుని 30 ఏళ్లుగా ఉంటున్న తనకు పట్టా మంజూరు చేయాలని వెంకటప్రసాద్‌ సీఎంకు విన్నవించారు. ఈ నెల 21న ఆ కార్యక్రమం మొదలవుతుందని, పట్టా తప్పకుండా ఇస్తారని హామీ ఇచ్చారు.

► ఎస్‌.మల్లికా బేగం, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ లక్ష్మీపతి, సి.రెడ్డెప్ప, సి.రాజమ్మ, జగదీశ్వరి, బేబి, మహిళా పోలీస్‌ నాగలక్ష్మి, రత్నమ్మ, మునెమ్మ తదితరులు సమస్యలు చెప్పుకున్నారు. చిత్తూరుకు చెందిన మస్తాన్, జమీనా దంపతులు క్యాన్సర్‌ చికిత్స కోసం సాయం చేయాలని కోరారు. అందరి సమస్యలు పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.  

► తిరుమల, తిరుపతి రుయా, స్విమ్స్, పద్మావతి అతిథి గృహంలో పని చేస్తున్న 20 మంది ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులు సీఎంను కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. తిరుపతి రూరల్‌ మండలం శెట్టిపల్లి భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తమకు న్యాయం చేయాలని బాధితులు విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. 


సీఎం జగన్‌ను ఆప్యాయంగా పలకరిస్తూ..

మీ సేవలు భేష్‌
తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు – పాడిపేట వద్ద స్వర్ణముఖి నదిపై వరద ఉధృతికి కొట్టుకుపోయిన వంతెనను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా రాయలచెరువు కట్ట పటిష్టతకు స్వచ్ఛందంగా సేవలు అందించిన ఆప్కాన్స్‌ సంస్థను అభినందిస్తూ.. ప్రాజెక్టు మేనేజర్‌ రంగస్వామిని సత్కరించారు. అనంతరం స్వర్ణముఖి నది ముంపునకు గురైన రామకృష్ణారెడ్డి కాలనీ వాసులు 32 మందిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసు కానిస్టేబుల్‌ వెంకటేశ్వర ప్రసాద్, స్థానికులు శ్రీనివాసులురెడ్డి, రెడ్డప్ప, మధులను అభినందించారు. సీఎం జగన్‌ ఆప్యాయంగా మాట్లాడటం, కుటుంబ సభ్యునిలా కలిసి పోయి.. ఓపికగా సమస్యలు వినడం, ఫోన్‌ నంబర్లు తీసుకోవడం, సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలివ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు పి.వి.మిథున్‌ రెడ్డి, యం.గురుమూర్తి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. 


తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో మహిళను పరామర్శిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం
► శుక్రవారం మధ్యాహ్నం 1.25 గంటలకు నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు సీఎం వైఎస్‌ జగన్‌.. సహాయక చర్యలను సమీక్షించడంతో పాటు, నష్టపోయిన బాధితులతో నేరుగా మాట్లాడి భరోసా కల్పించారు. వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. నెల్లూరు రూరల్‌ మండలం దేవరపాళెం గ్రామంలో పెన్నా ఉధృతికి కొట్టుకుపోయిన రహదారులు, పంటలు, భూముల కోతను పరిశీలించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 


► జొన్నవాడ, పెనుబల్లి భగత్‌సింగ్‌నగర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పెనుబల్లిలో సుమారు గంట సేపు స్థానికులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా రఘురామ్, విజయ్‌కుమార్‌ అనే రైతులు వారి గోడు వెళ్లబోసుకున్నారు. వేళాంగిణి, శ్రీలక్ష్మి, తదితర మహిళలు కష్టాలు చెప్పుకున్నారు. అందరి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించి.. సీఎం ముందుకు సాగారు.  


వరద చిత్రాలను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

నెల్లూరు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం
► నెల్లూరు నగరానికి శాశ్వత ముంపు పరిష్కారంగా పెన్నా నది కరకట్ట బండ్‌ నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆ పనులకు పండుగ తర్వాత శంకుస్థాపన చేస్తానని చెప్పారు. కొట్టుకుపోయిన సోమశిల డ్యామ్‌ అఫ్రాన్‌ నిర్మాణం కోసం రూ.120 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సంగం, నెల్లూరు బ్యారేజీ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. 
►రూ.2 వేలతో పాటు నిత్యావసర సరుకులు అందాయని అందరూ చెబుతున్నారని, ఇంకా వరద సాయం దక్కని వారు 5వ తేదీలోపు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులందరికీ సాయం అందుతుందని చెప్పారు.  
► అర్హత ఉండీ కూడా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకుంటే ఏడాదిలో డిసెంబర్, జూన్‌ నెలల్లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే విచారించి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 


బాధితుల సమస్యలను వింటున్న సీఎం జగన్‌

 
వరద బాధితుల సహాయార్థం రూ.1.35 కోట్ల విరాళం 
వరద బాధితుల సహాయార్థం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు దాతలు రూ.1.35 కోట్లను ముఖ్యమంత్రికి విరాళంగా అందజేశారు. నెల్లూరు పోలీసు గ్రౌండ్‌లోని హెలిప్యాడ్‌ వద్ద బీదా మస్తాన్‌రావు చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు బీదా మస్తాన్‌రావు రూ.కోటి చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి అందజేశారు. జొన్నవాడలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరిచలపతిరావు రూ.25 లక్షల చెక్కును, వవ్వేరు బ్యాంకు చైర్మన్‌ సూరా శ్రీనివాసులురెడ్డి రూ.10 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement