సాక్షి, అమరావతి: పిల్లల చదువులను ప్రోత్సహించడం–బాల్య వివాహాల నిరోధం లక్ష్యంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను ప్రవేశపెట్టి మరో విప్లవాత్మక అడుగు వేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, భవన నిర్మాణ కార్మిక కుటుంబాల్లో పేద యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించే ‘వైఎస్సార్ కళ్యాణ మస్తు’ పథకంతోపాటు ముస్లిం మైనారిటీ యువతుల కోసం ‘వైఎస్సార్ షాదీ తోఫా’ను సీఎం శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. 2 పథకాల వెబ్‌సైట్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఆ వివరాలివీ..
పేదరికాన్ని గట్టెక్కించే అస్త్రం
పిల్లలంతా కచ్చితంగా చదువుకోవాలని అడుగులు వేస్తూ మూడేళ్లుగా విద్యారంగంపై అత్యధిక శ్రద్ధ తీసుకున్నాం. విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తెచ్చాం. పిల్లలకు చదువులన్నవి ఒక ఆస్తి. పేదరికం నుంచి బయటపడేసే ఏకైక అస్త్రం చదువులే. ఆ దిశగా మనసా వాచా కర్మణా అడుగులు వేస్తున్నాం. పిల్లలను బడికి పంపిస్తున్న తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యాకానుకతోపాటు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నాం.
నాడు –నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం. వాటి నిర్వహణ కోసం టీఎంఎఫ్ (టాయిలెట్ మెయింట్‌నెన్స్ ఫండ్), ఎస్‌ఎంఫ్ (స్కూలు మెయింట్‌నెన్స్ ఫండ్) ఏర్పాటు చేశాం. పెద్ద పిల్లల చదువుల కోసం విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు చేపట్టాం. కరిక్యులమ్‌లో మార్పులు, జాబ్ ఓరియెంటెడ్ పాఠ్యప్రణాళికలు తీసుకొచ్చాం.
కచ్చితంగా టెన్త్ చదివించేలా..
పిల్లలు చదువుకునేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలనే తపన, తాపత్రయంతో ఇవాళ వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను ప్రారంభిస్తున్నాం. ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి పొందే పిల్లలు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన విధించాం. ఇది తల్లిదండ్రులు తమ పిల్లలను కచ్చితంగా పదో తరగతి చదివించేలా దోహదం చేస్తుంది.
ఇంటర్ కూడా చదువుకునే అవకాశం
పెళ్లి నాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి. ఇది రెండో నిబంధన. దీనివల్ల పిల్లలంతా చదువుకునే పరిస్థితి వస్తుంది. టెన్త్ పాసైన తర్వాత 18 ఏళ్ల వరకూ పెళ్లి చేసుకోలేరు కాబట్టి తదుపరి విద్యాభ్యాసంపై దృష్టి సారిస్తారు. 18 ఏళ్లు దాటకుంటే ఈ పథకాలు వర్తించవు కాబట్టి ఇంటర్ చదువుకునే అవకాశం వస్తుంది. ఇలా మార్పులు తేవడంతో పిల్లలు తప్పనిసరిగా చదివే పరిస్ధితి వస్తుంది. తద్వారా గొప్ప మార్పు వస్తుంది.
దూరదృష్టితో.. ఎంతో ఆలోచనతో
తలిదండ్రులు విద్యావంతులైతే వారి పిల్లలకూ చదువుల విలువ తెలియచేసే పరిస్థితి ఉంటుంది. ఈ తరాల కోసం మాత్రమే కాకుండా దూరదృష్టితో, ఎంతో ఆలోచనతో ఈ పథకాలను తెచ్చాం. ప్రతి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు వైఎస్సార్ కళ్యాణమస్తుతో మంచి జరుగుతుంది. ముస్లిం మైనార్టీలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
నాడు.. 17,709 మందికి రూ.68.68 కోట్లు ఎగ్గొట్టారు
గత ప్రభుత్వ హయాంలో పెళ్లికానుక అనే పథకాన్ని ప్రకటించి 2018లో నిలిపివేశారు. అది పిల్లలెవరూ చదువుకోవాలనే తాపత్రయంతో పెట్టిన పథకం కాదు. ఎన్నికల్లో ఎలా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ప్రకటించారు. తర్వాత పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టారు. 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్లు వివాహ ప్రోత్సాహకాలను చెల్లించకుండా ఎగ్గొట్టారు.
నేడు.. రెట్టింపు ప్రోత్సాహకాలు
ఇప్పుడు మనందరి ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఈ పథకాలు వర్తించేలా అన్ని చర్యలూ తీసుకుంది. వివక్ష, లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా అమలులో సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. గత సర్కారు ప్రకటించిన దానికన్నా దాదాపు రెట్టింపు ప్రోత్సాహాలు ఇప్పుడు ఈ పథకాల ద్వారా అందుతాయి.
జంట పథకాలు.. రెట్టింపు ప్రోత్సాహకాలు
- గత ప్రభుత్వం ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.లక్ష ఇస్తున్నాం.
- ఎస్సీ, ఎస్టీల్లో కులాంతర వివాహాలకు గత ప్రభుత్వం రూ.75 వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.1.20 లక్షలు ఇస్తున్నాం.
- గతంలో బీసీలకు రూ.30 వేలు ఇస్తామని ప్రకటిస్తే.. ఇప్పుడు మనం రూ.50 వేలు ఇస్తున్నాం. బీసీల కులాంతర వివాహాలకు నాడు రూ.50 వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.75 వేలు ఇస్తున్నాం.
- మైనార్టీలకు గత ప్రభుత్వం రూ.50 వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.లక్ష ఇస్తున్నాం.
- విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం రూ.లక్ష ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.1,50,000 ఇస్తున్నాం.
- భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు గత సర్కారు రూ.20 వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.40 వేలు ఇస్తున్నాం.
చదువులతో పథకాలకు లింక్
- ఇవన్నీ కూడా చదువులతో కనెక్ట్ అయిన పథకాలు. ఎందుకు ఇలా చేస్తున్నామంటే... అమ్మ ఒడి ద్వారా చదువుల బాట పట్టే పిల్లలు ఎక్కడా డ్రాప్ అవుట్స్‌గా మిగిలిపోకూడదు.
- ఈ పథకాలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి. పెళ్లైన 60 రోజుల్లో ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వలంటీర్ల సహకారంతో సంబంధిత డాక్యుమెంట్లు, పత్రాలు సమర్పించాలి. వివాహ సర్టిఫికెట్ సచివాలయాల్లో జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి.
- అర్హులైన వారికి ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకాన్ని వర్తింపచేస్తాం. అక్టోబరు, నవంబరు, డిసెంబరులో దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు జనవరిలో ప్రోత్సాహకం అందుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి లబ్ధిదారులకు ఏప్రిల్‌లో ప్రయోజనం చేకూరుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి జూలైలో ప్రోత్సాహకం అందుతుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబరు లబ్ధిదారులకు అక్టోబరులో ప్రోత్సాహం అందిస్తాం. ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులకు ప్రోత్సాహకాలు అందచేస్తాం.
- సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, సచివాలయాల శాఖ డైరెక్టర్ ఎస్‌ఎస్ మోహన్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment