ఏపీ ‘కాంట్రాక్టు’ ఉద్యోగులకు శుభవార్త | AP Contract Employees Regularization | Sakshi
Sakshi News home page

ఏపీ ‘కాంట్రాక్టు’ ఉద్యోగులకు శుభవార్త

Published Sat, Oct 21 2023 4:08 AM | Last Updated on Sat, Oct 21 2023 3:14 PM

AP Contract Employees Regularization - Sakshi

సాక్షి, అమరావతి:  గత ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కార్యరూపంలోకి తెచ్చింది. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం లభించడంతో చట్ట రూపం సంతరించుకుంది.

ఈ చట్టానికి సంబంధించి శుక్రవారం ప్రభుత్వ గజిట్‌లో ముద్రించింది. దీనిద్వారా 02–06–2014కు ముందు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న దాదాపు 10,117 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసు క్రమబద్థీకరణ జరగనుంది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.311 కోట్ల ఆర్థిక భారం పడనుంది.   
 

ఉద్యోగ సంఘాల హర్షం 
మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ తరఫున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో ముఖ్యమంత్రి జగన్‌ వెలుగులు నింపారని వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి పేర్కొన్నారు. దసరా సందర్భంగా వేలాదిమంది ఉద్యోగుల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని, సీఎం ఉద్యోగుల పక్షపాతిగా శాశ్వతంగా నిలిచిపోతారని చెప్పారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేయటంపై ప్రభుత్వ కళాశాలల ఏపీ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఇచ్చిన హామీకి కట్టుబడ్డ సీఎం జగన్, మంత్రివర్గం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్‌ కుమ్మరకుంట సురేష్, కో చైర్మన్‌ కల్లూరి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని ఏపీ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ ఫెడరేషన్‌ యూనియన్‌ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్‌రెడ్డి, కోశాధికారి పఠాన్‌ కరీంఖాన్‌ హర్షం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్ణయంతో 3,600 మంది కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చరర్లు, 350 మంది కాంట్రాక్టు పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, 600 మంది డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్లు లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు ఏపీ స్టేట్‌ కాంట్రాక్టు ఫార్మసిస్ట్‌ అండ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.రత్నాకరబాబు కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్ర హామీని నెరవేర్చి సీఎం జగన్‌ వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాలు పంచారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టి.కల్పలత హర్షం వ్యక్తం చేశారు. రెగ్యులరైజ్‌ అవుతున్న వారిలో దాదాపు 4 వేల మందికి పైగా బోధన రంగంలో సేవలు అందిస్తున్నవారేనని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  

ఏపీ నిరుద్యోగ  జేఏసీ హర్షం 
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు వేగంగా చర్యలు చేపడుతూ.. గతంలో ఇచి్చన వాటికి అదనంగా కొత్తగా 212 గ్రూప్‌–2 పోస్టులు మంజూరు చేయడంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంతకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే డీఎస్సీతో పాటు, పోలీసు శాఖ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ప్రకటించాలని కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement