Jakiya Khanum Oath: AP Council Deputy Chairperson Comments - Sakshi
Sakshi News home page

మంచిపేరు తెచ్చుకుంటా.. శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌

Published Sat, Nov 27 2021 3:31 AM | Last Updated on Sat, Nov 27 2021 3:09 PM

AP Council Deputy Chair Person Jakiya Khanum Comments After Oath Taking - Sakshi

సాక్షి, అమరావతి: శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా అత్యున్నత స్థానంలో మంచిపేరు తెచ్చుకునే విధంగా నడుచుకుంటానని జకియా ఖానమ్‌ చెప్పారు. డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమె శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమెను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, బీజేపీ, పీడీఎఫ్‌ సభ్యులు సాదరంగా తీసుకెళ్లి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైనార్టీ గృహిణిగా ఉన్న తనను శాసనమండలి సభ్యురాలిగా చేయడమే కాకుండా ఏకంగా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా తొలిసారిగా మైనార్టీ మహిళను ఎంపిక చేయడం పట్ల మైనార్టీ సోదర సోదరీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మహిళా పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

మన రాష్ట్రంలో అమలవుతున్న సామాజిక సంక్షేమ పథకాలను పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. సీఎం మంచి వ్యూహకర్త అని, ముందు చూపున్న వ్యక్తి అని ఆమె అన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం ఎంతో కృషిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలంతా ఆయనకు అండగా ఉంటారని చెప్పారు. 

మహిళలు అన్ని రకాలుగా పైకిరావాలి
 సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ‘ఈ రోజు అధ్యక్షా అని సంబోధించే స్థానంలో నా అక్క జకియా ఖానమ్‌ కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక గృహిణిగా చట్టసభల్లో అడుగుపెట్టడమే కాకుండా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఈ రోజు ఆ స్థానంలో కూర్చున్నారు. నిజంగా మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం, ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలి.. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి.. ప్రభుత్వమన్నది తోడుగా ఉండాలి.. అన్న మన ప్రయత్నం ఈ రెండున్నర సంవత్సరాలుగా జరుగుతోంది.

అందులో భాగంగా దేవుడు ఈ రోజు నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. మీకు మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను..’ అంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మాట్లాడుతూ మండలి చైర్మన్‌గా దళితవర్గానికి చెందిన మోషేన్‌రాజు, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళ జకియా ఖానమ్‌ను ఎంపిక చేసిన సీఎంని అభినందించారు.కాగా, సీఎంను అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం  జకియా ఖానమ్‌ కలిసి  తనను ఈ పదవికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement