తిరుపతి: అభివృద్ధి అధికార వికేంద్రీకరణ నినాదాలతో తిరుపతి మారుమ్రోగింది. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ మేధావులు విద్యార్థి సంఘాల నేతలు మహిళలు పెద్ద ఎత్తున నినదించారు. మూడు రాజధానులు మద్దతుగా శనివారం.. తిరుపతి ఇందిరా మైదానంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు వేలాదిగా తరలివచ్చారు. రాయలసీమ వాసులే కాకుండా ఉత్తరాంధ్ర అమరావతి ప్రాంతాల నుంచి వచ్చిన మేధావులు వివిధ వర్గాలకు చెందిన నేతలు తమ గొంతును వినిపించారు. అభివృద్ధి అన్నది ఒకే ప్రాంతానికి పరిమితమయితే మిగతా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని స్పష్టం చేశారు.
రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. అమరావతిలోనే రాజధాని ఉండాలని చేసి డిమాండ్ తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని సభలో ప్రసంగించిన మేధావులు విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విధంగా సమగ్రాభివృద్ధి బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో వేలాది మంది చేతులు పైకెత్తి తమ హర్షం ప్రకటించారు.
పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు డిమాండ్, రాయలసీమ అవసరాలు, ప్రభుత్వం నుంచి సాధించాల్సిన హక్కుల కోసం తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించిన ప్రజా రాజధానుల మహాసభ కొనసాగుతోంది. రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ మహాసభలో సీమ అభివృద్ధిని ఆకాంక్షించే అన్ని సంఘాలు పాల్గొన్నాయి.
రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షులు భూమన్ మాట్లాడుతూ.. స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ అమరావతి నినాదం ఎత్తుకొందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని అది జరగాలంటే ఉత్తరాంధ్ర, రాయల సీమల్లోనూ రాజధానుల ఉండాలని తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో రిలేదీక్షలు చేపడతామని చెప్పారు. వికేంద్రీకరణ సాధన కోసం మహా పాదయాత్రకు సిద్ధమవుతామని తెలిపారు.
చిత్తూరు, కడప, కర్నూల్. అనంతపురం జిల్లాల నుంచి ప్రతినిధులు మేధావులు హాజరయ్యారు. రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ (తిరుపతి), రాయలసీమ మహాసభ అధ్యక్షుడు, రచయిత శాంతి నారాయణ (అనంతపురం), రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి (కడప), కుందూ పోరాట సమితి అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి (కర్నూల్) పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment