సింహాచలం వద్ద ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నర్సరీలో పెంచుతున్న మొక్కలు
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న హరిత నగరాలకు అవసరమైన మొక్కలను సొంతంగా అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మూడుచోట్ల నిర్వహిస్తున్న నర్సరీల్లో అవసరమైన మొక్కలను పెంచుతోంది. మొదటి విడతగా జూలై నెలలో 45 నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే.
అయితే, గ్రీనింగ్ కార్పొరేషన్ సొంతంగా పనులు చేపట్టిన 11 యూఎల్బీల్లో మినహా, సొంతంగా పనులు చేపట్టిన మిగిలిన యూఎల్బీల్లో మొక్కల ధరల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. గ్రీనింగ్ కార్పొరేషన్ నిర్ణయించిన ధరలు గిట్టుబాటు కావంటూ.. నాలుగైదు పర్యాయాలు టెండర్లు పిలిచినా కొన్ని మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఐదోసారి ఇటీవల ఈ పట్టణాలకు మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో హరిత ప్రాజెక్టు చేపట్టినా అవసరమైన మొక్కలు ఒకే ధరకు లభించేలా, మార్కెట్ ధర కంటే తక్కువకే అందించేలా చర్యలు చేపట్టారు.
అందుకోసం గ్రీనింగ్ కార్పొరేషన్ నర్సరీల నుంచే మొక్కలు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శ్రీకాళహస్తి, సింహాచలం, విజయవాడ (నున్న) ప్రాంతాల్లోని నర్సరీలను సిద్ధం చేశారు. హరిత నగరాల్లో మొత్తం 54 రకాల మొక్కల జాతులను ఎంపిక చేసి నాటుతున్నారు. మరో మూడు, నాలుగు నెలల్లో 78 యూఎల్బీల్లో చేపట్టనున్న జగనన్న హరిత నగరాల్లో వీటిని నాటనున్నారు.
అధిక ధరలకు చెక్ పెట్టిన గ్రీనింగ్ కార్పొరేషన్
సాధారణంగా పట్టణాల్లో గ్రీనింగ్ పనులను ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు సొంతంగా చేపట్టేవి. మొక్కల ధరలు కూడా స్థానికంగానే నిర్ణయించేవారు. దీనివల్ల ఒక్కో యూఎల్బీలో మొక్కల ధరలో భారీ వ్యత్యాసం ఉండేది. అయితే, జూలైలో 45 నగరాల్లో హరిత కార్యక్రమాలు చేపట్టారు. అంతకు నెలరోజుల ముందే ఏపీ గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు నర్సరీ రైతుల నుంచి సీల్డ్ కవర్లలో మొక్కల ధరలను సేకరించారు.
వాటిలో తక్కువగా ఉన్న ధరలను ప్రామాణికంగా తీసుకుని, మొక్కల రవాణాలో జరిగే నష్టానికి ఐదు శాతం ధర కలిపి కాంట్రాక్టర్‌కు లాభదాయకంగా ఉండేలాగా ధరలను నిర్ణయించారు. ఈ విధంగా మొత్తం 14 యూఎల్బీల్లో చేపట్టే పనులకు మొక్కల రేట్లు ఒకేలా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే, వీటిలో 11 యూఎల్బీల్లో పనులు ప్రగతిలో ఉండగా, ఎమ్మిగనూరు, బాపట్ల, పాలకొల్లు యూఎల్బీల్లో గ్రీనింగ్ పనులు చేపట్టలేదు.
వీటికి నాలుగు దఫాలుగా టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాకపోగా, స్థానిక అధికారులు సైతం చొరవ చూపలేదు. మిగిలిన 31 యూఎల్బీలు సొంతంగా టెండర్లు పిలిచి, వారు నిర్ణయించిన ధరకు మొక్కలు కొనుగోలు చేశారు. ఈ ధరలు గ్రీనింగ్ కార్పొరేషన్ నిర్ణయించిన ధరలకంటే అధికంగా ఉండడం గమనార్హం.
ఇకపై అలాంటి ధరల వ్యత్యాసం, బయటి నుంచి మొక్కలు కొనుగోలు చేసే అవకాశం లేకుండా ఏపీ గ్రీనింగ్ కార్పొరేషన్ సొంతంగా హరిత నగరాలకు అవసరమైన మొక్కల పెంపకాన్ని చేపడుతోంది. రెండో విడత జగనన్న హరిత నగరాలకు అవసరమైన 54 రకాల మొక్కలను గ్రీనింగ్ కార్పొరేషన్ నర్సరీల నుంచే సరఫరా చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment