సాక్షి, అమరావతి: భూగర్భ జలాలను పెంపొందించడం, పొదుపుగా వినియోగించడం, వాటిని సంరక్షించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 7,089 మండలాలు, బ్లాక్‌లు, వ్యాలీలు, ఫిర్కాల పరిధిలో భూగర్భ జలమట్టంపై కేంద్ర జల్ శక్తి శాఖ అధ్యయనం చేసింది. భూగర్భ జలాలను పరిమితికి మించి తోడేస్తున్న మండలాలు, బ్లాక్‌లు 1,006 ఉంటే.. అందులో కేవలం 6 మాత్రమే ఏపీలో ఉన్నాయి.
పరిమితికి మించి భూగర్భ జలాలను తోడేస్తున్న ప్రాంతం దేశంలో సగటున 14.19 శాతం ఉంటే.. ఇందులో రాష్ట్రంలో 0.98 శాతం ప్రాంతం మాత్రమే ఉంది. భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరిన రాష్ట్రాల్లో పంజాబ్(76.47 శాతం వినియోగం) మొదటి స్థానంలో ఉండగా.. రాజస్తాన్(72.52 శాతం) రెండో స్థానంలో, హరియాణా(61.54 శాతం) మూడో స్థానంలో, ఢిల్లీ(44.12 శాతం) నాలుగో స్థానంలో, తమిళనాడు(30.87 శాతం) ఐదో స్థానంలో నిలిచాయి.
దాద్రానగర్ హవేలి, డయ్యూ డామన్‌లో భూగర్భ జలాలను వంద శాతం తోడేయడం వల్ల వాటి పరిస్థితి ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. దేశంలో భూగర్భ జలాల పరిస్థితిపై కేంద్ర భూగర్భ జలవనరుల మండలితో కలిసి 2020లో ఒకసారి.. 2022లో మరోసారి కేంద్ర జల్ శక్తి శాఖ అధ్యయనం చేసింది. ఇందులో వెల్లడైన ప్రధానాంశాలు..
రాష్ట్రంలో 28 శాతమే వినియోగం..
♦ దేశంలో గతేడాది కురిసిన వర్షాల వల్ల భూగర్భంలోకి 15,451.65 టీఎంసీల నీళ్లు ఇంకిపోయి భూగర్భ జలాలుగా మారాయి. ఇందులో 14,056.20 టీఎంసీలను వినియోగించుకోవచ్చు. అందులో 8,444.73 టీఎంసీలను(60 శాతం) ఇప్పటికే ఉపయోగించారు.
♦ ఏపీలోని 667 మండలాల పరిధిలో గతేడాది కురిసిన వర్షాల వల్ల 961.13 టీఎంసీలు భూగర్భ జలాలుగా మారాయి. ఇందులో 913.11 టీఎంసీలను ఉపయోగించుకోవచ్చు. కానీ.. 263.05 టీఎంసీలు(28 శాతం) మాత్రమే వినియోగించారు. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి, ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు, శ్రీసత్యసాయి జిల్లాలోని గాండ్లపెంట, హిందూపురం , రొళ్ల, తనకల్లులో మాత్రమే పరిమితికి మించి భూగర్భ జలాలను ఉపయోగించారు.
♦ రాష్ట్రంలో 667 మండలాల పరిధిలోని భౌగోళిక విస్తీర్ణం 1,40,719.5 చదరపు కిలోమీటర్లు కాగా, ఇందులో 1,380.65 చదరపు కిలోమీటర్ల భూ భాగంలో మాత్రమే భూగర్భ జలాలను పరిమితికి మించి వాడారు.
సమృద్ధిగా వర్షాలు.. పెరిగిన భూగర్భ జలాలు..
రాష్ట్రంలో 2019 నుంచి ఏటా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటిని ఒడిసిపట్టి.. ప్రాజెక్టులు, చెరువులు నింపుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అత్యధిక ఆయకట్టుకు ఏటా నీళ్లందిస్తోంది. భూగర్భ జలాల సంరక్షణ కట్టడాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. 2020లో 850.91 టీఎంసీలు భూగర్భ జలాల రూపంలోకి మారగా.. 2022లో 961.13 టీఎంసీలు రూపాంతరం చెందాయి.
2020లో ఉపయోగించుకోదగ్గ భూగర్భజలాలు 810.36 టీఎంసీలుగా ఉండగా.. 2022 నాటికి 913.11 టీఎంసీలకు పెరిగింది. గతేడాది భూగర్భ జలాలను 269.41 టీఎంసీలు వాడుకోగా.. 2022లో 263.05 టీఎంసీలు మాత్రమే ఉపయోగించారు. రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సురక్షిత స్థాయిలో ఉన్న మండలాలు 2020లో 551 ఉండగా.. 2022లో వాటి సంఖ్య 598కి పెరిగింది. పరిమితికి మించి తోడేసిన మండలాలు 2020లో 23 ఉండగా.. 2022లో వాటి సంఖ్య 6కు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment