పలుచోట్ల గ్రామ, వార్డు వలంటీర్లు నిరసన దీక్షలు
సాక్షి నెట్‌వర్క్: తమకు ఉద్యోగ భద్రత(job security) కల్పించాలని, ఎన్నికల ముందు టీడీపీ(TDP) ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని డిమాండు చేస్తూ గ్రామ, వార్డు వలంటీర్లు(Volunteers) శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. తక్షణం వలంటీర్లను రెన్యువల్ చేసి, ఆరు నెలలుగా పేరుకుపోయిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన దీక్షలకు ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. అధికారంలోకి రాక ముందు ఒక మాట, వచ్చాక మరోమాట మాట్లాడడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఎదుట వలంటీర్లు నిరసన దీక్షలు(Volunteers Protest) ప్రారంభించారు. వలంటీర్లను రెన్యూవల్ చేయకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మోసంచేసిందని ఆరోపిస్తున్న టీడీపీ నాయకులు.. లిక్కర్ టెండర్లు, ఇసుక టెండర్లు ఇచ్చినట్లుగానే వలంటీర్లను కూడా రెన్యువల్ చేస్తూ ఎందుకు ఆదేశాలివ్వరని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తమను రోడ్డునపడి అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిందని విజయవాడలో వలంటీర్లు ఆవేదన వ్యక్తంచేశారు. తమ దుస్థితికి ప్రభుత్వమే కారణమంటూ వారు దుమ్మెత్తి పోశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం జరిగింది.
కూటమి ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని, ఈ దుస్థితికి కారణం ప్రభుత్వమేనని ఆరోపించారు. మంచి ప్రభుత్వమని స్టిక్కర్లు వేసుకోవడం కాదు, వలంటీర్లకు మేలుచేసే మంచి జీఓలు తెచ్చి రాష్ట్రంలోని 2.60 లక్షల వలంటీర్ల కుటుంబాలను ఆదుకోవాలని వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు కోరారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తామని.. అలా చంద్రబాబు ఇంటికీ వెళ్తామన్నారు. ఇక విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూడా ఈ నిరసన దీక్ష జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment