ఎన్నికల ముందు చెప్పిందేమిటి.. ఇప్పుడు చేస్తున్నదేమిటి?
రూ.వేల కోట్ల చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు?
ఎస్సీ, ఎస్టీలకు, వృత్తిదారులకు ఉచిత, సబ్సిడీ విద్యుత్ కొనసాగించాలి
‘ఏపీఈఆర్సీ’ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో మండిపడ్డ ప్రతిపక్ష నేతలు, ప్రజలు
రెండు యూనిట్ల వినియోగానికి రూ.913 బిల్లు వచ్చిందంటూ మొరపెట్టుకున్న బాధితుడు
సాక్షి, అమరావతి: ‘రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీలను ఎవరినడిగి పెంచారు? కనీసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు’ అని ప్రతిపక్ష పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన వార్షిక ఆదాయ, అవసరాల నివేదికలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మంగళవారం బహిరంగ విచారణ చేపట్టింది.
మండలి ఇన్‌చార్జ్ చైర్మన్ ఠాగూర్ రామ్‌సింగ్, సభ్యుడు పీవీఆర్ రెడ్డి విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అభిప్రాయాలు సేకరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు తీసుకున్నారు.
ప్రజలపై మోపుతున్న అదనపు విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా, ట్రూ అప్, సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను పెట్టవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. బహిరంగ విచారణ జరుగుతున్న వేదిక వద్ద వివిధ రాజకీయ పార్టీలతోపాటు వినియోగదారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.15 వేల కోట్లకుపైగా భారం మోపిందన్నారు.
గత ప్రభుత్వం చేసిన మంచిని కొనసాగించాలి
విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం మాటతప్పి నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు, వృత్తిదారులకు ఉచిత, సబ్సిడీ విద్యుత్ ఇవ్వడం మంచిపని అని..దానిని కూటమి ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. ‘షార్ట్ టెర్మ్’ పేరుతో రూ.వేల కోట్ల అవినీతి జరుగుతోందని, దీనిపై విచారణ చేయాలన్నారు.
సౌర విద్యుత్‌పై జీఓ ఏదీ..?
గత ప్రభుత్వ తప్పులు వెతకడం అనసరమని ఫార్మర్స్ ఫెడరేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ వేణుగోపాలరావు అన్నారు. సౌర విద్యుత్‌ను ఒడిసిపట్టుకుంటామనిప్రకటనలు చేయడం తప్ప ఇంతవరకూ కూటమి ప్రభుత్వం జీఓ జారీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శీర్షాసనం చేసి ఆయన నిరసన తెలిపారు.
ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ
మాకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచమని, తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీఇచ్చి ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.15,485 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపైమోపుతున్నారన్నారు. పెంచిన చార్జీలు రద్దు చేసి, ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే ఉపసంహరించాలని ఏపీఈఆర్‌సీని కోరినట్లు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment