
ప్రతీకాత్మక చిత్రం
విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆగస్ట్ 16 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ చెప్పారు.
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆగస్ట్ 16 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ చెప్పారు. కలెక్టరేట్‌లో బుధవారం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా నిబంధనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహిస్తామని..ప్రతి ఒక్క అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలని సూచించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కేంద్రపాలిత ప్రాంతం యానాంకు చెందిన యువత మాత్రమే రిక్రూట్‌మెంట్‌కు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్ట్ 3లోగా www.joinindianarmy.nic.inలో దరఖాస్తు చేసుకోవాలని, ఆగస్ట్ 9 నుంచి అడ్మిట్ కార్డ్స్ అందుబాటులోకి వస్తాయని వివరించారు. దళారులకు డబ్బులు చెల్లించి మోసపోవద్దని సూచించారు.
భర్తీ చేసే పోస్టులివే: సోల్జర్–జనరల్ డ్యూటీ, సోల్జర్–టెక్నికల్/ ఏవియేషన్, సోల్జర్–టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్–క్లర్క్/స్టోర్ కీపర్, సోల్జర్ ట్రేడ్‌మన్.
అర్హత: పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి, 10వ తరగతి, సంబంధిత సబ్జెక్టులతో 10+2/ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.
వయసు: అభ్యర్థుల వయసు సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులకు 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు ఉండాలి. మిగతా పోస్టులకు 17 ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఉమ్మడి ప్రవేశ పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.