ఈ హత్యాయత్నం చంద్రబాబు కుట్రే | Babu who provoked activists targeted CM Jagan in Tadikonda assembly | Sakshi
Sakshi News home page

ఈ హత్యాయత్నం చంద్రబాబు కుట్రే

Published Mon, Apr 15 2024 5:05 AM | Last Updated on Mon, Apr 15 2024 5:05 AM

Babu who provoked activists targeted CM Jagan in Tadikonda assembly - Sakshi

తాడికొండ సభలో సీఎం జగన్‌ లక్ష్యంగా కార్యకర్తలను రెచ్చగొట్టిన బాబు

ఏ రాయి దొరికితే దాంతో చిత్తుగా కొట్టాలని పిలుపు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని పచ్చ ముఠా పక్కా పథకం ఉన్నట్లు చంద్రబాబు మాటలే చెబుతున్నాయి. శనివారం సాయంత్రం తాడికొండలో జరిగిన సభలో ప్రసంగించిన చంద్రబాబు.. సీఎం జగన్‌ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా రెచ్చగొట్టారు. ఏ రాయి దొరికితే అది తీసుకొని దాడి చేయాలంటూ ఉసిగొల్పారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే జగన్‌పై దాడి జరగడం గమనార్హం.శనివారం సాయంత్రం 4 గంటలకు తాడికొండలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు గంటకు పైగా ప్రసంగించారు.

ఆయన ప్రసంగం ఆసాంతం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషిస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు లాంటి జగన్‌రెడ్డిని గెలిపించుకున్నామని, దాని ఫలితం.. గత ఐదేళ్లుగా అవస్థలు పడుతున్నామని అన్నారు. ఇప్పుడు ప్రజలంతా తిరుగుబాటుకు సిద్ధం అవుతున్నారని చెప్పారు. మీకు పట్టుదల ఉందా లేదా అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. మీ పొట్ట కొట్టిన ఫ్యాన్‌ను చిత్తు చిత్తు చేసి చెత్తకుప్పలో పడేయాలన్నారు.

అమరావతి ద్రోహుల్ని తరిమికొడదాం అంటూ రెచ్చగొట్టారు. ‘ప్రతి ఒక్కరూ రాయి తీసుకుని.. ఏది దొరికితే అది తీసుకుని ఆ దున్నపోతుపై (జగన్‌) దాడి చేయండి. ఫ్యాన్‌ దూరంగా విసిరేయండి’ అంటూ తీవ్రంగా రెచ్చగొట్టారు. ఈ ప్రసంగాన్ని ఎల్లో మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ సభ ముగిసిన కొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై విజయవాడ సింగ్‌నగర్‌లో హత్యాయత్నం జరిగింది. దీంతో చంద్రబాబు నాయుడు ప్రసంగానికి, దాడికి సంబంధం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement