అనంతపురం కల్చరల్: ‘బంజారా..’ ఈ పేరు వినగానే విభిన్నమైన వేషధారణతో ఉన్న స్త్రీలు, ఆజానుబాహులైన పురుషులు కళ్ల ముందు కనిపిస్తారు. అయితే వీరు అసమాన వీరపరాక్రమాలకు ప్రతీకలైన రాజపుత్రులకు వారసులనే విషయం కొద్దిమందికే తెలుసు. సంచార జాతులుగా జీవిస్తున్న బంజారాలు ఒకనాడు సూర్య, చంద్ర వంశాలకు చెందిన రాజ పుత్రులని చరిత్ర చెబుతోంది. వారి ఆచారాలు, వ్యవహారాలు, వేషధారణలూ విలక్షణంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో తమ సంస్కృతికి అద్దం పట్టే బోనాల పండుగను మంగళవారం శోభాయమానంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
ఉమ్మడి జిల్లాలో బంజారాలు ఇలా...
గిరిజన తండాలుః 649
పంచాయతీలుః 242
బంజారాల సంఖ్యః దాదాపు 2 లక్షల మంది
(2011 జనాభా లెక్కల ప్రకారం)
ఊరికి దూరంగా ఎందుకు?
బంజారాలు సాధారణంగా అటవీ ప్రాంతాల్లో, ఊరికి దూరంగా, కొండకోనల్లో జీవిస్తుంటారు. వీరి నివాసాలను ‘తండా’లు అని పిలుస్తారు. అలా ప్రారంభమైన ఊరి బయట నివాసం కాలక్రమంలో స్థిరపడిపోయి తండాలుగా రూపుదిద్దుకున్నాయి. ‘తండా’ అంటే సరుకు నింపిన గోనె సంచుల సమూహమని అర్థం. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయమే. వారిలో కొద్ది మంది వ్యాపారాలు చేసుకుంటూ బతికేవారని ‘లంబాడీ’లని, ‘సుగాలీ’లని పిలుస్తుంటారు. ఒకప్పుడు రాథోడ్, చౌహాన్, పవార్, జాదవ్ లాంటి రాజపుత్ర వంశాల పరంపరలోనే నేటికీ వీరు కొనసాగుతున్నారు. తండా ప్రజలు ఓ నాయకుడిని ఎన్నుకొని, ఆయన అదుపు ఆజ్ఞలో నివసిస్తారు. తమ ఆచార వ్యవహారాలను, సంస్కారాలను నియమంగా ఆచరిస్తారు, పాటిస్తారు. కష్టసుఖాల్లో కలిసి జీవిస్తారు. పారదర్శక విలువలకు ప్రాధాన్యతనిస్తూ కొనసాగే తండాల విలక్షణ జీవనం ఇతరులకు ఆదర్శప్రాయం.
భిన్నమైన వేషధారణ..
వేలాది మంది ఓ చోట గుంపుగా ఉన్నా... బంజారాలను వారి వస్త్రధారణ చటుక్కున పట్టించేస్తోంది. ఆధునికత పెరిగిన నేటి రోజుల్లోనూ వారు తమ సంప్రదాయ దుస్తులతో విభిన్నంగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు. ఆభరణాలు, గవ్వలు కలబోసి రూపొందించిన దుస్తులు చాలా బరువుగా ఉంటాయి. వెండి, బంగారు, కంచు ఇత్తడి లోహాలతోపాటు ఏనుగు దంతాలతో చేసిన గాజులు మోచేతి వరకూ ధరిస్తారు. తలపై నుంచి ధరించే వస్త్రం అంచుకు పావలా బిళ్లలు, అద్దాలు కుట్టి ఉంటాయి. కాళ్లకు ధరించే కడియాలు నడుస్తున్నపుడు చేసే వింత శబ్ధాలు కూడా ఎంతో వినసొంపుగా ఉంటాయి. విభిన్న వస్త్రధారణతో పాటు తమకే సొంతమైన పాటలతో వారు చేసే నృత్యం ఎవరినైనా మైమరపిస్తుంది. లిపి లేకున్నా వీరు ఎక్కడ జీవిస్తే ఆ భాషను వంట పట్టించుకుని లంబాడీ పదాలతో అద్భుతైన గీతాలను రచించుకున్నారు. వీటిలో దేశభక్తి ప్రబోధమైవేకాక, కామోద్రేకం కలిగించేవి, ఆధ్యాతి్మకతను పెంచేవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీరు కష్టజీవులు. కాయకష్టంతో జీవనం సాగించడంలో ఉన్న ఆనందం మరెందేలోనూ లేదని వీరు అంటుంటారు.
శతాబ్దాల కిందటే అనంతలో..
ప్రపంచవ్యాప్తంగా సంచారం చేస్తూ అన్ని ప్రాంతాల్లో స్థిరపడినట్లే బంజారాలు ‘ఉమ్మడి అనంత’లోనూ కొన్ని వందల ఏళ్ల కిందటే వేర్వేరు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 1978లో అప్పటి ప్రభుత్వం ‘రోటీ కపడా ఔర్ మకాన్’ పథకం కింద ప్రస్తుతమున్న నాయక్‌నగర్‌ను ఏర్పాటు చేసి చాలా మందికి పట్టాలిచ్చి ఒకచోటకు చేర్చింది. సంచార జాతులుగా కనపడే వీరు ఆధ్యాతి్మకంగానూ చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బంజారాలు ఆరాధ్య దైవంగా, కొలుచుకునే గురువుగా భాసిల్లే సేవాలాల్ మహారాజ్ కూడా అనంత వాసి కావడం విశేషం. ఆయన ఆదేశానుసారం వారి ప్రాచీన ఆచారాలను వదలకుండా ఇతర ప్రాంతాలకూ అనంత బంజారాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఉగాది, దీపావళి, హోళీ పండుగలను విశేషంగా జరుపుకుంటారు. ఆధునిక పోకడలు ఎన్ని ఉన్నా... నేటికీ ఆచారాలను వదలకుండా లంబాడీల సంప్రదాయ పర్వదినాల సందడి నిత్యనూతనంగా సాగుతోంది.
అమ్మోరికి బోనాల సమర్పణ..
అనంతపురంలోని నాయక్‌నగర్ ఏర్పడిన తొలి రోజుల్లోనే బంజరాల కులదైవమైన మారెమ్మ ఆలయాన్ని ఏర్పాటైంది. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించుకుని శతాబ్దాలుగా వస్తున్న ‘«శీతలయాడి ఉత్సవం’ (అమ్మవారికి బోనాలు సమర్పించే జాతర) ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. తమ ఇష్టదైవాలైన సీతలయాడి, మే రామ భవాని, తుల్జాభవానీ, హింగ్లా భవానీ, కెంకాళి భవానీ, మంత్రాలి భవానీ, ద్వాలంగార్ భవానీ తదితర అమ్మవార్లను ఘనంగా పూజిస్తుంటారు. ఈ బోనాల పండుగకు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన బంధువులు సైతం తప్పనిసరిగా తరలివస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి నాట్యం చేసే తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో విలక్షణ శైలితో సాగే బోనాల జాతరను ఈ నెల 2న (ఆరుద్రకార్తె, మంగళవారం) అనంతపురంలోని నాయక్‌నగర్‌లో నిర్వహించేందుకు బంజారాలు సిద్ధమయ్యారు.
ఎక్కడ ఉన్నా మేము ప్రత్యేకమే
ఒకనాడు ప్రపంచమంతటా తిరిగి వ్యాపారాలు సాగించిన చరిత్ర బంజారాలది. ఔరంగజేబు రాకతో బంజారాలు కకావికలమయ్యారు. అలా అంతటా తిరుగుతూ మా పూరీ్వకులు అనంతకూ వలస వచ్చారు. ప్రాంతాలు వేరైనా మా సంప్రదాయాలు, పండుగలు, ఆచార వ్యవహారాలను వదలడం లేదు. మంగళవారం సాగే జాతరకు అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా.
– శంకరశివరావు రాథోడ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అనంతపురం
సనాతన ధర్మాన్ని వీడలేదు
సుగాలీలు, లంబాడీలని పిలిచే మా జాతి ఒకనాటి రాజపుత్ర వీరుల వంశానికి చెందినదంటే చాలా మంది నమ్మరు. మా ఆచారాలు భిన్నంగానే ఉంటాయి. ప్రాణం పోయినా సనాతన ధర్మాన్ని వీడి ఇతర మతాల వైపు చూడం. శ్రీరాముడు మాకు ఆదర్శ పురుషుడు. అలాగే గ్రామదేవతలైన అమ్మవార్లను పంటలు బాగా పండాలని, వానలు సమృద్దిగా కురవాలని కోరుకుంటూ బోనాలు సమరి్పస్తాం.
– శాంతిబాయి, నాయక్‌నగర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment