
సాక్షి, అమరావతి: అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన రాబందు బుధవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల అటవీప్రాంతంలో కనిపించింది. స్థానికంగా ఎర్ర బొరవ (యూరేషియన్ గ్రిఫిన్)గా పిలిచే దీనిని పర్యావరణవేత్త, బర్డ్ వాచర్ జిమ్మీ కార్టర్ గుర్తించి తన కెమేరాలో బంధించారు. ఆఫ్రికా, యూరోప్‌లోని కొన్ని ప్రాంతాలు, మన దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఈ జాతి రాబందులు ఎక్కువగా కనిపిస్తాయి. దీని రెండు ఉప జాతుల్లో ఒకటి యూరోప్‌లో, రెండోది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి. మైదాన ప్రాంతాలు, కొండలు, ఎడారి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కొండల్లో గూళ్లు ఏర్పర్చుకుని నివసిస్తాయి. పశువుల కళేబరాల్లో డైక్లోఫినాక్ వంటి డ్రగ్స్ ఎక్కువగా ఉండటంతో వాటిని తినడం వల్ల మన దేశంలో 95 శాతం అంతరించిపోయాయి. ఎప్పుడో ఒకసారి ఇలా కనిపిస్తున్నాయి.
నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు
ఈ జాతి రాబందులు దక్షిణ భారత దేశంలోకి చాలా అరుదుగా వస్తాయి. రికార్డుల ప్రకారం ఇప్పటికీ రెండు సార్లు మాత్రమే మన ప్రాంతానికి వచ్చినట్టు నమోదైంది. పదేళ్ల కిందట మొదటిసారిగా శ్రీహరికోట సమీపంలోని పులికాట్ సరస్సు వద్ద కనిపించగా, నాలుగేళ్ల కిందట గుంటూరు జిల్లా ఉప్పలపాడు వద్ద రెండోసారి కనబడినట్టు రికార్డుల్లో నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment