తిరుపతిలో మాట్లాడుతున్న సుబ్రహ్మణ్యస్వామి
తిరుపతి లీగల్, సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి దినపత్రిక 2019 డిసెంబర్ 1వతేదీన కథనం ప్రచురించడంపై ఆమోద పబ్లికేషన్స్‌పై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించారు. బుధవారం తిరుపతి కోర్టు సముదాయాల వద్ద, తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఈవో అభ్యర్థన మేరకు, తిరుమల శ్రీవారి భక్తుడిగా పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. సెక్షన్ 32 ప్రకారం టీటీడీ ఈవోను వాదిగా పేర్కొంటూ టీటీడీ తరఫున కేసు కాగితాల్లో సంతకాలు చేయడానికి తిరుపతికి వచ్చినట్లు చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, మత విద్వేషాలు రగిల్చేలా ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించిందన్నారు.
అసత్య వార్తల ప్రచురణపై క్షమాపణలు చెప్పాలని టీటీడీ పంపిన నోటీసుపై పత్రిక యాజమాన్యం స్పందించలేదన్నారు. టీటీడీని క్రైస్తవమయం చేస్తున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారం కుట్ర వెనుక అసలు సూత్రధారి చంద్రబాబేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు మరో దారిలేక చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కొందరు నేతలు కూడా అందుకు సహకరిస్తున్నారని తెలిపారు.
టీటీడీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకుడి ఆరోపణల ఆధారంగా ఆంధ్రజ్యోతి ఆ కథనాన్ని ప్రచురించినట్లు ఓ విలేకరి సుబ్రహ్మణ్యస్వామి దృష్టికి తేగా.. అందులో అలా ఎక్కడా లేదన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ఆంధ్రజ్యోతిపై ఏడాది క్రితం పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తును పర్యవేక్షించాలని హైకోర్టును కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకునేందుకు సీఎం జగన్ సరైన రీతిలో ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
అవే ఫలితాలు పునరావృతం..
‘సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాజకీయంగా సుదీర్ఘమైన ఉజ్వల భవిష్యత్తు ఉందన్న వాస్తవాన్ని గుర్తించి చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ అద్భుత విజయం సాధించారు. ప్రధాని మోదీని విడిచిపెట్టి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పంచన చేరినప్పటికీ ఆ ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఫలితాలు రానున్నాయి’ అని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీఎం జగన్‌ను కలిసిన సుబ్రహ్మణ్యస్వామి
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన నివాసానికి వచ్చిన ఆయన్ను సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సుబ్రహ్మణ్యస్వామి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలసి సీఎం నివాసానికి చేరుకున్నారు. భోజనం అనంతరం స్వామి తిరిగి వెళ్లిపోయారు.
ఆడిట్‌తో బాబు నిర్వాకాలు బయటపడడం ఖాయం
‘టీటీడీ ఆదాయ వ్యయాలను కాగ్‌తో ఆడిట్ చేయించాలని సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. హిందూ ఆలయాల ఆదాయ వ్యయాలను కాగ్‌తో ఆడిట్ చేయించాలని దేశంలో నిర్ణయం తీసుకున్న మొదటి ముఖ్యమంత్రి ఆయనే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీటీడీ ఆదాయ వ్యయాలను కాగ్‌తో ఆడిటింగ్ చేయించమని అడిగితే సమ్మతించ లేదు. ఆ విషయం కోర్టు రికార్డుల్లో నమోదైంది. సీఎం వైఎస్ జగన్ స్వచ్ఛందంగా స్పందించి టీటీడీ ఆదాయ వ్యయాలను కాగ్‌తో ఆడిటింగ్ చేయించేందుకు సమ్మతించారు. గత సర్కారు హయాంలో లెక్కలపై కూడా కాగ్‌తో ఆడిట్ నిర్వహిస్తే చంద్రబాబు నిర్వాకాలు బయటపడటం ఖాయం’ అని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం
‘విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నేను వ్యతిరేకం. సరళీకరణ విధానాలను సమర్థిస్తా. కానీ ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్‌ప్లాంట్లు, ఎయిర్‌ఇండియా లాంటి సంస్థలను ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం జగన్ ఇప్పటికే ప్రధానికి రెండు లేఖలు రాశారు. అఖిలపక్షంతో వచ్చి కలిసేందుకు అప్పాయింట్‌మెంట్ కూడా కోరారు. అప్పాయింట్‌మెంట్ ఇస్తే అన్ని విషయాలు వివరిస్తారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రిగా ఆయన తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారు’అని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment