క్రీడాకారులకు సాఫ్ట్‌బాల్ అందిస్తున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
అనంతపురం సప్తగిరి సర్కిల్: చదువులకు పిల్లలు దూరమవుతారనే దురభిప్రాయంతో క్రీడలను తల్లిదండ్రులు ప్రోత్సహించడం లేదని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడలతో జీవితాలు బాగుపడుతాయనే విషయంపై సమాజంలో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంత క్రీడా మైదానంలో జిల్లాలోని 36 సాఫ్ట్‌బాల్ క్లబ్బులకు సోమవారం క్రీడా సామగ్రిని ఆయన అందజేసి, మాట్లాడారు. క్రీడలకు సరైన ప్రోత్సాహం అందించకపోవడంతో రాష్ట్రంలో క్రీడారంగం వెనుకబడిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్రీడారంగం అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. అనంతరం సీనియర్ ఫుట్‌బాల్ కోచ్ విజయభాస్కర్ రచించిన ‘ఫుట్‌బాల్ క్రీడా ప్రాథమిక భావన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, డైరెక్టర్ సాయికృష్ణ, సాఫ్ట్‌బాల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు, చీఫ్ కోచ్ జగన్నాథరెడ్డి, కేశవమూర్తి, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
బైరెడ్డితో పీఈటీ అసోసియేషన్ భేటీ..
శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డిని జిల్లా స్కూల్ అసిస్టెంట్స్, పీఈటీ అసోసియేషన్ సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పాఠశాలలకు క్రీడా సామగ్రిని అందించాలని కోరారు. బైరెడ్డిని కలిసిన వారిలో నరసింహారెడ్డి, రాజశేఖర్, లక్ష్మీనారాయణ, కాశీవిశ్వనాథరెడ్డి ఉన్నారు.
కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు
అనంతపురం సెంట్రల్: పార్టీ అభ్యున్నతికి శ్రమించే కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీలో తగిన గుర్తింపు ఉంటుందని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. సోమవారం అనంతపురానికి విచ్చేసిన ఆయన అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 శాతం నామినేటెడ్ పదవులు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తున్నారని, మహిళలకూ పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయంలోనే సంక్షేమ ఫలాలను అందిస్తుండడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment