సాక్షి, అమరావతి: రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి నిజంగా ప్రశంసనీయమని క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) చైర్‌పర్సన్ జాక్సే షా చెప్పారు. గ్రామస్థాయిలో రైతులకు అండగా నిలిచేలా ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థతో పాటు నాణ్యమైన ఉత్పాదకాలు అందించాలన్న ఆలోచనతో నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు ఒక విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఏపీ గున్వత్ సంకల్ప్ (నాణ్యతకు భరోసా) వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
సీఎం వైఎస్ జగన్ చొరవ అభినందనీయం
క్యూసీఐతో కలిసి పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ముందుకొచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇప్పటివరకు నాలుగైదు రాష్ట్రాలు మాత్రమే.. అది కూడా ఎంపిక చేసిన ఒకటి రెండు రంగాల వారీగా పనిచేసేందుకు మాతో అవగాహన ఒప్పందం చేసుకునేందుకు ముందుకొచ్చాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్ని రంగాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో క్యూసీఐతో పనిచేయబోతోంది. తాము పండించిన పంట ఉత్పత్తులను అంతర్జాతీయంగా తమకు నచ్చినచోట ప్రీమియం రేటుకు విక్రయించుకునేలా రైతులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చొరవ నిజంగా అభినందనీయం.
ఆయన చొరవ నేడు కార్యరూపం దాల్చింది. నాణ్యమైన పంట ఉత్పత్తులకు సర్టిఫికేషన్ చేయాలన్న లక్ష్యంతో దేశంలోనే తొలిసారి స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఈ అథారిటీని ఏర్పాటు చేయడంతో క్యూసీఐ తరఫున గ్యాప్ సర్టిఫికేషన్ జారీచేసే బాధ్యతను ఈ సంస్థకు అప్పగించాం. ఈ సంస్థ ద్వారా దేశంలోనే తొలిసారి వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు గ్యాప్ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికేషన్ జారీ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం.
130 దేశాలకుపైగా ఎగుమతి చేసుకునే వెసులుబాటు
ఏపీలో రైతుల కోసం ప్రత్యేకంగా క్యూసీఐ ఇండిగ్యాప్ పోర్టల్ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో రైతులెవరైనా సరే ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నిర్దేశిత ప్రమాణాలకనుగుణంగా నాణ్యమైన పంట ఉత్పత్తులను గ్యాప్ సర్టిఫికేషన్ ద్వారా తమకు నచ్చినచోట నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు. ఈ సర్టిఫికేషన్ ద్వారా అంతర్జాతీయంగా 130కి పైగా దేశాల్లో తమ ఉత్పత్తులకు అమ్ముకునే వెలుసుబాటు ఉంటుంది. ఇదే స్ఫూర్తితో మిగిలిన వ్యవసాయ అనుబంధరంగాల్లో కూడా సర్టిఫికేషన్ కోసం ఏపీ ప్రభుత్వంతో క్యూసీఐ అవగాహన ఒప్పందం చేసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేస్తాం
ప్రత్యేక ఉత్పత్తులను హైలెట్ చేయడం, రైతుల పరపతిని మరింత మెరుగుపర్చడంతో పాటు ఇండిగ్యాప్, గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన వారిని అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. మత్స్య, డెయిరీ ఉత్పత్తుల్లో ఎప్పటికప్పుడు రసాయన అవశేషాలను పరీక్షించేందుకు అవసరమైన చేయూతనిస్తాం. ఇలా వివిధదశల్లో పరీక్షలు, సాంకేతిక సహకారంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించేందుకు వెసులుబాటు కలుగుతుంది.
అలాగే అంతర్జాతీయ విపణిలో నచ్చిన రేటుకు అమ్ముకోవడం ద్వారా కనీసం రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఏర్పడుతుంది. ఏపీ నుంచి ప్రస్తుతం ఎగుమతి అవుతున్న వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు ఇండిగ్యాప్, గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ వల్ల సమీప భవిష్యత్‌లో రెట్టింపు అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇలా అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం.
వ్యవసాయ అనుబంధ రంగాలకే కాదు.. ఇతర రంగాల ద్వారా అందించే సేవల్లో నాణ్యతను పెంచేందుకు క్యూసీఐ ద్వారా అవసరమైన సహకారం అందిస్తాం. ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వ సంస్థలు, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తాం. సామర్థ్యం పెంపు, జ్ఞాన భాగస్వామ్యంపై దృష్టిపెడతాం. దీర్ఘకాలికంగా నాణ్యతపై హామీ ఇచ్చే పద్ధతులను స్వతంత్రంగా నిర్వహించేందుకు రాష్ట్ర సంస్థలను తీర్చిదిద్దుతాం. వీటితోపాటు క్యూసీఐ చేపట్టే వివిధ కార్యక్రమాల ద్వారా ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావంతో ఉన్నాం.
అగ్రి ల్యాబ్‌్సకు ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్
తాజాగా చేసుకున్న ఒప్పందం ద్వారా త్వరలో ఇండిగ్యాప్‌తో పాటు గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ కూడా జారీచేయబోతున్నాం. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్‌ల్యాబ్‌్సకు ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్ జారీచేసేందుకు క్యూసీఐ సహకారం అందిస్తుంది.
అలాగే గ్రామస్థాయిలో రైతులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకేలకు పూర్తిస్థాయిలో ఐఎస్‌వో సర్టిఫికేషన్ వచ్చేలా సహకారం అందిస్తాం. సీజన్‌లో సకాలంలో భూసార పరీక్షల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తాం. తద్వారా ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఆర్బీకేల ద్వారా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా ప్లాన్ తయారు చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment