78వ స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
మా ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులుండవు
సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం
పాత విధానంలో ఫీజు రీయింబర్స్‌మెంట్
విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తాం
సాక్షి, అమరావతి: ‘పేదరికం లేని సమాజం మా ప్రభుత్వ విధానం. గతంలో పీ–3 (పబ్లిక్, ప్రైవేటు, పార్ట్‌నర్‌షిప్ విధానంతో సంపద సృష్టించాం. ఇప్పుడు పీ–4 (పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్)తో పేదరికాన్ని నిర్మూలిస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి.. సాయుధ దళాల వందనాన్ని స్వీకరించారు. ఆయన ఏమన్నారంటే..
సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం..
సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం. తొలిరోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి నియామక ప్రక్రియ మొదలెట్టాం. సామాజిక పింఛన్లను పెంచి ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లతో పని లేకుండా ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థ్ధిక సాయం అందిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాం.
ఆదాయాన్ని కాదని ఉచిత ఇసుక..
ప్రభుత్వానికి ఆదాయాన్ని వదులుకుని ఉచిత ఇసుక విధానం మొదలు పెట్టాం. మరింత పకడ్బందీగా దీన్ని అమలు చేస్తాం. 3.54 కోట్ల మందికి నైపుణ్య గణన చేపట్టి మెరుగైన ఉపాధి కల్పించేలా కార్యాచరణ అమలు చేస్తాం.
అన్న క్యాంటీన్లకు విరాళాలు
పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో నేటి నుంచి 100 అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నాం. వీటి సంఖ్యను 203కు పెంచుతాం. పుట్టిన రోజు, పెళ్లి రోజు, శుభకార్యాల సందర్భంగా విరాళాలు ఇచ్చేవారి పేరిట ఆ రోజు అన్న క్యాంటీన్లలో భోజనం పెడతాం.
పోర్టులు–రహదారుల అనుసంధానం
పోర్టులు, ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులను అనుసంధానం చేసి సంపద సృష్టిస్తాం. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టును మళ్లీ పట్టాలు ఎక్కిస్తాం. వంశధార – నాగావళి – గోదావరి – కృష్ణా –పెన్నా నదులను అనుసంధానిస్తాం. కళాశాలల ఖాతాల్లో నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ములు జమ చేసేలా పాత విధానాన్ని పునరుద్ధరిస్తాం.
గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఆరోగ్యశ్రీ బిల్లులను దశలవారీగా చెల్లిస్తున్నాం. ఎన్టీఆర్ బేబీ కిట్స్’ను తిరిగి ప్రవేశ పెడతాం. మా ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులకు తావులేదు. ఎస్సీల వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.
రూ.9.74 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పులు
రాష్ట్ర అప్పులు రూ.9.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. తలసరి అప్పు రూ.74,790 నుంచి రూ.1,44,336కి పెరిగింది. తలసరి ఆదాయం 13.2 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణం పెరిగింది. పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవీ గత ప్రభుత్వం అమలు చేయలేదు.
100 రోజుల ప్రణాళిక
వచ్చే వంద రోజుల్లో పారిశ్రామికరంగంతో పాటు ఎంఎస్‌ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎల్రక్టానిక్, ఐటీ అండ్ క్లౌడ్, టెక్స్‌టైల్, టూరిజం పాలసీలు తెస్తున్నాం. సులభతర వాణిజ్యంలో మళ్లీ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తాం. మెడ్‌టెక్ జోన్ స్ఫూర్తిగా మరో 100 పారిశ్రామిక పార్కులు ఏర్పాట్లు చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment