వేద పాఠశాల విద్యార్థికి సర్టిఫికెట్ అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: అత్యంత వైభవంగా సాగుతున్న విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. బుధవారం పెందుర్తి మండలం చినముషిడివాడలోని పీఠాన్ని సందర్శించిన సీఎం జగన్ దాదాపు మూడున్నర గంటల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు
గన్నవరం విమానాశ్రయం నుంచి 11.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మధ్యాహ్నం 12.10 గంటలకు పీఠానికి చేరుకున్నారు. స్వరూపానందేంద్ర స్వామీజీ, స్వాత్మానందేంద్ర స్వామీజీ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతకు పూజలు ఆచరించి నైవేద్యాన్ని సమర్పించారు. జమ్మిచెట్టుకు ప్రదక్షిణ చేసిన అనంతరం విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. రాజశ్యామల పూజల కోసం సీఎం జగన్ చేతుల మీదుగా పండితులు సంకల్పం చేయించి కలశ స్థాపన చేపట్టారు. వనదుర్గ, రాజశ్యామల యాగాలను సీఎం దర్శించుకున్నారు. రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమంలో స్వామీజీలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలు
జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలు, పతకాలను ముఖ్యమంత్రి జగన్ అందజేశారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం జగన్‌ను స్వామీజీ సత్కరించి ఆశీస్సులు అందించారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి అందజేసిన ప్రసాదాన్ని సీఎం జగన్ స్వీకరించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుగు పయనమైన ముఖ్యమంత్రిని పీఠం ప్రతినిధులు సాదరంగా సాగనంపారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టులో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికారు.
మహా విద్యాపీఠం: స్వాత్మానందేంద్ర
జగద్గురు శంకరాచార్య సంప్రదాయ పీఠంగా ఆవిర్భవించిన విశాఖ శ్రీశారదాపీఠం మహావిద్యాపీఠంగా అవతరించిందని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. పీఠం నిర్వహణలో 21 ఏళ్ల క్రితం ఏర్పాటైన జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల ఎందరో వేద పండితులను తీర్చిదిద్దిందని తెలిపారు. ఇక్కడ పట్టాలు పొందిన వారు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడిస్తుండడం ఆనందాన్నిస్తోందన్నారు. వేదానికి పుట్టినిల్లుగా పేరున్న ప్రాంతంలో ఏర్పాటైన వేద పాఠశాల మంచి పేరు సంపాదించిందన్నారు. తమ పీఠం పరంపరకు 200 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. హోళే నర్సిపూర్ కేంద్రంగా పరంపర మొదలైందన్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కావడం, వరుసగా ఎనిమిదేళ్లుగా పీఠానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment