CM Jagan Initiated Revolutionary Changes In Distribution Of Pensions - Sakshi
Sakshi News home page

మూడేళ్లలో 21.83 లక్షల మందికి కొత్తగా పింఛన్లు

Published Wed, Jul 20 2022 3:53 AM | Last Updated on Wed, Jul 20 2022 1:46 PM

CM Jagan initiated revolutionary changes in Distribution of pensions - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితంగా..గత మూడేళ్ల కాలంలోనే ఏకంగా 21,83,027 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. ఈ నెలలోనూ 2,99,085 మంది కొత్తగా పింఛన్‌ అందుకున్నారు. ఈ నెలలో కొత్తగా మంజూరైన లబ్ధిదారుల ఇంటింటికీ మంగళవారం వలంటీర్లే  వెళ్లి పింఛను కార్డులను అందజేశారు.

ఆగస్టు ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 62.68 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసే పరిస్థితి ఉండగా.. అందులో మూడో వంతు మందికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం గమనార్హం. మరోవైపు.. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యానికి, ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేకుండా ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. అర్హత ఉన్నవారికి వలంటీర్ల దరఖాస్తులు పూర్తి చేసి,  గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందజేసే విధానం తీసుకొచ్చింది.  

అవ్వాతాతల అవస్థలకు చెక్‌.. 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కొత్త పింఛను మంజూరు కావాలంటే అవ్వా తాతలు సహా వితంతు, దివ్యాంగులకు చుక్కలు కనిపించేవి. అప్పట్లో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడిన జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పింఛన్లు మంజూరయ్యేవి. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేశారన్నా.. ఏ రాజకీయ అండ లేదనుకునే వారికి అప్పట్లో కొత్తగా పింఛను మంజూరు కావాలంటే గగనమే. దీనికి తోడు మంజూరు అయిన పింఛను డబ్బులు ప్రతి నెలా తీసుకోవడానికి నడవలేనిస్థితిలో ఉండే అవ్వాతాతలు గంటల తరబడి ఆఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఇప్పుడు రాష్ట్రంలో పింఛను లబ్ధిదారులెవరూ ఇంటి నుంచి కాలు కదపాల్సిన అవసరం లేకుండా వలంటీర్లే  ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. డోర్‌ డెలివరీ పద్ధతిలో పింఛన్లు అందించడం  దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో కొనసాగుతున్నది. 

సంస్కరణలకు శ్రీకారం.. 
► ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పింఛనుదారులకు కూడా ప్రతి నెలా ఒకటో తేదీనే.. ఇంటికి వద్దకే వెళ్లి ఫించన్‌ అందజేత, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు 
► తలసేమియా, సికిల్‌సెల్, తీవ్ర హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు, ద్వైపాక్షిక బోధ వ్యాధి, పక్షవాతంతో చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన వారు, డయాలసిస్‌ చేయించుకుంటున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, లివర్, కిడ్నీ, గుండె మార్పిడి చేయించుకున్న వారు, కుష్టు వ్యాధి వంటి 11 రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్తగా రూ.5000ల నుంచి రూ.10,000 వరకు పింఛన్లు మంజూరు. 

అప్పుడు వైఎస్‌.. ఇప్పుడు మళ్లీ జగన్‌.. 
ఆసరా కోరుకునే వారికి సామాజిక భద్రత కల్పించే పింఛన్ల అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చూపించే ఉదారత ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉదహరించాల్సిందే. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అప్పట్లో 2008లో ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులకు  కొత్తగా పింఛన్లను మంజూరు చేశారు. ఈ విషయాన్ని 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించిన కాగ్‌ రిపోర్టులోనే పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement