
మహిళా సాధికారత కోసమే ‘‘వైఎస్సార్ చేయూత’’ కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
సాక్షి, అమరావతి : మహిళా సాధికారత కోసమే ‘‘వైఎస్సార్ చేయూత’’ కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన 45–60 ఏళ్ల మధ్యనున్న మహిళలకు చేయూత ద్వారా సహాయం అందించామని చెప్పారు. సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేశామన్నారు. గురువారం ఏపీలో ‘‘వైఎస్సార్ చేయూత’’ద్వారా మహిళా సాధికారత కోసం మరో మూడు దిగ్గజ కంపెనీల తోడ్పాటుకు ఒప్పందం కుదిరింది. ప్రభుత్వంతో రిలయన్స్ రిటైల్–జియో, అల్లాన కంపెనీలు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సీఎం జగన్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ మహిళలకు చేయూతను అందించాం. నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా, స్థిరంగా వారికి 18,750 రూపాయలు ఇస్తున్నాం. అర్హులైన వారందరికీ కూడా ఏడాదికి 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లలో 75 వేల రూపాయలు ఇస్తున్నాం. 23 లక్షల మంది మహిళలకు సుమారు 4,300 కోట్ల రూపాయలు ఇచ్చాం. వచ్చే నెల ఆసరాను ప్రారంభిస్తున్నాం. నాలుగేళ్ల పాటు దాదాపు 93 లక్షల మంది మహిళలను ఆసరా ద్వారా ఆదుకుంటాం. చేయూత, ఆసరా రెండూ పథకాలు పొందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఉంటారు. వారికి పెద్దగా మేలు జరుగుతుంది. ఆసరా కింద ఏడాదికి 6700 కోట్ల రూపాయలు సుమారు 9 లక్షల గ్రూపులకు అందిస్తున్నాం. (పర్యాటకానికి చిరునామాగా మారాలి: సీఎం జగన్)
ఏడాదికి దాదాపు 11 వేల కోట్ల రూపాయలు మహిళా సాధికారత కోసం ఖర్చు చేస్తున్నాం. దాదాపు కోటి మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. స్థిరమైన జీవనోపాధి వారికి కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ముందడుగు వేస్తున్నాం. ఇప్పటికే అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గాంబల్‌తో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇప్పుడు రిలయన్స్, అలనా గ్రూపులు కూడా భాగస్వాములయ్యాయి. మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించాలన్నది మా ప్రయత్నం. మేం ఇచ్చే డబ్బు వారి జీవితాలను మార్చేదిగా ఉండాలి. ఈ దిశగా మీ సహకారాన్ని కోరుతున్నాం’’ అని అన్నారు.