సమగ్ర వివరాలతో సిద్ధం కావాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Holds Meeting With YSRCP MPs Thadepalli Today | Sakshi
Sakshi News home page

సమగ్ర వివరాలతో సిద్ధం కావాలి: సీఎం జగన్‌

Published Mon, Jan 25 2021 7:11 PM | Last Updated on Mon, Jan 25 2021 7:12 PM

CM YS Jagan Holds Meeting With YSRCP MPs Thadepalli Today - Sakshi

సాక్షి, అమరావతి: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్సార్‌సీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఆయన పోలవరం సహా పలు కీలక అంశాలపై వాస్తవ పరిస్థితులను ఎంపీలకు వివరించారు. పెండింగ్‌లో ఉన్న.. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రావాల్సిన బకాయిలు రూ. రూ.1569.86 కోట్లు,  అలాగే ప్రాజెక్టు వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం రావాల్సి ఉందని ఎంపీలకు సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి ప్యాకేజీ పేరిట గతంలో చంద్రబాబు ఒప్పుకున్న కారణంగా ప్రాజెక్టు వ్యయం ఖరారులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు దారితీశాయని.. ఎంపీలకు ముఖ్యమంత్రి వివరించారు. (చదవండి: 5.01 లక్షల మంది చిరు వ్యాపారులకు జగనన్న తోడు)

రాష్ట్ర ప్రభుత్వం వివిధ వేదికలపై చేసిన వాదనల వల్ల ప్రాజెక్టు వ్యయం ఖరారులో సానుకూల పరిస్థితి ఉందని, అంచనా వ్యయాన్ని ఖరారు చేయాల్సిందిగా కేంద్ర జలశక్తిమీద ఒత్తిడి తీసుకువస్తున్నామని సీఎం తెలిపారు. దీనిపై ప్రధానమంత్రి, హోంమంత్రికి రాసిన లేఖల్లోని అంశాలను వివరించిన ముఖ్యమంత్రి.. పోలవరం ప్రాజెక్టు అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్స్‌ ఆమోదానికి గట్టిగా కృషిచేయాలని ఎంపీలను ఆదేశించారు. ఈ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా లేవనెత్తాలని, పోలవరం ప్రాజెక్టు పనులు సకాలానికి పూర్తిచేయడం చాలా ముఖ్యమైన అంశమని సీఎం అన్నారు. ప్రత్యేక హోదా కోసం పలుమార్లు లేఖలు రాశామని, ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలో కూడా దీనిపై కేంద్రానికి విజ్ఞప్తిచేస్తున్నామని, పార్లమెంటు వేదికగా దీనిపై గళం వినిపించాలని ఆయన తెలిపారు. చదవండి: ఏపీ: పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్ 

16 కొత్త మెడికల్‌ కాలేజీలను కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇప్పటికే 3 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు వచ్చాయని, మిగిలిన 13 కాలేజీలకు రావాల్సి ఉందని ఎంపీలకు వివరించారు. 
రాష్ట్రానికి టైర్‌–1 సిటీ లేదని, దీనివల్ల ఆస్పత్రులు, మౌలిక సదుపాయాల కొరత ఉందన్నారు. ఈ కొత్త వైద్యకళాశాలల కారణంగా సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులోకి వస్తారని సీఎం తెలిపారు. అనుమతులు వచ్చేలోగా అన్నిరకాలుగా కాలేజీలు పెట్టేందుకు అడుగులు ముందుకేస్తున్నామని సీఎం చెప్పారు.

ప్రజా పంపిణీ వ్యవస్థకు ధాన్యం సేకరణ రూపేణా కేంద్రం రూ.4,282 కోట్ల రూపాయలు బకాయిలు పడిందని, వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరామని సీఎం తెలిపారు. 14వ, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.1842.45 కోట్లు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను రాబట్టే అంశంపై పార్లమెంటులో ప్రస్తావించాలని సీఎం పేర్కొన్నారు. నివర్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ, తాత్కాలిక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ కింద రూ. రూ. 2,255.7 కోట్లు రావాల్సి ఉందన్నారు.

కుడిగి, వల్లూరు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుల నుంచి అధిక ధరకు కొన్న ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. దీనివల్ల ఫిక్స్‌డ్‌ఛార్జీల రూపేణా ఏడాదికి రూ.325 కోట్లు ఆదా అవుతాయన్నారు. అధిక ధరకు ఇదివరలో చేసిన కొనుగోలు ఒప్పందాలను సరెండర్‌ చేయడం ద్వారా ఇప్పటికే రూ.800 కోట్లు ఆదా అయ్యిందని ఎంపీలకు తెలిపారు. తక్కువ ధరకు విద్యుత్‌పై యుద్ధ ప్రాతిపదికన దృష్టిపెట్టామన్న సీఎం.. త్వరలో రూ.10వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌కు టెండర్లు పిలుస్తున్నామన్నారు. రైతులకు శాశ్వత ప్రాతిపదికిన ఉచిత విద్యుత్‌ అందించడంలో భాగంగా ఈ చర్యలుచేపట్టామన్న సీఎం.. ఏపీ దిశా బిల్లు, ఏపీ స్పెషల్‌ కోర్టుల బిల్లుల ఆమోదానికి కృషి చేయాలని సీఎం తెలిపారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి బిల్లులను ఆమోదించామని,

హైకోర్టును కర్నూలు పెట్టేందుకు రీ నోటిఫికేషన్‌ జారీచేయాలంటూ కేంద్రాన్ని కోరామని సీఎం తెలిపారు. ఈ అంశాన్ని బీజేపీ కూడా మేనిఫెస్టోలో పెట్టిందని.. ఈ అంశాన్ని పార్లమెంటు వేదికపై వినిపించాలని ఎంపీలకు సీఎం ఆదేశించారు. ఉపాధి హామీ కింద రూ.3,707.77 కోట్లు బకాయిలు ఉన్నాయని, అలాగే పని దినాలను 100 నుంచి 150కి పెంచాలంటూ విజ్ఞప్తి చేశామని ఈ రెండు అంశాలమీద పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో దృష్టి పెట్టాలని సీఎం కోరారు. ట్రైబల్‌ యూనివర్శిటీని సాలూరులో త్వరగా పెట్టాలని, రెవిన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.18,830.87 కోట్లు వచ్చేలా పార్లమెంటులో లేవనెత్తాలన్న సీఎం.. అలాగే వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.700 కోట్లు బకాయిల విడుదలకూ కృషి చేయాలన్నారు. 

అలాగే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుల పైనా పూర్తి వివరాలతో సిద్ధం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అబార్షన్‌ బిల్లుపై సమగ్ర వివరాలతో సిద్ధం కావాలని వృత్తిరీత్యా వైద్యుడైన కర్నూలు ఎంపీ సంజయ్‌కు సీఎం ఆదేశించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.  కచ్చితంగా రైతులకు కనీస మద్దతు ధర లభించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఎక్కడ కొనుగోళ్లు జరిగినా, కనీస మద్దతు ధర తగ్గకుండా కొనుగోళ్లు జరగాలన్నారు. ఎవరు కొనుగోలు చేసినా కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయకూడదన్న సీఎం.. ఇదే షరతుతో వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చామన్నారు. కొత్త వ్యవసాయచట్టాల విషయంలో ఈ షరతుకు మనం కట్టుబడి ఉన్నామనే విషయాన్ని పునరుద్ఘాటించాలన్నారు.

దేవాలయాల్లో జరిగిన ఘటనల అంశంపై సమగ్ర వివరాలతో సిద్ధం కావాలని ఎంపీలకు సీఎం ఆదేశించారు. ఈ కేసుల్లో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు ఉన్నట్టుగా విచారణలో తేలిందన్నారు. దురుద్దేశ పూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, ఏ మతానికి చెందినవారు తప్పులు చేసినా చర్యలు కఠినంగా తీసుకుంటున్నామన్నారు. దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం.. సహా వివిధ ఘటనలపై సమగ్ర వివరాలను తెలుసుకుని, ఆ మేరకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లాలో నంది విగ్రహాన్ని టీడీపీ వ్యక్తులు తొలగించారని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇది జరిగిందని, ఈ ఘటనకు బాధ్యులు వైఎస్సార్‌సీపీ వాళ్లేనంటూ మొదట ప్రచారం చేశారన్న సీఎం.. ఈనాడు విలేకరి కూడా ఈ కేసులో భాగస్వామిగా ఉన్నారన్న విషయాన్ని దర్యాప్తులో వెల్లడైందన్నారు. సీసీ కెమెరా విజువల్స్‌ బయటపడిన తర్వాత చంద్రబాబునాయుడు తన వాదనను మార్చారని ముఖ్యమంత్రి తెలిపారు. వైఎస్సార్‌గారి విగ్రహాన్ని పెడుతున్నారు కాబట్టి.. నంది విగ్రహం పెట్టడం తప్పు ఎలా అవుతుంది అంటూ చంద్రబాబు ఇప్పుడు మాటమార్చారన్నారు. ఒకరి విగ్రహాలను అడ్డు కోవడానికి ఆలయాల్లోని విగ్రహాలను తొలగించి పెడతారా? అన్న సీఎం.. దీనిపై వివరాలు, సాక్ష్యాధారాలు తీసుకుని సిద్ధంగా ఉండాలని ఎంపీలకు  ఆదేశించారు. 

మతం అనేది నాలుగు గోడల మధ్య దేవుడికి, మనిషికి మధ్య ఉన్న అనుబంధం అన్న సీఎం.. ఆ గది బయటకు వచ్చిన తర్వాత ప్రతి మనిషి, సాటి మనిషికి గౌరవం ఇవ్వాలని, మానవత్వం అంటే ఇదేనని సీఎం పేర్కొన్నారు. దీని నుంచి పక్కకు వెళ్తే... సమాజంలో అశాంతి మొదలవుతుందని సీఎం తెలిపారు. అంతర్వేది రథం దగ్ధంపై సీబీఐ విచారణ కోరిన అంశాన్ని ఎంపీలకు అధికారులు తెలపగా, ఇది కూడా పెండింగులో ఉందని సీఎం తెలిపారు. వైజాగ్‌ రైల్వే జోన్‌ ప్రకటించినప్పటికీ డివిజన్లపై నెలకొన్న సమస్యలను కూడా ప్రస్తావించాలని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement