
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బడ్జెట్ ఆమోదం తర్వాత, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ మీద కాసేపు చర్చ జరిగింది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ‘మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత పునర్‌వ్యవస్థీకరిస్తానని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే చెప్పాను. మంత్రివర్గంలో ఉన్న వారికి వేరే బాధ్యతలు అప్పగిస్తాం. మిగతా వారిని మంత్రివర్గంలోకి తీసుకొస్తాం. పార్టీ బాధ్యతలు చూస్తూ ఎక్కువ మంది ప్రజలను రోజూ కలవడాన్ని రాజకీయాల్లో మంచి అవకాశంగా భావించాలి. పార్టీకి సేవ చేసే అవకాశం వస్తే మరింత పెద్ద నాయకులు అవుతారు. ప్రజాదరణ ఉన్న నేతలుగా ఎదుగుతారు. అది పార్టీకీ ఉపయోగమే. మంచి ఆదరణతో గెలిచి వస్తే మళ్లీ మంత్రివర్గంలో అవకాశాలు ఎదురుచూస్తూ ఉంటాయి’ అన్నట్లు తెలిసింది.
చదవండి: (మరో ముందడుగు: రూ.2,56,256.56 కోట్లతో వార్షిక బడ్జెట్)