చరిత్రాత్మకంగా చైతన్యమూర్తి : సీఎం జగన్‌ | AP CM YS Jagan Key Comments Over Dr BR Ambedkar Statue In AP Vijayawada, Details Inside - Sakshi
Sakshi News home page

AP CM YS Jagan: చరిత్రాత్మకంగా చైతన్యమూర్తి

Published Thu, Jan 18 2024 3:58 AM | Last Updated on Thu, Jan 18 2024 10:08 AM

cm ys jagan key comments over ambedkar statue in ap - Sakshi

సాక్షి, అమరావతి: అంబరాన్ని తాకేలా విజయవాడలో మనం ఏర్పాటు చేసుకుంటున్న రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటమే కాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అది ‘స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’ (సామాజిక న్యాయ మహా శిల్పం) అని అభివర్ణించారు.

మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చటానికి, సంఘ సంస్కరణలకు, పెత్తందారీ భావాలపై తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఆ మహా శిల్పం నిరంతరం స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని చారిత్రక స్వరాజ్య మైదానంలో ఈ నెల 19వ తేదీన ఆవిష్కరించనున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్దదన్నారు.

అంబేడ్కర్‌ మహా శిల్పాన్ని ఆవిష్కరించనున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం రాష్ట్ర ప్రజలకు ఈమేరకు సందేశం ఇచ్చారు. ‘అది 81 అడుగుల వేదికపై ఏర్పాటు చేసిన 125 అడుగుల మహా శిల్పం. అంటే.. 206 అడుగుల ఎత్తైన విగ్రహం. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం, దేశ సామాజిక, ఆరి్థక, రాజకీయ, మహిళా చరిత్రను మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఆయన భావాల పట్ల అచంచల విశ్వాసంతో, బాధ్యతతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తున్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తేదీన అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతున్నా’ అని తన సందేశంలో సీఎం జగన్‌ పేర్కొన్నారు.

దేశానికే తలమానికం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ట్వీట్‌
సాక్షి, అమరావతి: విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మహాశిల్పం రాష్ట్రానికే కాదు.. దేశానికే తలమానికం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల ఏళ్ల పాటు ‘స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’ స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ నెల 19వతేదీన విజయవాడలో బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ మహా శిల్పం విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతూ సీఎం జగన్‌ బుధవారం ట్వీట్‌ చేశారు.

నిరంతరం కాపాడే మహాశక్తి

  • ఆయన.. అణగారిన వర్గాలకు చదువులు చేరువ చేసిన మహనీయుడు!  
  • అంటరానితనం, ఆధిపత్య భావజాలంపై తిరుగుబాటు చేసిన మహానుభావుడు! 
  • సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపం!  
  • రాజ్యాంగం, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి!  
  •  ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం ధైర్యాన్ని, అండని ప్రసాదించే ఓ మహా స్ఫూర్తి!  
  • దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 ఏళ్లలో  వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ భావాలే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement