సాక్షి, నెల్లూరు: నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ రెండో ఏడాది చెల్లింపులను నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదవాలన్నదే లక్ష్యమని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా 45 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష అని, 19 నెలల పాలనలో చదువుల విప్లవం తీసుకొచ్చామని సీఎం పేర్కొన్నారు.
ఆ పరిస్థితులను పాదయాత్రలో చూశా..
‘‘చదివించే స్తోమత లేక తమ పిల్లలను కూలి పనులకు పంపించే పరిస్థితులను నా పాదయాత్రలో చూశా. అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపిస్తే రూ.15వేలు సాయం అందించాం. వరుసగా రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం అమలు చేస్తున్నాం. అమ్మఒడి రెండో విడత ద్వారా రూ.6,673 కోట్లు అందిస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. అదనంగా 4 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అందజేస్తున్నాం. గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని’’ సీఎం జగన్ చెప్పారు. (చదవండి: ఆరోగ్య పథకాల 'అమలులో ఏపీ టాప్')
పరిస్థితులను మార్చేందుకే ‘నాడు-నేడు’
గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాయని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో దోపిడీ జరిగేదన్నారు. పరిస్థితులను మార్చేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. పాఠశాలకు విద్యార్ధి రాకపోతే మొదటి రోజు ఫోన్‌లో మెసేజ్.. వరుసగా రెండు రోజులు రాకుంటే వాలంటీర్ నేరుగా ఇంటికొచ్చి విద్యార్ధి యోగక్షేమాలు తెలుసుకుంటారని వెల్లడించారు.పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రుల కమిటీలతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు, వాలంటీర్లపై ఉందన్నారు. రాబోయే మూడేళ్లలో వంద శాతం పిల్లలు బడిబాట పట్టేలా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు శుభ్రంగా లేకపోతే 1902 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని, గ్రామ సచివాలయాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని సీఎం సూచించారు.
అమ్మఒడి పథకంలో వినూత్నమైన మార్పు..
అమ్మఒడి పథకానికి టెక్నాలజీని సీఎం అనుసంధానం చేశారు. విద్యార్ధులకు కంప్యూటర్ స్కిల్స్ పెంచేందుకు ల్యాప్‌టాప్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు ఈ ఆఫర్ ప్రకటించారు. అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్ ఇస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌డిస్క్, విండోస్ 10 ఓఎస్ ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్ ఉంటుందన్నారు. మూడేళ్ల వారంటీతో కూడిన ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు అందిస్తాం. రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సేవలు అందిచడంతో పాటు అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్‌ను ఏర్పాటు చేస్తాం. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నాం. వైఎస్‌ఆర్ పీపీ-1, పీపీ-2, ప్రీ ఫస్ట్ క్లాస్‌గా కొనసాగుతాయని’’ సీఎం పేర్కొన్నారు.
అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల్లో కడుపుమంట..
రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రతిపక్షాల్లో కడుపుమంట కనిపిస్తోందని సీఎం అన్నారు. దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, ఆ తర్వాత దేవాలయాల సందర్శన అంటున్నారని మండిపడ్డారు. రథాలను తగలబెట్టి రథయాత్రలు చేస్తున్నారు.. సంక్షేమ పథకాల మంచి ప్రజలకు తెలియకూడదనే.. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని సీఎం జగన్ ధ్వజమెత్తారు.
దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు..
‘‘దేవుడిపై భక్తి లేనివారు, ఆలయాల భూములను కాజేసిన వారు.. ఆలయాల్లో క్షుద్రపూజలు చేసినవారు. ఇప్పుడు దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు. కోవిడ్‌కు భయపడి చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో దాక్కుంటారు. సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా ఎన్నికలు నిర్వహించాలంటారు.. పేదింటి మహిళలకు ఇళ్ల స్థలాలు అందకుండా కేసులు వేస్తున్నారు. వ్యవస్థలో ఉన్న కోవర్టులు కూడా ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. ఆలయాల్లో విగ్రహాలు పగలగొట్టారు.. రాబోయే రోజుల్లో బడులపై విధ్వంసం చేస్తారేమో. విద్రోహ శక్తుల పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని’’ సీఎం జగన్ తెలిపారు.
అంతకు ముందు శ్రీవేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన `అమ్మఒడి` పథకం ప్రారంభోత్సవ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. పాదయాత్రలో చెప్పిన ప్రతిమాటను అక్షరాలా చేసి చూపిస్తున్న సీఎం జగన్ వరుసగా రెండో ఏడాది కూడా విజయవంతగా సంక్షేమపథకాలను అమలు చేస్తున్నారు.
ఈ ఏడాది మరింత మందికి ప్రయోజనం కలిగేలా...
ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా ఈ ఏడాది నిబంధనలు సడలించిన ప్రభుత్వం... కోవిడ్ 19 పరిస్ధితుల్లో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధనను మినహాయింపు నిచ్చింది. కుటుంబ ఆదాయ పరిమితి గతంలో గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5వేలు, పట్టణాల్లో రూ.6250 ఉంటే, ఈ ఏడు గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు చేశారు. గతంలో రెండున్నర ఎకరాల మాగాణి, మెట్టభూమి 5 ఎకరాలలోపు పరిమితి ఉండగా, ఈ యేడు మగాణి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలుగా మార్పు చేశారు. విద్యుత్ వినియోగానికి సంబంధించి నెలకు గతంలో 200 యూనిట్లలోపు వాళ్లను అర్హులుగా గుర్తిస్తే..ఈ దఫా 300 యూనిట్ల వినియోగమున్నవాళ్లను కూడా అర్హులుగా గుర్తించారు.(చదవండి: అశోక్‌బాబుకు ఏపీ ఉద్యోగుల జేఏసీ కౌంటర్)
గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఫెన్షనర్లకు పథకాన్ని వర్తింపజేయలేదు, ఈ దఫా పారిశుద్ధ్య కార్మికులను అందులో నుంచి మినహాయించారు. దీంతో పారిశుద్ధ్య కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఈ ఏడాది అమ్మఒడి వస్తుంది. గతంలో ఫోర్ వీలర్ ఉన్న కుటుంబాల్లో టాక్సీ కలిగి ఉన్నవారికే మాత్రమే మినహాయింపు నివ్వగా,ఈ దఫా ట్రాక్టర్లు, ఆటోలున్నవారినీ ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. గతంలో మున్సిపాల్టీలలో 750 చదరపు అడుగుల లోపు స్ధిరాస్ధి ఉన్న వారికి పథంలో అర్హులగా గుర్తించగా, ఈ దఫా 1000 చదరపు అడుగుల స్ధలం ఉన్నవారిని కూడా పథకంలో అర్హులుగా గుర్తిస్తున్నారు. దీంతో ఈ దఫా అమ్మఒడి ద్వారా 44 లక్షల 48 వేల 865 మంది తల్లులకు లబ్ధి చేకూరనుంది.
Comments
Please login to add a commentAdd a comment