మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం కాబట్టే అమ్మ కడుపులో బిడ్డ పెరగడం ప్రారంభం అయినప్పటి నుంచి.. నాణ్యమైన విద్యతో పెద్ద చదువులు పూర్తి చేసేవరకు అడుగడుగునా ఆ బిడ్డకు మేనమామగా, ఆ తల్లికి ఒక అన్నగా అండగా నిలబడుతున్నా.
మంచి యూనిఫారం, మంచి షూ, సాక్సులు, బెల్టు, ఇంగ్లిష్ మీడియం పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్‌లు, నోట్ బుక్‌లు, ఇవన్నీ మంచి బ్యాగులో పెట్టుకొని పేద పిల్లలు కూడా పెద్ద వారి పిల్లల మాదిరి గర్వంగా తలెత్తుకొని బడికి వెళ్లేలా విద్యా వ్యవస్థనే మారుస్తున్నాం.
జగన్ మామ ముఖ్యమంత్రి అయ్యాడు. మా బడులు మారుతున్నాయి. మేము మారుతున్నాం. ఇక గొప్పగా చదువుకుంటామని పిల్లలు సగర్వంగా చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది. మన రాష్ట్రంలో చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రపంచమంతా ఇక్కడకు పరుగెత్తుకొచ్చే పరిస్థితి రావాలి..... సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద పిల్లల చదువుల బాధ్యతంతా మేనమామగా తనదేనని, తల్లిదండ్రులపై నయా పైసా భారం పడకుండా వారికి మంచి చదువులు అందించేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని గురువారం ఆయన కృష్ణా జిల్లా పునాదిపాడు జెడ్పీ హైస్కూలులో లాంఛనంగా ప్రారంభించారు. కిట్‌లను విద్యార్థులకు అందజేశారు. తరగతి గదిలో కాసేపు విద్యార్థులతో గడిపారు. అనంతరం సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
- “నోబుల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్.. వన్ ఛైల్డ్, వన్ టీచర్, వన్ పెన్, వన్ బుక్ కెన్ ఛేంజ్ ద వరల్డ్’ అని అన్నారు. “ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ ఛేంజ్ ద వరల్డ్’ అని నెల్సన్ మండేలా చెప్పారు. ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుల్లోనే ఉంది. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలి. ఇందుకు చదువుల్లో సమూల మార్పులు జరగాలి.
- తమ పిల్లలను గొప్పగా చదివించాలని తల్లిదండ్రులు ఆశ పడతారు. స్వాతంత్య్రం వచ్చిన 73 సంవత్సరాల తర్వాత కూడా 34 శాతం మందికి చదువురాని పరిస్థితులున్నాయంటే దానికి కారణమేమిటో గత పాలకులు ఆలోచించ లేదు.
- మార్కెట్లో ఇంగ్లిష్ చదువులు కాస్ట్‌లీ సరుకుగా మారిన పరిస్థితుల్లో తల్లిదండ్రుల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులు పిల్లల చదువులను నిర్ణయిస్తున్నాయి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని అంగన్‌వాడీ నుంచి ప్రారంభించి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం.
ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సదుపాయాలు
- మనబడి నాడు–నేడుతో ప్రభుత్వ బడుల్లో నీటి సదుపాయంతో టాయిలెట్లు.. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లున్న తరగతి గదులు, తాగునీటి వసతి, గ్రీన్ బోర్డులు.. పిల్లలు, టీచర్లు కూర్చొనేందుకు మంచి ఫర్నీచర్, స్కూళ్లకు మరమ్మతులు, మంచి రంగులతో ఆహ్లాదకర వాతావరణం, ప్రహరీ, గోరుముద్ద.. మధ్యాహ్న భోజనం కోసం మంచి కిచెన్ ఏర్పాటు చేయించాం.
- పేద పిల్లలు పెద్దవారి పిల్లలతో పోటీపడేలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడుతున్నాం. ఇప్పుడు విద్యాకానుక ద్వారా బడికి వెళ్లే పిల్లల రూపంలో కూడా మార్పులు తీసుకువస్తున్నాం.
- నవంబర్ 2 నుంచి బడులు తెరవాలని అనుకుంటున్నాం. అయితే అంతకు ముందే ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 42.34 లక్షల మంది పిల్లలకు దాదాపు రూ.650 కోట్లతో విద్యాకానుక అందిస్తున్నాం. ఈ కానుక కింద 3 జతల యూనిఫారం వస్త్రం, కుట్టు కూలి సొమ్ము, బ్యాగు, టెక్టŠస్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్కుబుక్‌లు, బెల్టు, సాక్సు, బూట్లు కిట్‌గా అందిస్తున్నాం. ప్రతి బడిలో ఈ కార్యక్రమం నేటి (గురువారం) నుంచి 3 రోజుల పాటు కొనసాగుతుంది.
ఉద్యోగాలు మన పిల్లల ముంగిటికే వచ్చేలా మంచి చదువులు
- ప్రతి పిల్లాడు గొప్పగా చదివితేనే వారి తలరాతలు మారి పేదరికం నుంచి బయట పడతారు. ఇందుకోసం అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, సంపూర్ణ పోషణ్, మనబడి నాడు–నేడు, గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక, కంటి వెలుగు తదితర పథకాలు, కార్యక్రమాలతో చదువుల చరిత్రను పూర్తిగా మారుస్తున్నాం. జనవరి 9న మరోసారి అమ్మ ఒడి కింద రూ.15 వేలు వేస్తున్నాం.
- సంపూర్ణ పోషణ్ ప్లస్ కార్యక్రమం కోసం గతంలో రూ.400 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం రూ.1800 కోట్లు ఖర్చు చేస్తోంది. వసతి దీవెన కింద ఇప్పటికే రూ.1,200 కోట్లు ఇచ్చాం. మళ్లీ నవంబర్‌లో వసతి దీవెనతో తలిదండ్రులకు తోడుగా ఉంటాం.
ప్రీ ప్రైమరీ నుంచే ఆంగ్ల విద్య
- పిల్లలకు ఆరేళ్ల వయసు వచ్చేసరికి వారి మెదడు 85 శాతం అభివృద్ధి చెందుతుంది. ఆలోపే వారి మానసిక వికాసానికి, ఇంగ్లిష్ చదువులకు గట్టి పునాదులు పడితే ఆ పిల్లలు మెరుగ్గా అవగాహన చేసుకొని బాగా చదువుతారు. అందుకే అంగన్‌వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రయిమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం.
- బడి పిల్లలు ఏరోజు ఏమి తింటున్నారని బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రీ చూసి ఉండరు. ఈ మేనమామ మాత్రం పిల్లలు ఏమి తింటున్నారో చూసి, ఆహారంలో మార్పులతో రోజుకో రకమైన మెనూతో “గోరుముద్ద’ పేరుతో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం.
- ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment