మిగులుకూ మేలు | CM YS Jagan Mohan Reddy Released Welfare Funds: Andhra pradesh | Sakshi
Sakshi News home page

మిగులుకూ మేలు

Published Sat, Jan 6 2024 5:19 AM | Last Updated on Sat, Jan 6 2024 8:17 AM

CM YS Jagan Mohan Reddy Released Welfare Funds: Andhra pradesh - Sakshi

‘‘ఈ ప్రభుత్వం.. ప్రజల తరపున మంచి సేవకుడిలా పని చేస్తోంది. అర్హత ఉండి కూడా ఏ కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలకు దూరమైన మిగిలిపోయిన అర్హులకూ లబ్ధి చేకూరుస్తూ ఏటా రెండు దఫాలుగా కార్యక్రమాలను నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంత తోడుగా నిలబడుతోందనేది చెప్పేందుకు ఇది ఒక సందేశంలా నిలుస్తూ ఎంతో సంతృప్తినిస్తోంది’’  – ముఖ్యమంత్రి జగన్‌

సాక్షి, అమరావతి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో మేలు చేయాలనే తపనతో జవాబు­దారీతనం, పారదర్శకతతో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. పథకాల కోసం పేదలు ఏ ఇబ్బందీ పడకుండా మిగిలిపోయిన అర్హులకు సైతం ఆర్నెల్లకు ఒకసారి లబ్ధి చేకూర్చుతున్నామని తెలిపారు.

అర్హులెవరూ మిస్‌ కాకూడదన్నదే ఈ ప్రభుత్వ ఆరాటమని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబరు వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని 68,990 మంది మిగిలిపోయిన అర్హుల ఖాతాల్లో రూ.97.76 కోట్లను ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. 

మళ్లీ దరఖాస్తుకు అవకాశమిస్తూ..
నా నుంచి మొదలుపెడితే కలెక్టర్లు, సచివాలయాల వరకు ప్రతి ఒక్కరికీ ఎంతో  సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇది. ఎవరికి ఏ సమస్య వచ్చినా మంచి సేవకుడిలా ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసా కల్పించే కార్యక్రమం ఇది. ఏ కారణం చేతనైనా పొరపాటున ఒక పథకం అర్హులకు అందకుంటే నెల రోజుల సమయం ఇచ్చి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం. దాన్ని వెరిఫై చేసి మిగిలిపోయిన అర్హులకు ఆర్నెల్ల లోపు లబ్ధి చేకూరుస్తున్నాం.

ఏటా రెండు దఫాలుగా క్రమం తప్పకుండా జూన్‌ – జూలైలో ఒకసారి, డిసెంబరు – జనవరిలో మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సమాచారం తెలియక దరఖాస్తు చేసుకోకపోవడం, దరఖాస్తులో ఏదైనా పొరపాట్లు దొర్లడం, కావల్సిన పత్రాలు ఇవ్వక పోవడం, ఆధార్‌ మిస్‌ మ్యాచ్‌ లాంటి పలు కారణాలతో పథకాలకు దూరమైన అర్హులకూ దీని ద్వారా మంచి చేస్తున్నాం. అర్హులు ఏ ఒక్కరూ మిగిలి­పోకూడ­దన్నదే మా ఆరాటం. 

వివిధ పథకాలు మిస్‌ అయిన వారికి లబ్ధి..
అమ్మఒడి పథకానికి అర్హత పొందిన 42.62 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. ఈ పథకానికి సంబంధించి వివిధ కారణాలతో మిస్‌ అయిన మరో 40,616 మందికి ఇవాళ నగదు జమ చేస్తున్నాం. జగనన్న చేదోడు ద్వారా 3.25 లక్షల మందికి మంచి జరిగింది. వివిధ కారణాల వల్ల పథకాన్ని అందుకోలేకపోయిన మరో 15 వేల మందికి ఇప్పుడు లబ్ధి చేకూరుస్తున్నాం. ఈబీసీ నేస్తం కింద ఇప్పటికే 4.40 లక్షల మందికి మంచి జరగ్గా మిగిలిపోయిన మరో 4,180 మందికి ఇప్పుడు ప్రయోజనం చేకూరుతోంది.

వైఎస్సార్‌ వాహన­మి­త్ర ద్వారా అప్పట్లో 2.80 లక్షల మందికి మంచి జరగ్గా ఇప్పుడు మరో 3,030 మందికి మంచి చేస్తున్నాం. మత్స్యకార భరోసా ద్వారా ఇప్పటికే 1.20 లక్షల మందికి మంచి జరగ్గా ఇవాళ మరో 2 వేల మందికి మేలు జరుగుతోంది. కళ్యాణమస్తు – షాదీ తోఫా ద్వారా 29,934 మందికి ఇప్పటికే ప్ర­యో­జనం చేకూరగా ఇప్పుడు మరో 1,912 మందికి లబ్ధి చేకూరుస్తున్నాం. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 3.60 లక్షల మందికి ఇప్పటికే మంచి జరగ్గా ఇవాళ మరో 1,884 మందికి మేలు చేస్తున్నాం. నేతన్న నే­స్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరగ్గా ఇవాళ మరో 352 మందికి మంచి చేస్తున్నాం. 

మరో 1.17 లక్షల కొత్త పెన్షన్లు..
ఇవే కాకుండా కొత్తగా మరో 1,17,161 మందికి పింఛన్లు మంజూరు చేసి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక అందిస్తున్నాం. మరో 1,11,321 మందికి కొత్తగా బియ్యం కార్డులను కూడా ఈ నెల నుంచి అందిస్తున్నాం. మరోవైపు 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు, 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలను కూడా అందచేస్తున్నాం. పథకమేదైనా సరే.. అర్హులెవరూ మిస్‌ కాకూడదు, పేదలు ఇబ్బంది పడకూడదనే ఆరాటంతో ఆర్నెల్లకు ఒకసారి శాచ్యురేషన్‌ పద్ధతిలో మిగిలిపోయిన అర్హులందరికీ మంచి చేస్తున్నాం.

వారు దరఖాస్తు చేసుకునేందుకు వలంటీర్‌ సేవలను అందుబాటులో ఉంచుతు
న్నాం. సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. లేదంటే జగనన్నకు చెబుదాం 1902కి కాల్‌ చేసినా చాలు.. ఎలా అప్లై చేసుకోవాలి? ఏ పత్రాలు కావాలి? అనే విషయాలను వివరిస్తారు.

కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.అనంతరాము, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పరిశ్రమలశాఖ (హేండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌స్‌టైల్స్‌) ముఖ్యకార్యదర్శి కె.సునీత, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఏ.సూర్యకుమారి, హేండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌ ముదావత్‌ ఎం.నాయక్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ కె.విజయ, పౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌ ఎం.విజయ సునీత తదితరులు పాల్గొన్నారు. 

ఐదు దఫాల్లో రూ.1,700 కోట్లు
2021లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి క్రమం తప్పకుండా ప్రతి ఆర్నెల్లకు ఒకసారి నిర్వహిస్తున్నాం. ఇలా ఐదు పర్యాయాల్లో దాదాపు రూ.1,700 కోట్లను అర్హత ఉండి పొరపాటున మిస్‌ అయిన లబ్ధిదారులకు అందచేశాం. 

సీఎం సతీమణి కోసం నేతన్న చీర
ముఖ్యమంత్రి కుటుంబంపై అభిమానంతో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన చేనేతకారుడు మురుగుడు నాగరాజు తాను ప్రత్యేకంగా నేసిన మంగళగిరి పట్టు చీరను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు బహుకరించాడు. ఆ చీరను సీఎం సతీమణి వైఎస్‌ భారతికి అందచేయాలని కోరాడు. సీఎం సతీమణి వైఎస్‌ భారతి కోసం నేసిన పట్టు చీరను ముఖ్యమంత్రికి అందిస్తున్న చేనేత కారుడు నాగరాజు

ఇంత డీబీటీ మరెక్కడా లేదు..
ఏ ముఖ్యమంత్రీ అమలు చేయనన్ని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మీరు (సీఎం జగన్‌) శ్రీకారం చుట్టారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ డీబీటీ ద్వారా రూ.2.46 లక్షల కోట్లకుపైగా ప్రజ­లకు అందించిన దాఖలాలు లేవు. పాదయా­త్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసి ఇన్ని పథకాలకు రూపకల్పన చేశారు. ప్రతి గ్రామంలో ఆఖరి కుటుంబం వరకు సంక్షేమం అందాలన్న మీ ఆలోచనకు జేజేలు.

మిగిలి­పోయిన అర్హులను జల్లెడ పట్టి మరీ లబ్ధి చేకూర్చడం మీ చిత్తశుద్ధికి నిదర్శనం. టంచన్‌గా పింఛన్‌ ఇవ్వడమే కాకుండా మాట ప్రకారం పెంచిన మీపట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగింది. పేదల కళ్లలో సంతోషం చూడాలన్న మీ తపనను సహించలేక కొందరు విషం చిమ్ముతున్నా ప్రజలు వాస్తవాలను గుర్తించారు. వారి మనసులో మీరు చెరగని ముద్ర వేశారు. సామాజిక న్యాయం, సాధికారత మీవల్లే సాధ్యమని ప్రజలు దృఢంగా నమ్ముతున్నారు.  – ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

అన్నీ అందుతున్నాయి.. 
అన్ని పథకాలు అందుతున్నాయి. మా అమ్మకు పెంచిన ఫించన్‌ రూ.3 వేలు అందాయి. మా ఆటో కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారు. మీరు చల్లగా ఉండాలి.    –ఖాజా హుస్సేన్, లబ్ధిదారుడు, కల్లూరు, పాణ్యం నియోజకవర్గం

అన్నలా తోడున్నారు..
నాన్న చిన్న బట్టల షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అమ్మ చనిపోయింది. డిగ్రీ పూర్తి చేశా. ఆర్థిక ఇబ్బందులతో పై చదువులకు దూరమయ్యా. ట్యూషన్స్‌ చెప్పుకుంటూ, టైలరింగ్‌ ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్నా. వలంటీర్‌ ద్వారా జగనన్న చేదోడు పథకం గురించి తెలుసుకుని లబ్ధి పొందా. ఆ డబ్బులతో వ్యాపారాన్ని పెంచుకున్నా.

మీరు అందించే సాయం మా జీవితాలకు ఎంతో ఉపయోగపడుతోంది. సొంతింటి కల కూడా మీవల్ల నెరవేరింది. త్వరలో గృహ ప్రవేశం కూడా చేస్తాం. ఇది నూతన సంవత్సర కానుకగా భావిస్తున్నా. నాకు అమ్మలేని లోటును అన్నగా మీరు తీరుస్తున్నారు. దిశ యాప్‌ భరోసాతో ఒంటరిగా బయటికి వెళ్లగలుగుతున్నాం. ఒక్క రూపాయి లంచం లేకుండా అన్నీ అందుతున్నాయి. మిమ్మల్ని మళ్లీ సీఎంగా గెలిపించుకుంటాం.        – సాయి ప్రత్యూష, లబ్ధిదారు, శ్రీకాకుళం  

కాపు నేస్తం ఆదుకుంది
దివ్యాంగుడైన నా భర్తకు పింఛన్‌ ఇస్తున్నారు. ఆయనకు ఏడాది క్రితం హార్ట్‌ ఎటాక్‌ రావడంతో ఆరోగ్యశ్రీ కింద లక్ష రూపాయల ఉచిత వైద్యం అందించారు. మాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. కాపు నేస్తం మూడు విడతలు తీసుకున్నా. నాలుగో విడత కరెంట్‌ బిల్లు సమస్య వల్ల రాలేదన్నారు. వలంటీర్‌ ద్వారా సచివాలయంలో సంప్రదించడంతో మళ్లీ వచ్చిందని చెప్పారు.

ఆ డబ్బులతో కుట్టుమిషన్‌ కొనుక్కుని జీవనం సాగిస్తున్నా. నాకు అన్ని పథకాలు అందాయి. ఐదేళ్లలో రూ.3.50 లక్షలు మేరకు లబ్ధి పొందా. కాపులను ఏ ప్రభు­త్వమూ పట్టించుకోకపోయినా మీరు గుర్తు పెట్టుకుని సాయం చేశారు. మా కాపు అక్కచెల్లెమ్మలు అంతా మీ వెంటే ఉంటారు. మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం.  – శాంతిశ్రీ, లబ్ధిదారు, హుకుంపేట, రాజమండ్రి రూరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement