Welfare Fund
-
మిగులుకూ మేలు
‘‘ఈ ప్రభుత్వం.. ప్రజల తరపున మంచి సేవకుడిలా పని చేస్తోంది. అర్హత ఉండి కూడా ఏ కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలకు దూరమైన మిగిలిపోయిన అర్హులకూ లబ్ధి చేకూరుస్తూ ఏటా రెండు దఫాలుగా కార్యక్రమాలను నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంత తోడుగా నిలబడుతోందనేది చెప్పేందుకు ఇది ఒక సందేశంలా నిలుస్తూ ఎంతో సంతృప్తినిస్తోంది’’ – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో మేలు చేయాలనే తపనతో జవాబుదారీతనం, పారదర్శకతతో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. పథకాల కోసం పేదలు ఏ ఇబ్బందీ పడకుండా మిగిలిపోయిన అర్హులకు సైతం ఆర్నెల్లకు ఒకసారి లబ్ధి చేకూర్చుతున్నామని తెలిపారు. అర్హులెవరూ మిస్ కాకూడదన్నదే ఈ ప్రభుత్వ ఆరాటమని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబరు వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని 68,990 మంది మిగిలిపోయిన అర్హుల ఖాతాల్లో రూ.97.76 కోట్లను ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. మళ్లీ దరఖాస్తుకు అవకాశమిస్తూ.. నా నుంచి మొదలుపెడితే కలెక్టర్లు, సచివాలయాల వరకు ప్రతి ఒక్కరికీ ఎంతో సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇది. ఎవరికి ఏ సమస్య వచ్చినా మంచి సేవకుడిలా ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసా కల్పించే కార్యక్రమం ఇది. ఏ కారణం చేతనైనా పొరపాటున ఒక పథకం అర్హులకు అందకుంటే నెల రోజుల సమయం ఇచ్చి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం. దాన్ని వెరిఫై చేసి మిగిలిపోయిన అర్హులకు ఆర్నెల్ల లోపు లబ్ధి చేకూరుస్తున్నాం. ఏటా రెండు దఫాలుగా క్రమం తప్పకుండా జూన్ – జూలైలో ఒకసారి, డిసెంబరు – జనవరిలో మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సమాచారం తెలియక దరఖాస్తు చేసుకోకపోవడం, దరఖాస్తులో ఏదైనా పొరపాట్లు దొర్లడం, కావల్సిన పత్రాలు ఇవ్వక పోవడం, ఆధార్ మిస్ మ్యాచ్ లాంటి పలు కారణాలతో పథకాలకు దూరమైన అర్హులకూ దీని ద్వారా మంచి చేస్తున్నాం. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదన్నదే మా ఆరాటం. వివిధ పథకాలు మిస్ అయిన వారికి లబ్ధి.. అమ్మఒడి పథకానికి అర్హత పొందిన 42.62 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. ఈ పథకానికి సంబంధించి వివిధ కారణాలతో మిస్ అయిన మరో 40,616 మందికి ఇవాళ నగదు జమ చేస్తున్నాం. జగనన్న చేదోడు ద్వారా 3.25 లక్షల మందికి మంచి జరిగింది. వివిధ కారణాల వల్ల పథకాన్ని అందుకోలేకపోయిన మరో 15 వేల మందికి ఇప్పుడు లబ్ధి చేకూరుస్తున్నాం. ఈబీసీ నేస్తం కింద ఇప్పటికే 4.40 లక్షల మందికి మంచి జరగ్గా మిగిలిపోయిన మరో 4,180 మందికి ఇప్పుడు ప్రయోజనం చేకూరుతోంది. వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా అప్పట్లో 2.80 లక్షల మందికి మంచి జరగ్గా ఇప్పుడు మరో 3,030 మందికి మంచి చేస్తున్నాం. మత్స్యకార భరోసా ద్వారా ఇప్పటికే 1.20 లక్షల మందికి మంచి జరగ్గా ఇవాళ మరో 2 వేల మందికి మేలు జరుగుతోంది. కళ్యాణమస్తు – షాదీ తోఫా ద్వారా 29,934 మందికి ఇప్పటికే ప్రయోజనం చేకూరగా ఇప్పుడు మరో 1,912 మందికి లబ్ధి చేకూరుస్తున్నాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3.60 లక్షల మందికి ఇప్పటికే మంచి జరగ్గా ఇవాళ మరో 1,884 మందికి మేలు చేస్తున్నాం. నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరగ్గా ఇవాళ మరో 352 మందికి మంచి చేస్తున్నాం. మరో 1.17 లక్షల కొత్త పెన్షన్లు.. ఇవే కాకుండా కొత్తగా మరో 1,17,161 మందికి పింఛన్లు మంజూరు చేసి వైఎస్సార్ పెన్షన్ కానుక అందిస్తున్నాం. మరో 1,11,321 మందికి కొత్తగా బియ్యం కార్డులను కూడా ఈ నెల నుంచి అందిస్తున్నాం. మరోవైపు 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు, 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలను కూడా అందచేస్తున్నాం. పథకమేదైనా సరే.. అర్హులెవరూ మిస్ కాకూడదు, పేదలు ఇబ్బంది పడకూడదనే ఆరాటంతో ఆర్నెల్లకు ఒకసారి శాచ్యురేషన్ పద్ధతిలో మిగిలిపోయిన అర్హులందరికీ మంచి చేస్తున్నాం. వారు దరఖాస్తు చేసుకునేందుకు వలంటీర్ సేవలను అందుబాటులో ఉంచుతు న్నాం. సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. లేదంటే జగనన్నకు చెబుదాం 1902కి కాల్ చేసినా చాలు.. ఎలా అప్లై చేసుకోవాలి? ఏ పత్రాలు కావాలి? అనే విషయాలను వివరిస్తారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పరిశ్రమలశాఖ (హేండ్లూమ్స్ అండ్ టెక్స్స్టైల్స్) ముఖ్యకార్యదర్శి కె.సునీత, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి, హేండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ ముదావత్ ఎం.నాయక్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కె.విజయ, పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ ఎం.విజయ సునీత తదితరులు పాల్గొన్నారు. ఐదు దఫాల్లో రూ.1,700 కోట్లు 2021లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి క్రమం తప్పకుండా ప్రతి ఆర్నెల్లకు ఒకసారి నిర్వహిస్తున్నాం. ఇలా ఐదు పర్యాయాల్లో దాదాపు రూ.1,700 కోట్లను అర్హత ఉండి పొరపాటున మిస్ అయిన లబ్ధిదారులకు అందచేశాం. సీఎం సతీమణి కోసం నేతన్న చీర ముఖ్యమంత్రి కుటుంబంపై అభిమానంతో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన చేనేతకారుడు మురుగుడు నాగరాజు తాను ప్రత్యేకంగా నేసిన మంగళగిరి పట్టు చీరను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు బహుకరించాడు. ఆ చీరను సీఎం సతీమణి వైఎస్ భారతికి అందచేయాలని కోరాడు. సీఎం సతీమణి వైఎస్ భారతి కోసం నేసిన పట్టు చీరను ముఖ్యమంత్రికి అందిస్తున్న చేనేత కారుడు నాగరాజు ఇంత డీబీటీ మరెక్కడా లేదు.. ఏ ముఖ్యమంత్రీ అమలు చేయనన్ని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మీరు (సీఎం జగన్) శ్రీకారం చుట్టారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ డీబీటీ ద్వారా రూ.2.46 లక్షల కోట్లకుపైగా ప్రజలకు అందించిన దాఖలాలు లేవు. పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసి ఇన్ని పథకాలకు రూపకల్పన చేశారు. ప్రతి గ్రామంలో ఆఖరి కుటుంబం వరకు సంక్షేమం అందాలన్న మీ ఆలోచనకు జేజేలు. మిగిలిపోయిన అర్హులను జల్లెడ పట్టి మరీ లబ్ధి చేకూర్చడం మీ చిత్తశుద్ధికి నిదర్శనం. టంచన్‌గా పింఛన్ ఇవ్వడమే కాకుండా మాట ప్రకారం పెంచిన మీపట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగింది. పేదల కళ్లలో సంతోషం చూడాలన్న మీ తపనను సహించలేక కొందరు విషం చిమ్ముతున్నా ప్రజలు వాస్తవాలను గుర్తించారు. వారి మనసులో మీరు చెరగని ముద్ర వేశారు. సామాజిక న్యాయం, సాధికారత మీవల్లే సాధ్యమని ప్రజలు దృఢంగా నమ్ముతున్నారు. – ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అన్నీ అందుతున్నాయి.. అన్ని పథకాలు అందుతున్నాయి. మా అమ్మకు పెంచిన ఫించన్ రూ.3 వేలు అందాయి. మా ఆటో కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారు. మీరు చల్లగా ఉండాలి. –ఖాజా హుస్సేన్, లబ్ధిదారుడు, కల్లూరు, పాణ్యం నియోజకవర్గం అన్నలా తోడున్నారు.. నాన్న చిన్న బట్టల షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అమ్మ చనిపోయింది. డిగ్రీ పూర్తి చేశా. ఆర్థిక ఇబ్బందులతో పై చదువులకు దూరమయ్యా. ట్యూషన్స్ చెప్పుకుంటూ, టైలరింగ్ ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్నా. వలంటీర్ ద్వారా జగనన్న చేదోడు పథకం గురించి తెలుసుకుని లబ్ధి పొందా. ఆ డబ్బులతో వ్యాపారాన్ని పెంచుకున్నా. మీరు అందించే సాయం మా జీవితాలకు ఎంతో ఉపయోగపడుతోంది. సొంతింటి కల కూడా మీవల్ల నెరవేరింది. త్వరలో గృహ ప్రవేశం కూడా చేస్తాం. ఇది నూతన సంవత్సర కానుకగా భావిస్తున్నా. నాకు అమ్మలేని లోటును అన్నగా మీరు తీరుస్తున్నారు. దిశ యాప్ భరోసాతో ఒంటరిగా బయటికి వెళ్లగలుగుతున్నాం. ఒక్క రూపాయి లంచం లేకుండా అన్నీ అందుతున్నాయి. మిమ్మల్ని మళ్లీ సీఎంగా గెలిపించుకుంటాం. – సాయి ప్రత్యూష, లబ్ధిదారు, శ్రీకాకుళం కాపు నేస్తం ఆదుకుంది దివ్యాంగుడైన నా భర్తకు పింఛన్ ఇస్తున్నారు. ఆయనకు ఏడాది క్రితం హార్ట్ ఎటాక్ రావడంతో ఆరోగ్యశ్రీ కింద లక్ష రూపాయల ఉచిత వైద్యం అందించారు. మాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. కాపు నేస్తం మూడు విడతలు తీసుకున్నా. నాలుగో విడత కరెంట్ బిల్లు సమస్య వల్ల రాలేదన్నారు. వలంటీర్ ద్వారా సచివాలయంలో సంప్రదించడంతో మళ్లీ వచ్చిందని చెప్పారు. ఆ డబ్బులతో కుట్టుమిషన్ కొనుక్కుని జీవనం సాగిస్తున్నా. నాకు అన్ని పథకాలు అందాయి. ఐదేళ్లలో రూ.3.50 లక్షలు మేరకు లబ్ధి పొందా. కాపులను ఏ ప్రభుత్వమూ పట్టించుకోకపోయినా మీరు గుర్తు పెట్టుకుని సాయం చేశారు. మా కాపు అక్కచెల్లెమ్మలు అంతా మీ వెంటే ఉంటారు. మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం. – శాంతిశ్రీ, లబ్ధిదారు, హుకుంపేట, రాజమండ్రి రూరల్ -
భారీ విరాళం.. బీసీసీఐ ‘సెల్యూట్’
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సైనిక సంక్షేమ నిధికి రూ.20 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ నెల 23న జరగనున్న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ఈ భారీ మొత్తాన్ని అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు త్రివిధ దళాలకు సంబంధించిన ఉన్నతాధికారిని మ్యాచ్‌కు అతిథిగా పిలిచి ఈ విరాళాన్ని అందించాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ఉన్నతాధికారి తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. ప్రారంభ వేడుకలకు అయ్యే ఖర్చు రూ. 15 కోట్ల(గతేడాది అయిన ఖర్చు)తో పాటు అదనంగా మరో ఐదు కోట్లు జతచేసి సంక్షేమ నిధికి ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. చెన్నై వేదికగా జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో ధోనీ, కోహ్లి సమక్షంలో భద్రతా దళాల అధికారులకు చెక్‌ను అందించనున్నారు. ఇక భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సందర్భంగా.. రాంచీ వన్డేలో ఆర్మీ క్యాప్‌తో బరిలో దిగిన టీమిండియా ఆటగాళ్లు.. మ్యాచ్ ఫీజును అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. -
న్యాయం చేస్తా
సినీ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సినీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ నియామకం జరిగింది. ఈ కమిటీ చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జయప్రకాశ్ నారాయణ్ వల్లూరు నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన 20మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలుగు సినిమా రంగం నుంచి నిర్మాత సి. కల్యాణ్ ఓ కమిటీ మెంబర్‌గా స్థానం సంపాదించారు. ఆర్టికల్ 33,1984 ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుందని, జూలై 31న ఈ కమిటీ నియామకం పూర్తయిందని సి. కల్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ– ‘‘దేశవ్యాప్తంగా ఎంతో పోటీ ఉన్నా ఒక తెలుగు వ్యక్తికి అవకాశం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి కార్మికునికి న్యాయం జరిగేలా చూస్తాను. ముఖ్యంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా చాలా ముఖ్యం. ఈ నెల 17న ‘ఝాన్సీ’ సినిమా, 24వ తేదిన ‘లక్ష్మీ’ చిత్రాలు మా సంస్థ నుండి విడుదలవుతున్నాయి. ఆ సినిమాలు విజయవంతమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. -
చేనేత అభ్యున్నతికి చేయూత
సాక్షి, హైదరాబాద్: నేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే పద్మశాలీల అభ్యున్నతికి బహుముఖ వ్యూహంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఇందుకోసం ప్రభుత్వం, పద్మశాలీ సంక్షేమ సంఘం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. చేనేత, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికి అవసరమైన చేయూత, ప్రోత్సాహం అందించడంతోపాటు.. వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని అన్నారు. మారుతున్న కాలా నికి అనుగుణంగా సామాజిక మార్పులు వస్తాయని, ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవిక దృక్పథంతో ముం దుకు పోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన చెప్పారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతిభవన్‌కు వచ్చిన పద్మశాలీ సంఘం నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. హైదరాబాద్‌లో పద్మశాలీ భవనం పద్మశాలీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని, ఈ నిధులను సద్వినియోగం చేసుకుని శాశ్వత పరిష్కారాలు చూపాలని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లో పద్మశాలీ భవనం నిర్మాణానికి రెండున్నర ఎకరాల స్థలం, రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పద్మశాలీ సంఘం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, ఇందుకోసం మొదటి విరాళంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పద్మశాలీ సంఘం ప్రముఖులు కూడా సంక్షేమ నిధికి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. జోలె పట్టి.. చందాలు పోగుచేసి.. ‘‘చేనేత వృత్తికి గతంలో గొప్ప గౌరవం దక్కేది. ఈ వృత్తిపై ఆధారపడిన పద్మశాలీలకూ ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. 130 కోట్ల మంది భారతీయులకు సరిపడా వస్త్రాలను చేనేత కార్మికులు నేయలేరు. మరమగ్గాలు, మిల్లులు వచ్చాయి. వాటితో చేనేత కార్మికులు పోటీ పడటం అసాధ్యం. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వేరే పనులు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. సమైక్య పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదు. సమస్యలను పరిష్కరించలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న నేను స్వయంగా పూనుకుని సిరిసిల్లలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ.50 లక్షల పార్టీ నిధులతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశా. పోచంపల్లిలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోతే.. టీఆర్ఎస్ పక్షాన జోలె పట్టుకుని చందాలు పోగు చేసి ఆదుకునే ప్రయత్నం చేశాం’’అని వివరించారు. వస్త్రాలు కొని ఆదుకుంటున్నాం.. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చేనేత కార్మికులకు కొంతమేరకైనా ఆదుకోవచ్చని ఆనాడే అనుకున్నాం. రాష్ట్రం వచ్చాక చేనేత, మరమగ్గాల కార్మికులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. చేనేత, నేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంచే చీరలను, ఇతర ప్రభుత్వ అవసరాలకు వస్త్రాలను సేకరించి, మార్కెటింగ్ సమస్య రాకుండా చేస్తున్నది. వంద శాతం ప్రభుత్వ నిధులతో మరమగ్గాలను ఆధునీకరిస్తున్నాం. నూలు, రసాయలనాలపై 50 శాతం సబ్సిడీ అందిస్తున్నాం. ఈ చర్యల వల్ల కొంత ఉపశమనం దొరికింది. మరమగ్గాల కార్మికులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల ఆదాయం వస్తోంది. ఇదే శాశ్వత పరిష్కారం కాదు. ఇంకా చేనేత వృత్తుల్లోనే కొనసాగుతున్న వారికి, మరమగ్గాలపై పనిచేస్తున్న వారికి కొంత మేరకు ఈ ప్రయత్నాల వల్ల మేలు కలిగింది’’అని కేసీఆర్ తెలిపారు. లెక్కలు తీయాలి.. చేనేత వృత్తిని వదిలేసిన వారిని, వేరే ఉపాధి చూసుకునే వారిని గుర్తించి చేయూత అందించాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. పద్మశాలీ సంఘం ప్రముఖులు, పెద్దలు ఇందుకోసం క్రియాశీలంగా మారాలని కోరారు. ‘‘తమ కులంలో ఎవరు సంప్రదాయ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు? వారికోసం ఏం చేయాలి? అలాగే పోచంపల్లి, గద్వాల, నారాయణపేట ప్రాంతాల్లో కళాత్మక చేనేత వృత్తి కొనసాగుతోంది. అక్కడి వస్త్రాలకు మార్కెట్ ఉంది. అలాంటి వారికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి? వృత్తిని వదిలిపెట్టిన వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపాలి? వారికి ప్రభుత్వం ఏం చేయాలి? అనే విషయాలపై లెక్కలు తీయాలి. మీకేం కావాలో మీరే నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ నిధులను ఉపయోగించుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎలా కనుగొంటారనే దానిపై అధ్యయనం చేయాలి’’అని కోరారు. సీఎంతో భేటీ అయిన వారిలో తెలంగాణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గోశిక యాదగిరి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మ్యాడం బాబురావు, ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, కోశాధికారి అంకం వెంకటేశ్వర్లు, మహిళా ఆర్థిక సహకార సంఘం అధ్యక్షురాలు గుండు సుధారాణి, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, వరంగల్ జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, ఎన్ఆర్ఐ ప్రతినిధి సామల ప్రదీప్, పద్మశాలీ సంఘం నాయకులు జల్ల మార్కండేయ, గుండు ప్రభాకర్, చాగల్ల నరేంద్రనాథ్ ఉన్నారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, వివేకానంద, అధికారులు వికాస్‌రాజ్, నీతూప్రసాద్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో లోకేష్‌కు తొలిసారిగా బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు తొలిసారి అధికారికంగా పార్టీ బాధ్యతలు అప్పగించారు. కార్యకర్తల కోసం పార్టీ ఏర్పాటు చేసిన సంక్షేమ నిధికి సమన్వయకర్తగా ఆయనను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలాకాలంగా లోకేష్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పటికీ పార్టీ ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి అధికార బాధ్యతలు అప్పజెప్పలేదు. -
సభ్యులందరికీ సంక్షేమ నిధి
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమకు మరోసారి అవకాశం ఇస్తే సభ్యులందరికీ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని ప్రోగ్రెసివ్ ఫ్రంట్ తరపున ఆస్కా అధ్యక్ష, కార్యదర్శుల స్థానానికి పోటీ చేస్తున్న కె.సుబ్బారెడ్డి, వీరయ్య తెలిపారు. ఆస్కాను లోటు బడ్జెట్ నుంచి మిగులు బడ్జెట్‌కు తీసుకొచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ఆస్కా ఎన్నికలు ఆదివారం జరగనున్నారుు. చెన్నైలో శనివారం సాయంత్రం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో కె.సుబ్బారెడ్డి మాట్లాడారు. తమ ఫ్రంట్ 2003లో బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉద్యోగులకు కనీసం జీతాలు చెల్లించలేని స్థితిలో ఆస్కా ఉండేదన్నారు. జీతాల కోసం ఫిక్సిడ్ డిపాజిట్లోని సొమ్మును, నిర్వహణ ఖర్చుల కోసం సభ్యుల సభ్యత్వ రుసుంను వినియోగించేవారని అన్నారు. తాను అధ్యక్షునిగా, వీరన్న కార్యదర్శిగా ఇతర సభ్యుల సహకారంతో ఆస్కాను లోటు బడ్జెట్ నుంచి మిగులు బడ్జెట్‌కు తీసుకువచ్చామని తెలిపారు. మొదటి నాలుగేళ్లలోనే డిపాజిట్‌ను రూ.6 కోట్లకు చేర్చగలిగామని పేర్కొన్నారు. అదే ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహించడం, మహిళలతో ఫుడ్ ఫెస్టివల్, విహారయాత్రలు వంటి కార్యక్రమాల ద్వారా కుటుంబ సభ్యులను సైతం ఆకట్టుకున్నామన్నారు. సాంస్కృతిక, సంప్రదాయాలకు శ్రీకారం చుట్టడం వలనే నేడు ఆస్కా అందరిదైందని అన్నారు. ప్రస్తుత టర్మ్‌లో సైతం కేవలం రెండేళ్లలో రూ.2.5 కోట్ల డిపాజిట్ ఏర్పాటుతో అదే స్థాయిలో ఆర్థికాభివృద్ధి సాధించామని వివరించారు. సభ్యత్వ రుసుం నూరుశాతం బ్యాంకులో జమ చేస్తున్నామని వెల్లడించారు. ఆస్కా ఆర్థిక లావాదేవీలపై గతంలోలా గొడవలు చోటుచేసుకోకుండా పారదర్శకత పాటించామని వివరించారు. ప్రభుత్వానికి వినతి సభ్యుల సంఖ్య పెరిగిందని, ఈ క్రమంలో రూములకు డిమాండ్ ఏర్పడడంతో సువిశాలమైన కొత్త స్థలం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని సుబ్బారెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాలపై తమ ప్రతిపాదనలు ముందుకు సాగుతున్నాయని అన్నారు. గదుల కేటాయింపులో గందరగోళాన్ని నివారించేందుకు ఆన్లైన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. తమ హయాంలో నిర్వహించిన డైమండ్ జూబ్లీ ఉత్సవాలు సభ్యుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని చెప్పారు. ఈ ఉత్సవాల సమయంలోనే ఆస్కా కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయగలిగామన్నారు. ఇదే ఉత్సాహంతో ఆస్కా సభ్యులందరికీ వర్తించేలా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి తీరుతామని వీరయ్య చెప్పారు. తెలుగువారందరూ కోరుకునే అత్యంత రుచికరమైన భోజనా న్ని అందిస్తామని, తన పట్టుదల ఎలాంటిదో ఆస్కాలోని సభ్యులందరికీ తెలుసునని పేర్కొన్నారు. తాము చెప్పిందే చేశామని, చేసేదే చెబుతామని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మైనస్‌లో ఉన్న ఆస్కాను ప్లస్‌లోకి తీసుకు వచ్చామన్నారు. ఈ దృష్ట్యా ప్రోగ్రెసివ్ ఫ్రంట్‌కు మరోసారి అవకాశం ఇచ్చి ఆస్కా అభివృద్ధికి దోహదపడాలని సభ్యులకు వారు విజ్ఞప్తి చేశారు. -
టన్ను చెరకు రూ.2,215లు
యలమంచిలి/ఎస్.రాయవరం, న్యూస్‌లైన్: ఏటికొప్పాక సుగర్ ఫాక్టరీ పరిధిలో రైతులకు వచ్చే క్రషింగ్ సీజన్లో టన్నుకు రూ.2,215లు మద్దతు ధర చెల్లించడానికి శుక్రవారం జరిగిన మహాజనసభలో తీర్మానించారు. బ్యాంకులద్వారా సభ్య రైతులకు చెల్లించాలని నిర్ణయించారు. గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.200లు ప్రోత్సాహకానికి కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించగా రూ.120లు చెల్లింపునకు అంగీకరించారని చైర్మన్ రాజాసాగి రామభద్రరాజు సమావేశంలో వెల్లడించారు. వచ్చే సీజన్లో 2.25లక్షల టన్నుల క్రషింగ్ జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం లెవీని తగ్గించడంవల్ల ఫ్యాక్టరీ పరిధిలో రైతులపై రూ.15లక్షల వరకు అదనపు భారం పడుతుందన్నారు. బేగాస్ కొరత వల్ల కో-జనరేషన్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా జరగడంలేదని, రానున్న సీజన్లో దీనిని అధిగమిస్తామన్నారు. మూడేళ్లుగా ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేస్తున్న సభ్యులుకాని రైతులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామన్నారు. ఈ మేరకు సుగర్కేన్ కమిషనర్‌కు వివరాలు పంపామన్నారు. ఫ్యాక్టరీ పరిధిలో 5,600ల మంది సభ్యులు ఉండగా ఇటీవల 930 మందిని తొలగించామని, 4700మంది సభ్యులు ఉన్నారని, వీరిలో 1347 మంది వెల్ఫేర్ ఫండ్ చెల్లించడంలేదని వివరించారు. ఇక ముందు రైతులకు నాణ్యమైన ఎరువులను సరఫరాచేస్తామని, ఇకముందు పొరపాట్లు జరగకుండా చూస్తామన్నారు. ఆసక్తి ఉన్న రైతులకు సోలార్ పంప్సెట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. యూనిట్ ఖరీదు రూ. 6లక్షలు కాగా, కేంద్రప్రభుత్వం 30శాతం, రాష్ట్రప్రభుత్వం 20శాతం రాయితీ కల్పిస్తోందన్నారు. యూనిట్ ఖరీదును మరింత తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రికవరీలో ఫ్యాక్టరీ వెనకబడుతోందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయాధికారి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. సూచనలు, సలహాలు ఇవ్వడంలేదన్నారు. ప్రభుత్వ రాయితీల గురించి వివరించడం లేదని వాపోయారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు ప్లాంటేషన్ ద్వారా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని మరి కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంటేషన్ వంటివాటితో అదనపు ఖర్చులు ఫ్యాక్టరీపై పడుతున్నాయని పలువురు రైతులనడంతో ఎమ్డీ విక్టర్‌రాజు మాట్లాడుతూ అటువంటిదేమీ లేదన్నారు. సమావేశంలో సభ్య రైతులకు రూ.రెండులక్షలవరకు బీమాకు తీర్మానించారు. 60 ఏళ్లు దాటిన సభ్యులకు బీమా వర్తించనందున నగదు చెల్లింపునకు నిర్ణయించారు. గత సీజన్లో అత్యధికంగా చెరకు సరఫరా చేసిన రైతులు సిద్దాబత్తుల వెంకటరమణ, దుబాసి తాతమ్మలతోపాటు 8మందికి ప్రోత్సాహకాలు అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, ఎమ్డీ విక్టర్‌రాజు, డెరైక్టర్లు, రైతులు పాల్గొన్నారు.