సభ్యులందరికీ సంక్షేమ నిధి
Published Sun, Oct 27 2013 4:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమకు మరోసారి అవకాశం ఇస్తే సభ్యులందరికీ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని ప్రోగ్రెసివ్ ఫ్రంట్ తరపున ఆస్కా అధ్యక్ష, కార్యదర్శుల స్థానానికి పోటీ చేస్తున్న కె.సుబ్బారెడ్డి, వీరయ్య తెలిపారు. ఆస్కాను లోటు బడ్జెట్ నుంచి మిగులు బడ్జెట్‌కు తీసుకొచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ఆస్కా ఎన్నికలు ఆదివారం జరగనున్నారుు. చెన్నైలో శనివారం సాయంత్రం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో కె.సుబ్బారెడ్డి మాట్లాడారు. తమ ఫ్రంట్ 2003లో బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉద్యోగులకు కనీసం జీతాలు చెల్లించలేని స్థితిలో ఆస్కా ఉండేదన్నారు. జీతాల కోసం ఫిక్సిడ్ డిపాజిట్‌లోని సొమ్మును, నిర్వహణ ఖర్చుల కోసం సభ్యుల సభ్యత్వ రుసుంను వినియోగించేవారని అన్నారు.
తాను అధ్యక్షునిగా, వీరన్న కార్యదర్శిగా ఇతర సభ్యుల సహకారంతో ఆస్కాను లోటు బడ్జెట్ నుంచి మిగులు బడ్జెట్‌కు తీసుకువచ్చామని తెలిపారు. మొదటి నాలుగేళ్లలోనే డిపాజిట్‌ను రూ.6 కోట్లకు చేర్చగలిగామని పేర్కొన్నారు. అదే ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహించడం, మహిళలతో ఫుడ్ ఫెస్టివల్, విహారయాత్రలు వంటి కార్యక్రమాల ద్వారా కుటుంబ సభ్యులను సైతం ఆకట్టుకున్నామన్నారు. సాంస్కృతిక, సంప్రదాయాలకు శ్రీకారం చుట్టడం వలనే నేడు ఆస్కా అందరిదైందని అన్నారు. ప్రస్తుత టర్మ్‌లో సైతం కేవలం రెండేళ్లలో రూ.2.5 కోట్ల డిపాజిట్ ఏర్పాటుతో అదే స్థాయిలో ఆర్థికాభివృద్ధి సాధించామని వివరించారు. సభ్యత్వ రుసుం నూరుశాతం బ్యాంకులో జమ చేస్తున్నామని వెల్లడించారు. ఆస్కా ఆర్థిక లావాదేవీలపై గతంలోలా గొడవలు చోటుచేసుకోకుండా పారదర్శకత పాటించామని వివరించారు.
ప్రభుత్వానికి వినతి
సభ్యుల సంఖ్య పెరిగిందని, ఈ క్రమంలో రూములకు డిమాండ్ ఏర్పడడంతో సువిశాలమైన కొత్త స్థలం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని సుబ్బారెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాలపై తమ ప్రతిపాదనలు ముందుకు సాగుతున్నాయని అన్నారు. గదుల కేటాయింపులో గందరగోళాన్ని నివారించేందుకు ఆన్‌లైన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. తమ హయాంలో నిర్వహించిన డైమండ్ జూబ్లీ ఉత్సవాలు సభ్యుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని చెప్పారు. ఈ ఉత్సవాల సమయంలోనే ఆస్కా కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయగలిగామన్నారు. ఇదే ఉత్సాహంతో ఆస్కా సభ్యులందరికీ వర్తించేలా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి తీరుతామని వీరయ్య చెప్పారు. తెలుగువారందరూ కోరుకునే అత్యంత రుచికరమైన భోజనా న్ని అందిస్తామని, తన పట్టుదల ఎలాంటిదో ఆస్కాలోని సభ్యులందరికీ తెలుసునని పేర్కొన్నారు. తాము చెప్పిందే చేశామని, చేసేదే చెబుతామని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మైనస్‌లో ఉన్న ఆస్కాను ప్లస్‌లోకి తీసుకు వచ్చామన్నారు. ఈ దృష్ట్యా ప్రోగ్రెసివ్ ఫ్రంట్‌కు మరోసారి అవకాశం ఇచ్చి ఆస్కా అభివృద్ధికి దోహదపడాలని సభ్యులకు వారు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement