నోరూరిస్తున్న స్క్వా–హరిస్సా, తాహినీ–సీబాస్, సిరోహి మటన్
నగరం వేదికగా ఉత్తరాది ఫుడ్‌ఫెస్ట్
ఆలివ్ బ్రిస్టో వేదికగా ప్రముఖ చెఫ్ ఒబెరాయ్,
కాక్‌టెయిల్ మిక్సాలజిస్ట్ చిమ్వాల్
ఓ వైపు మాన్‌సూన్ ముసుర్లతో నగరం తడిసి ముద్దవుతుంటే.. మరోవైపు నార్త్ ఇండియన్ ఫుడ్‌ఫెస్ట్‌లో స్పెషల్ డిషెస్ నగరవాసుల జిహ్వకు కొత్త రుచిని పరిచయం చేస్తున్నాయి. ఆనాటి నుంచి దక్కన్ నేల అంటేనే పసందైన రుచులు, మసాల వంటకాలకు నిలయం. అయినప్పటికీ కొత్త రుచులను ఆహ్వానించడంలో, ఆస్వాదించడంలో హైదరాబాద్ ఎల్లప్పుడూ ముందుంటుంది. దీనికి తగ్గట్టుగానే విభిన్న సంస్కృతులకు నిలయమైన నగరంలో దేశీయ వంటకాలతో పాటు కాంటినెంటల్ రెసిపీలకూ పెట్టింది పేరు. ఈ ఆనవాయితిలో భాగంగానే కొంగొత్త రుచులను ఇష్టపడే భాగ్యనగరంలో ఉత్తరాది వంటకాల ఘుమఘుమలు వెదజల్లుతున్నాయి. జూబ్లిహిల్స్‌లోని ఆలివ్ బిస్ట్రో అండ్ బార్ వేదికగా ప్రారంభమైన ఈ నార్త్ ఫుడ్ ఫెస్ట్ ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత చెఫ్ ధృవ్ ఒబెరాయ్, అవార్డ్ విన్నింగ్ మిక్సాలజిస్ట్ హరీష్ చిమ్వాల్ ఆధ్వర్యంలోని ఈ ప్రత్యేకమైన డైనింగ్ ఫుడ్
లవర్స్‌కు డెస్టినేషన్‌గా మారింది.
స్పైసీ, మసాలాలు, బిర్యానీలు ఆస్వాదించే హైదరాబాద్‌లో పుల్లటి ఉసిరి, కచ్చ మామిడి సలాడ్ మొదలు హిమాలయన్ చీజ్ సౌఫిల్ వరకు వినూత్న రుచులు సందడి చేస్తున్నాయి. చెఫ్ ధ్రువ్ పాకశాస్త్ర నైపుణ్యంతో తయారు చేసిన జామూన్ ఊరగాయ, పొగబెట్టి వడ్డించిన వంకాయ లాబ్నేతో పాటు సిరోహి మటన్, క్వాయిల్ ఎగ్ కుఫ్తే మీట్‌బాల్స్ వంటి నోరూరించే వంటకాలు నగరానికి సరికొత్త ఆకలిని సృష్టిస్తున్నాయి. ఆహ్లాదమైన దుర్గం చెరువు అంచున బటర్‌నట్ స్క్వా–హరిస్సా, తాహినీ–సీబాస్, కటిల్ ఫిష్–పిసి వంటి ఆధునికత మిళితం చేసిన క్లాసిక్ వంటకాలు మరో లోకాన్ని పరిచయం చేస్తున్నాయి. వీటికి అద్భుత సమ్మేళనంలా హరీష్ చిమ్వాల్ అందిస్తున్న కాక్‌టెయిల్ మిక్సింగ్ మరో స్పెషాలిటి. ఎథీనా, హైబిస్కస్, రోసా టెక్, మొరాకన్ సోర్, కోకో బౌలేవార్డియర్ వంటి మిక్స్‌లు వెస్ట్రన్ బార్‌లను తలపిస్తున్నాయి.
హైదరాబాద్, ఢిల్లీ పాప్–అప్..
కొత్త రుచులను ఆస్వాదించడానికి నగరవాసులు విదేశాలకు లేదా ఉత్తరాది నగరాలకు వెళ్లాల్సిన శ్రమ లేకుండా.. ఆ రుచులే నగరానికి వచ్చాయి. ఈ హైదరాబాద్, ఢిల్లీ పాప్–అప్ మునుపెన్నడూ చూడని మంచి అనుభూతిని అందిస్తుంది. ఉత్తరాది వారు నగరంలో ఎంతో మంది ఉన్నారు. నార్త్ వంటకాలను ఇష్టపడే నగరవాసులు కూడా ఉన్నారు.
– విజయ్ డేవిడ్ నిరంజన్, చెఫ్–ఆలివ్ బిస్ట్రో హైదరాబాద్.
కొత్త రుచులే.. నా హాబీ..
మన సిటీలో నార్త్ డిషెస్ తినడం గొప్ప అనుభూతి. సాధారణంగా కొత్త కొత్త రుచుల కోసం విభిన్న ప్రాంతాలకు వెళ్తుంటాను. నా హాబీలో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల వంటకాలను రుచి చూశాను. ఐతే.. నార్త్ వంటకాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. స్థానిక వంటకాలతో పాటు వాటికి మోడ్రన్ హంగులను అద్దుతారు. ఈ ఫెస్ట్‌లో హిమాలయన్ చీజ్ జామూన్ భలే రుచిగా ఉంది. ఈ కొండ పైనుంచి దుర్గం చెరువు అందాలను తిలకిస్తూ తినడం మరచిపోలేని అనుభూతి.
– కృతిక సనైన, జూబ్లిహిల్స్
వావ్ హైదరాబాద్..
హైదరాబాద్‌ను సందర్శించాలనే చికాల కోరిక ఈ విధంగా నెరవేరింది. నా దృష్టిలో సౌత్‌ఫుడ్ ఆరోగ్యకరమైంది.. నార్త్ ఫుడ్ రుచికరమైంది. ఈ ఫెస్ట్‌లో భాగంగా ఉత్తరాది రుచులను నగరవాసులు బాగా ఆస్వాదిస్తున్నారు. కాఫీ, రమ్‌లో నానబెట్టిన స్పాంజ్–మాస్కార్పోన్ ట్రిఫిల్ కొత్త అనుభూతినిస్తుంది. యువతరం టిరామిసు పిక్నిక్ బాస్కెట్లను ఇష్టంగా ఆరగిస్తున్నారు. దక్షిణాది ఆహారప్రియుడిగా నేను కూడా ఓల్డ్‌సిటీ రుచులకు ముగ్దుడినైపోయా.. షాగౌస్ బిర్యానీ రుచి వావ్ అనిపించింది. దేశంలోనే కాదు గ్లోబల్ వేదికగా కూడా ఈ నగరం ఫుడ్ ప్యారడైస్ అని చెప్పొచ్చు. ఇక్కడి సంస్కృతి, వ్యక్తిత్వాలు, ఆదరణ మరే నగరానికి సాటి రాదు.
– ప్రఖ్యాత చెఫ్ ధృవ్ ఒబెరాయ్, ఆలివ్ బార్ అండ్ కిచెన్ న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment