నాకున్నదల్లా ఒక్కటే కసి. నేను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో బతకాలన్న కసి. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని.. అక్క చెల్లెమ్మలు, రైతన్నలు, విద్యార్థులకు మంచి జరగాలన్న కసి. అన్ని కులాల్లోని పేదలను ఆదుకోవాలన్న కసి. రాష్ట్రాన్ని దేశ శిఖరాగ్రాన నిలపాలన్న కసి.
– ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో నిర్వహించిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు ఆదివారంతో సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఓ సంచలనం సృష్టించి చరిత్రకెక్కింది. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తేవాలన్న సంకల్పంతో వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6వ తొలి అడుగు వేశారు. ప్రజల వద్దకు వెళ్లి స్వయంగా వారి కష్టాలు తెలుసుకుని కన్నీళ్లను తుడిచారు.
ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చి హామీలను మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పొందుపరచిన 98 శాతం హామీలను మూడున్నరేళ్లలోనే నెరవేర్చారు. కోట్లాది హృదయాలను స్పృశించిన ప్రజా సంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది.
134 అసెంబ్లీ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు.
పాదయాత్ర ఆద్యంతం జననేతను కలుసుకోని వర్గం అంటూ లేదు. ‘జయహో జగన్’ అంటూ తరలి వచ్చిన ప్రజానీకం తమ సాధక బాధకాలను తెలియచేసింది. పూలబాట పరచి అపూర్వ స్వాగతం పలికారు. నుదుట కుంకుమ దిద్దారు. నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, అనాధలు, ఉపాధి లేని యువత, విద్యార్థులు, రైతన్నలు పాదయాత్రలో భాగస్వాములయ్యారు.
జగన్ అనే నేను..
పాదయాత్రలో ‘వైఎస్ జగన్ అనే నేను..’ అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, భరోసాలే ‘వైఎస్ జగన్ అనే నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను..’ అని చెప్పే వరకు నడిపించాయి. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికారత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, నాడు – నేడు కార్యక్రమాల ద్వారా ఇంకా నడిపిస్తునే ఉన్నాయి.
2019 మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల వైఎస్సార్ సీపీ ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతల పింఛన్‌ను రూ.2,250కి పెంచుతూ సీఎం జగన్ తొలి సంతకం చేశారు.
మంత్రివర్గ కూర్పులో తనదైన శైలిని కనబరిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచలనం సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి చరిత్రను తిరగరాశారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఏకంగా 19 చట్టాలు చేశారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా..
మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన సీఎం జగన్ అందులో పేర్కొన్న ‘నవరత్నాల’ అమలును వడివడిగా చేపట్టారు. భారీ ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు.
అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశ బిల్లు రూపొందించి కేంద్రానికి పంపారు. దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచారు. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరగాలనే దృఢ సంకల్పంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు.
అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, అన్ని కులాలు రాజకీయంగా సమానంగా ఎదగాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తు కాగా కోవిడ్ కష్ట కాలంలోనూ నిర్విఘ్నంగా సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం మరోఎత్తు. ఒక వైపు గత సర్కారు రాష్ట్రాన్ని ఊహకు అందనంత అప్పుల్లో ముంచెత్తి ఖాళీ ఖజానా అప్పగించింది.
మరో వైపు ప్రపంచవాప్తంగా మహమ్మారి కరోనా కమ్మేసింది. అయినా సరే మొక్కవోని దీక్షతో ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్రానికి పునరుజ్జీవం కల్పించారు. సచివాలయ వ్యవస్థతో గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కళ్లెదుట ఆవిష్కరించారు.
నేడు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు, కేక్ కటింగ్‌లు
జననేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు నవంబర్ 6వతేదీతో ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆదివారం ఉదయం దివంగత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాలని, సర్వమత ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, కేక్ కటింగ్‌లు చేయాలని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం సూచించింది.
ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. పాదయాత్ర అనుభవాలనే మేనిఫెస్టోగా మలుచుకుని అధికారం చేపట్టిన రెండేళ్లలోనే 97 శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేశారని పేర్కొంది. నాటి పాదయాత్రను గుర్తు చేస్తూ నేటి జగనన్న పరిపాలనను వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment