సాక్షి, అమరావతి : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు నియమ, నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదన్నారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని తెలిపారు.
ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారన్నారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపు మాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్ ఉపవాస దీక్ష అని చెప్పారు. ఈ మేరకు శనివారం సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ శనివారం ట్వీట్ చేశారు.
రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. నెల రోజులపాటు అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2022
కాగా, దేశవ్యాప్తంగా నెలవంక కనబడటంతో ఆదివారం నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుందని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుత్తారీ తెలిపారు. హైదరాబాద్‌లోని మొజాంజాహీ మార్కెట్‌లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముస్లింలు ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించాలని సూచించారు
Comments
Please login to add a commentAdd a comment