AP CM YS Jagan Speech Highlights In Narsipatnam Public Meeting, Details Inside - Sakshi
Sakshi News home page

రాజకీయమంటే.. డైలాగులు, డ్రోన్‌ షాట్లా?: సీఎం జగన్‌

Published Fri, Dec 30 2022 1:17 PM | Last Updated on Sat, Dec 31 2022 7:06 AM

CM YS Jagan Speech In Narsipatnam Public Meeting - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ‘‘రాజకీయమంటే డ్రోన్‌ షాట్లు, డైలాగులు చెప్పడం కాదు.. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం! ప్రతి నిరుపేద కష్టాన్ని తీర్చి వారికి అండగా నిలవడం.. చంద్రబాబులా ప్రజలను వంచించేవారు రాజకీయ నాయకుడు కాదు..’’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు ఆయన మార్కు అభివృద్ధి పథకాన్ని ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.

గత పాలకుల నిరాదరణకు గురైన ఉత్తరాంధ్రలోని నర్సీపట్నం నియోజకవర్గం రూపు రేఖలు ఇప్పుడు ప్రజల ప్రభుత్వం చేపడుతున్న భారీ కార్యక్రమాలతో మార­నున్నాయని చెప్పారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం జోగినాథునిపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. విశాఖ విమానాశ్రయం నుంచి హెలి­కాప్టర్‌ ద్వారా బలిఘట్టం చేరుకున్న సీఎం జగన్‌ పార్టీ నేతలను కలిశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నర్సీపట్నం మీదుగా సభా స్థలికి చేరుకు­న్నారు. దారి పొడవునా సీఎం జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు.

సభాస్థలి వద్ద ఏలేరు–తాండవ కాలువల అనుసంధాన ప్రాజెక్టుల బ్లూప్రింట్స్‌ని సీఎం పరిశీలించారు. అనంతరం నర్సీపట్నంలో 52.15 ఎకరాల్లో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశాల, అనుబంధ నర్సింగ్‌ కళాశాల, మల్టీ స్పెషా­లిటీ ఆస్పత్రి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ.470 కోట్లతో ఏలేరు, తాండవ కాలువల అనుసంధానం, నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో రూ.16.60 కోట్లతో రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు.

నర్సీపట్నం రూపురేఖలు మారుస్తాం
నర్సీపట్నం అంటే ఏజెన్సీ ప్రాంతానికి గేట్‌వే. గత పాలకుల హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అనారోగ్య బాధితులు రెండు గంటలు ప్రయాణించి విశాఖ చేరుకుంటే కానీ వైద్యం అందించలేని దుస్థితిలో తల్లడిల్లుతున్నా పట్టించుకోలేదు. ఈ రోజు ఈ ప్రాంతం రూపురేఖలను మార్చబోయే కార్యక్రమాలు చేస్తున్నాం. దాదాపు రూ.986 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు నర్సీపట్నంలో మొదలుపెడుతున్నాం. రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం.  తద్వారా దాదాపు 150 మెడికల్‌ సీట్లు ఇక్కడ రానున్నాయి. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీని ఏర్పాటు చేస్తున్నాం.

మూడున్నరేళ్లలో ఎంతో అభివృద్ధి
నర్సీపట్నంలో ఒక మెడికల్‌ కాలేజీ, పార్వతీపురంలో ఒక మెడికల్‌ కాలేజీ, పాడేరులో మరో వైద్య కళాశాల, విజయనగరంలో ఇంకోటి.. ఇవన్నీ కేవలం ఈ మూడున్నరేళ్లలో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అడుగులు పడు­తున్నాయి.  ఒక ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, వచ్చే నెలలో ఈ ప్రాంతంలోనే గిరిజన విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం.  

రైతుల కన్నీళ్లు తుడిచేందుకే..
తాండవ రిజర్వాయరు కింది 51,465 ఎకరాల ఆయకట్టుని పూర్తిగా స్ధిరీకరించడంతో పాటు ఏలేరు ఎడమ ప్రధాన కాలువ కింద కొత్తగా మరో లిఫ్ట్‌ ఏర్పాటు చేసి మరో 5,600 ఎకరాలకు నీరు అందించే కార్యక్రమం చేపడుతున్నాం. ఏలేరు, తాండవ రిజర్వాయర్లని అనుసంధానం చేస్తున్న కాలువ అభివృద్ధికి మరో 6 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఇలా దాదాపు రూ. 470 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తైంది. పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, తుని మండలాలతో పాటు అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, నాతవరం, కోటవురట్ల మండలాల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు టెండర్లతో పాటు అగ్రిమెంట్‌పై సంతకాలు కూడా పూర్తయ్యాయి. శరవేగంగా పనులు మొదలయ్యేలా సర్వే కూడా పూర్తి కావచ్చింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైతన్నల కలను మనందరి ప్రభుత్వం నెరవేరుస్తోంది.

మీ కష్టాలు పాదయాత్రలో చూశా..
ఇవాళ నర్సీపట్నం మున్సిపాల్టీలో రూ.16.60 కోట్లతో ప్రధాన రహదారిని విస్తరించడంతో పాటు మరో రహదారిని అభివృద్ధి చేస్తూ సెంట్రల్‌ లైటింగ్, గ్రీనరీ లాంటి పనులు చేపడుతున్నాం. ఒకవైపు మెడికల్‌ కాలేజీ, టీచింగ్‌ హాస్పిటల్, నర్సింగ్‌ కాలేజీ మరోవైపు పట్టణంలో ప్రధాన రహదారులన్నీ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే నర్సీపట్నం రూపురేఖలు పూర్తిగా మారతాయి. తాండవ, ఏలేరు రిజర్వాయరు కాలు­వల అనుసంధానం కూడా పూర్తయితే ఆయకట్టు స్ధిరీకరణ, విస్తరణ గణనీయంగా పెరిగి ఈ రెండు జిల్లాల్లో రైతుల ముఖంలో చిరునవ్వులు కనిపి­స్తాయి. మీ కష్టాలన్నీ నా పాదయాత్రలో చూశా. 

ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగరేసేలా..
మీ జగనన్న ప్రభుత్వంలో చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం. ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటా. జగన్‌ గురించి ఎవరైనా కార్యకర్తను అడిగితే సగర్వంగా కాలర్‌ ఎగరేసుకుని ఫలానా వాడు మా నాయకుడు అని చెప్పుకునే విధంగానే మీ అన్న పరిపాలన చేస్తాడు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా మీ అన్న బతుకుతాడు. 

మంచి చేస్తున్నా.. బురద చల్లుడే
రాష్ట్రంలో ఇవాళ ఒక చెడిపోయిన వ్యవçస్థ్ధతో మనందరికీ యుద్ధం జరుగుతోంది. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. నిత్యం ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా పని చేస్తున్నాయి. మనం ఎంత మంచి చేస్తున్నా కూడా అందులో వారికి చెడే కనిపిస్తోంది.

పెంచేదే.. తగ్గించేదేలే
జనవరి 1వతేదీ నుంచి ప్రతి అవ్వాతాత మొహంలో చిరునవ్వులు చూసేలా సామాజిక పెన్షన్‌ని రూ.2750కి పెంచి ఇవ్వబోతున్నాం. దీన్ని చూసి దుష్ట చతుష్టయంలో ఓర్వలేనితనం కనిపిస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు వీళ్లంతా మాట ప్రకారం పెన్షన్‌  పెంచుతూ చేపట్టిన గొప్ప కార్యక్రమంపైనా అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. ఆర్నెల్లకు ఒకసారి జూన్‌ , డిసెంబర్‌లో సాధారణ ఆడిట్‌లో భాగంగా పారదర్శకంగా జరిగే వెరిఫికేషన్‌ కార్యక్రమంపై కూడా ఎన్నెన్నో అబద్ధాలు సృష్టించి ఎంత అల్లకల్లోలం చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు.

గతంలో ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు హయాంలో 2018 అక్టోబరు వరకు అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. మీ జగన్‌ ప్రభుత్వంలో ఇవాళ అక్షరాలా 62.30 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. మీ జగన్‌ మనసు ఎలాంటిదంటే రేపు జనవరి 1 తరువాత ఈ 62.30 లక్షల పెన్షన్లు పెరిగేవే కానీ తగ్గేవి కాదన్న సంగతి అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో పెన్షన్‌ బిల్లు నెలకు రూ.400 కోట్లు అయితే ఇవాళ మన ప్రభుత్వంలో నెలకు రూ.1,700 కోట్లకు పైగా ఉంది. తేడా ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా ఎల్లో మీడియా ఎలా అల్లకల్లోలం చేస్తోందో చూడండి.

డైరెక్టర్‌ బాబు.. యాక్టర్‌ దత్తపుత్రుడు 
చంద్రబాబు పాలనలో ఒక్కటంటే ఒక్క మంచైనా చేసినట్లు చెప్పుకోడానికి ఆధారాలున్నాయా? ఇలాంటి దత్తతండ్రిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతు­న్నాడో దత్తపుత్రుడు. వీరిద్దరి స్టైల్‌ ఒక్కటే. అదేమి­టంటే.. ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం... ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు... ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్య.. ఇదీ వీరిద్దరి స్టైల్‌! వీరి స్వభావం చూస్తే ఎవరికైనా ఇదేం ఖర్మరా మన రాష్ట్రానికి? ఇదేం ఖర్మ మన రాజకీ­యాలకు? అని అనిపిస్తుంది. ఒకాయన రాజకీయాల్లో వచ్చి 14 ఏళ్లైనా ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. రెండు చోట్లా ప్రజలు ఆయన్ను ఓడించారు.

ఆయనకు నిర్మాత, దర్శకుడు బాబు. ఎప్పుడు షూటింగ్‌ అంటే అప్పుడు కాల్‌షీట్స్‌ ఇస్తాడు. ఎక్కడ షూటింగ్‌ అంటే అక్కడకు వస్తాడు. బాబు స్క్రిప్ట్‌ ఇస్తాడు. బాబుకు అనుకూ­లంగా, బాబు చెప్పిన డైలాగులన్నీ యాక్ట్‌ చేసి చూపిస్తాడు. ఇదీ ఈయన స్టైల్‌. ఇక మరో వ్యక్తి  రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు. ఆ మనిషి రాష్ట్రంలో ఏ మంచి జరిగినా అది తానే చేశానని, తనవల్లే జరిగిందని అంటాడు. చివరికి సింధు బ్యాడ్మింటన్‌లో గెలిచినా కూడా ఆమెకు ఆడటం తానే నేర్పించానంటాడు. ఈ పెద్దమనిషి సొంత నియోజకవర్గం కుప్పంలో నీళ్లుండవు. కుప్పంలో రెవెన్యూ డివిజన్‌ మనం అధికారంలోకి వచ్చాక ఇచ్చాం. ఈ 73 ఏళ్ల ముసలాయన్ను చూస్తే అందరికీ రెండే రెండు స్కీంలు గుర్తుకొస్తాయి. ఒకటి వెన్నుపోటు... రెండోది మోసాలు.

నీ సభలకు ఎందుకొస్తారు?
ఈ మోసాల బాబు సభలకు జనం వచ్చారని చూపించేందుకు ఎల్లో మీడియా, దుష్టచతుష్ట­యం నానా తంటాలు పడుతున్నాయి. ప్రతి వర్గాన్ని వంచించిన ఆ బాబు సభలకు అసలు ఎందుకొస్తారనేది ఒక్కసారి ఆలోచన చేయండి.

రూ.87,612 కోట్ల రుణమాఫీ చేస్తానని నమ్మబలికి, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి చివరికి నిండా మోసం చేసినందుకు థాంక్యూ.. థాంక్యూ బాబూ.. అని రైతులేమైనా ఆయన సభకు వస్తారా?

రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, వడ్డీలు కూడా కట్టొద్దని నిలువునా మోసగించి పొదుపు సంఘాలన్నింటినీ సర్వనాశనం చేసినందుకు ఆ అక్కచెల్లెమ్మ­లంతా  థాంక్యూ.. థాంక్యూ బాబూ అని ఆయన సభలకు వస్తారా? 

ప్రత్యేక హోదాను తన ప్రత్యేక ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టినందుకు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానంటూ ఎగ్గొట్టినందుకు నిరుద్యోగులంతా థాంక్యూ.. థాంక్యూ బాబూ అని చెప్పడానికేమైనా ఆయన సభలకు వస్తారా? 

 ఓ ఊరిలో పదివేల మంది ఉంటే కేవలం పదిమందికి మాత్రమే విదిల్చి అది కూడా లంచాలు తీసుకుంటూ జన్మభూమి కమిటీలతో నరకం చూపినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు థాంక్యూ థాంక్యూ బాబూ అంటూ ఆయన సభలకు వస్తారా? 

కేజీ నుంచి పీజీ వరకు పూర్తి ఉచితంగా చదువులు చెప్పిస్తానంటూ ఎన్నికల వాగ్దానాలు చేసి చివరకు పిల్లలను కూడా మోసగించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అనే గొప్ప పథకాన్ని నీరుగార్చినందుకు థాంక్యూ థాంక్యూ బాబూ అంటూ వస్తారా? 

దత్తపుత్రా.. ఈ పాపంలో నీక్కూడా వాటా ఉంది కాబట్టి నీక్కూడా థాంక్యూ థాంక్యూ అని చెప్పడానికి ఎవరైనా వస్తారా? 

వీరి సభలకు ఎవరైనా ఎందుకొస్తారు ? ఈ దుర్మార్గులను, వంచకుల్ని చూడడానికా? ఏదైనా ఘనకార్యం చేస్తే అధికారం నుంచి ఎందుకు దించేశారు? నిజంగానే వీళ్లు మంచి చేసి ఉంటే ఆయన కుమారుడిని, దత్తపుత్రుడుని ప్రజలు ఎందుకు ఓడించారు? 

దుష్టచతుష్టయం రామోజీ, రాధాకృష్ణ, టీవీ 5, దత్తపుత్రుడికి బాబు అమలు చేసిన డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) పథకం చాలా బాగుందని థాంక్యూ చెప్పడానికి వస్తారా?  

రాజకీయమంటే..?
రాజకీయ­మంటే షూటింగ్‌లు, డైలాగులు, డ్రోన్ల షాట్లు కాదు.. డ్రామాలు అంతకన్నా కాదు. ఒక రైతు కుటుంబంలో, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబంలో ఎలాంటి మంచి మార్పు తేగలిగామన్నదే రాజకీయమని వీళ్లందరికీ అర్థం కావాలి.  

ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖల్ని మార్చడం,   ప్రతి గ్రామంలోనూ రైతన్నల చేయిపట్టుకుని నడిపిస్తూ వ్యవసాయం రూపురేఖలను మార్చడమే రాజకీయం. లంచాలు, వివక్షకు తావులేకుండా పౌర సేవలను ప్రతి గ్రామంలో ఆత్మగౌరవంతో అందించడం..  రాజకీయ­మంటే ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి çస్థలాన్ని ఇవ్వడంతో పాటు ఇళ్లను కూడా కట్టించి ఇచ్చి వారి గుండెల్లో చోటు సంపాదించడం. అమరావతితో పాటు అన్ని ప్రాంతాల గురించి ఆలోచించడం రాజకీయం.

రాజకీయం అంటే ఒక మాటిస్తే దాని మీద నిలబడటం అనేది వీళ్లందరికీ అర్థం కావాలి. అన్ని ప్రాంతాలు, అన్ని కుటుంబాల గురించి ఆలోచన చేస్తే దాన్ని రాజకీయం అంటారు. అటు అమరావతితో పాటు ఉత్తరాంధ్రను, రాయలసీమను చూసుకుంటూ వారందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే అసలైన రాజకీయం. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు సేవకుడు.

చంద్రబాబు మాదిరిగా ప్రజలపై అధికారాన్ని చలాయించడం కాదు. బీసీలు వారి సమస్యలు గురించి చెప్పడానికి వెళితే నాడు వారి తోకలు కత్తిరిస్తానన్నారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా? అని హేళన చేశారు. రాజకీయమంటే అది కాదు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజా సేవకులే అన్నది రాజకీయం.

మేనిఫెస్టోలో చెప్పిన 98.4 శాతం హామీలను నెరవేర్చాం కాబట్టే వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో సగర్వంగా ప్రతి గడప వద్దకు వెళ్లి ఆశీర్వదించాలని అడుగుతుండటం రాజకీయం.

సీఎం సభ సూపర్‌ సక్సెస్‌
నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఊహించిన దాని కంటే ఎక్కువగా తండోపతండాలుగా తరలివచ్చిన జనసందోహంతో సభాప్రాంగణం లోపల, బయటా కిటకిటలాడింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు చోడవరం, పాయకరావుపేట, మాడుగుల, అనకాపల్లి, తుని నియోజకవర్గంలోని మరికొన్ని మండలాల నుంచి రైతులు, మహిళలు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

భారీగా తరలివచ్చిన జనాలు ప్రధాన కూడళ్లలో బారులు తీరారు. ఇక నర్సీపట్నం ఎటు చూసినా జనసంద్రంగా కనిపించింది. మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం నుంచి జోగునాథునిపాలెంలోని సభా ప్రాంగణం వరకు 4.5 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో వైఎస్‌ జగన్‌కు పూలజల్లులతో జనం నీరాజనం పలికారు. చిన్నారుల నృత్యాలతో, గిరిజన థింసా నృత్యాలతో, డప్పులతో సీఎంకి ఘనంగా స్వాగతం పలికారు. మరోవైపు.. హెలిపాడ్‌ వద్ద సీఎం గంటన్నర పాటు పార్టీ శ్రేణులతో కరచాలనం చేసి, ఆత్మీయంగా పలకరించారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement