సాక్షి, అమరావతి: ప్రపంచ పునరుత్పాదక ఇంధన రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు మరోసారి రుజువు చేశాయి. ముఖ్యంగా మన దేశ సోలార్ ఫోటోవోల్టాయిక్ (పీవీ)లో ఉద్యోగాలు, ఉపాధి సంఖ్య అనేక అభివృద్ధి చెందిన దేశాలను అధిగవిుంచిందని అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఆర్‌ఈఎన్‌ఏ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) సంయుక్త నివేదిక తాజాగా వెల్లడించింది. గ్లోబల్‌గా 2022లో 4.9 మిలియన్ల మందికి ఉద్యోగాలు లభించాయి. దీంతో మొత్తం ఉద్యోగాలు 13.7 మిలియన్లకు చేరుకున్నాయి.
మన దేశంలో గతేడాది ఆన్–గ్రిడ్ సోలార్‌లో 2,01,400 ఉద్యోగాలు, ఆఫ్–గ్రిడ్‌లో 80,000 ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం కొలువుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలున్నారు. ఒక్క చైనా మినహా మిగతా ప్రపంచ దేశాలన్నిటి కంటే మన దేశమే ఈ విషయంలో పురోగమనంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్‌ఏ) గతేడాది 2,64,000 మందికి ఉద్యోగాలిచ్చి మనదేశంతో పోల్చితే కాస్త వెనుకబడే ఉంది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు 5,17,000 ఉద్యోగాలిచ్చాయి. బ్రెజిల్‌లో ఉద్యోగాల సంఖ్య 2,41,000కి చేరుకుంది. జపాన్ మాత్రం ఈ రంగంలో కేవలం 1,27,000 ఉద్యోగాలతో వెనుకబడి ఉంది.
పెరగనున్న ఉపాధి..
8025 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు ఇప్పటికే,ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయించడం జరిగింది. గ్రీన్కో గ్రూప్ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్ విద్యుత్‌కు సంబంధించి సైట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి పునాది పనులు పురోగతిలో ఉన్నాయి.
నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. వీటి ద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మరో రెండు వేల మందికి ఎన్‌హెచ్‌పీసీతో కలిసి ఏపీ జెన్‌కో నెలకొల్పనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల వల్ల లభించనున్నాయి. తద్వారా దేశంలోనే పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఇతర రాష్ట్రాలకంటే ముందుంటూ ఏపీ వాటికి ఆదర్శంగా నిలుస్తోంది.
ముందే మేల్కొన్న ఏపీ..
దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న విద్యుత్ వినియోగం 2032 నాటికి 70 శాతం పెరుగుతుందని జాతీయస్థాయిలో అంచనా. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవాలి్సన ఆవశ్యకతను ముందుగానే గ్రహించింది ఏపీ ప్రభుత్వం. ఆ క్రమంలోనే విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుల స్థాపనకు భారీగా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పరిశ్రమల రాకతో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు బాటలు వేసింది.
ఏపీ విధానాలు నచ్చి ఏపీ ఇంధన రంగంలో రూ.9,57,1839 కోట్ల పెట్టుబడులతో 42 ప్రాజెక్టులు నెలకొల్పి 1,80,918 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజాలు జతకలిశాయి. రాష్ట్రంలో 4,552.12 మెగావాట్ల సంచిత సౌర విద్యుత్ సామర్థ్యంతో, 2022–23లో 8,140.72 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ తాజాగా ప్రకటించింది. భారీ ఒప్పందాల కారణంగా రానున్న రోజుల్లో ఏపీలో ఇది మరింతగా వృద్ధి చెందనుంది.
Comments
Please login to add a commentAdd a comment