పోలవరం నిర్వాసితుల భూమిలో మిగులు భూమిని మింగేస్తున్న అధికారులు
గతంలో 43 ఎకరాల 33 సెంట్ల మిగులు భూమి ఉన్నట్లు వెల్లడి
2023 నవంబర్‌లో 18.52 ఎకరాలే మిగులుగా రికార్డులు
తాజాగా 8 ఎకరాలకు తగ్గిపోయిన మిగులు భూమి
35 ఎకరాలు అధికారుల బినామీలకు ధారాదత్తం
ఫోర్జరీ సంతకాలతో నకిలీ హక్కు పత్రాల సృష్టి
ప్రొసీడింగ్స్, అలాట్‌మెంట్ లేకుండానే ప్రభుత్వ భూముల పంపకం
నిజమైన పోలవరం నిర్వాసితులకు మొండిచేయి
అవార్డులో పేరులేని వారికి కట్టబెడుతున్న వైనం
వేలేరుపాడు: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో ఓ రాజకీయ పార్టీ నేతతో కుమ్మక్కైన కొందరు రెవెన్యూ అధికారులు పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన భూముల్లో మిగులు భూములను పంచేసుకుంటున్నారు. నిజమైన నిర్వాసితులకు భూములివ్వడానికి విపరీతమైన జాప్యం చేస్తున్న అధికారులు.. మిగులు భూములకు బినామీ పేర్లతో నకిలీ హక్కు పత్రాలు సృష్టించి చిటికెలో మాయం చేసేస్తున్నారు.
పోలవరం ముంపు మండలమైన వేలేరుపాడు మండలంలోని తాట్కూరుగొమ్ము, తిర్లాపురం, నార్లవరం, రుద్రమకోట గ్రామాలకు చెందిన కొందరు నిర్వాసితులకు జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో 596.73 ఎకరాల భూమికి పీఎన్ (ప్లిమినరీ నోటిఫికేషన్), తర్వాత డీడీ (డ్రాఫ్ట్ డిక్లరేషన్) ఇచ్చారు.
నిర్వాసితుల కోసం భూములు కొన్నారు. ప్రస్తుత అవార్డులో మాత్రం 525 ఎకరాల 12 సెంట్లు మాత్రమే అధికారులు చూపిస్తున్నారు. అవార్డుకు, డీడీకు మధ్య 71 ఎకరాల 61 సెంట్ల తేడా ఉంది. ఇంత తేడా ఎలా వచ్చి oదో ఇంతవరకు తేలలేదు. మరోపక్క స్వర్ణవారిగూడెం గ్రామంలోని మిగులు భూములు క్రమంగా తరిగిపోతున్నాయి. అప్పట్లో ఇక్కడ 43 ఎకరాల 33 సెంట్లు మిగులు భూమిగా చూపించారు. 2023 నవంబర్ 20న అప్పటి జీలుగుమిల్లి తహసీల్దార్ 18.52 ఎకరాల మిగులు భూమి ఉన్నట్టు సర్వే నంబర్లతో సహా చూపారు.
ప్రస్తుతం ఇక్కడ 8 ఎకరాలు మాత్రమే మిగులు భూమి ఉన్నట్టు చూపిస్తున్నారు. అంటే సుమారు 35 ఎకరాలు అన్యాక్రాంతమైపోయింది. ఈ భూముల్లో నిర్వాసితులు కాని పలువురు సాగు చేసుకుంటుండటం గమనార్హం. 2023 నవంబర్ నుంచి ఇప్పటివరకూ ఆర్ అండ్ ఆర్ అధికారి అయిన కేఆర్‌పురం ఐటీడీఏ పీవో ఎవరికీ మిగులు భూమి ఉన్న సర్వే నంబర్లపై ప్రొసీడింగ్స్ జారీ చేయలేదు. అలాట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.
అయినా కొందరు అధికారులు ఫోర్జరీ సంతకాలతో నకిలీ హక్కు పత్రాలు తయారుచేసి ఆయిల్‌పామ్ తోటలున్న ఈ భూములను విక్రయిస్తున్నారు. వీరిలో స్వర్ణవారిగూడెం వీఆర్‌ఏ, వీఆర్‌వో, స్థానిక రెవెన్యూ అధికారులు కొందరు కుమ్మక్కై ఈ భూములు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాత అవార్డులో పేరు లేకుండానే, పోలవరం ముంపు ప్రాంతంలో సెంటు భూమి లేని వారికి కూడా భూములు కట్టబెడుతున్నారు.
నిజమైన నిర్వాసితులకు తీరని అన్యాయం
మిగులు భూములుగా ఉన్న ఆయిల్‌పామ్ తోటలను రెవెన్యూ అధికారులు నకిలీ హక్కు పత్రాలతో కాజేస్తున్నారు. నిజమైన గిరిజన నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారు. అసలు అవార్డులో పేరు, ఆర్ అండ్ ఆర్ అధికారి ప్రొసీడింగ్స్ లేకుండా సెంటు భూమి లేని వారికి ఎలా భూములు ఇస్తున్నారు? – గుజ్జా రామలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు, వేలేరుపాడు
ఆయిల్‌పామ్ తోటలను ఆక్రమించుకుంటున్నారు
నిజమైన నిర్వాసితుల కోసం కేటాయించిన భూములు ఈ రోజు చూస్తే, రేపటికి అధికారులు మాయం చేస్తున్నారు. విలువైన ఆయిల్‌పామ్ తోటలను దొంగ సరి్టఫికెట్లతో ఆక్రమించుకుంటున్నారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా మిన్నకుంటున్నారు. నిజమైన నిర్వాసితులు భూముల కోసం కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు మాత్రం చకచకా భూములు అప్పగిస్తున్నారు. –కారం దారయ్య, రాష్ట్ర గిరిజన సమాఖ్య అధ్యక్షుడు
కాజేస్తున్నారిలా..
స్వర్ణవారిగూడెంలో 33/1 సర్వే నంబర్‌లో 4 ఎకరాలు, 33/2 సర్వే నంబర్‌లో 0.62 ఎకరాల మిగులు భూమిని గత ఏడాది వేలేరుపాడు మండలం కన్నాయిగుట్టకు చెందిన కారం లక్ష్మయ్యకు మండల సర్వేయర్, వీఆర్వో, వీఆర్‌ఏ చూపించారు. అయితే ఆ తర్వాత వీఆర్వో, వీఆర్‌ఏ, స్థానిక ఓ గిరిజనేతరుడు కుమ్మక్కై ఆ భూమికి ఫోర్జరీ సంతకాలతో నకిలీ హక్కు పత్రం సృష్టించారు. ఎలాంటి అలాట్‌మెంట్, ప్రొసీడింగ్ లేకుండానే ఓ గిరిజనేతరుడు రెవెన్యూ అధికారుల అండదండలతో ఆయిల్‌పామ్ తోటను ఇటీవల ధ్వంసం చేశాడు. ఈ పొలాన్ని దున్నించి బహిరంగంగానే సాగు చేస్తున్నాడు. కారం లక్ష్మయ్యకు మాత్రం భూమి ఇవ్వలేదు.
వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము రెవెన్యూలో మెట్టం వెంకయ్య పేరున ఎక్కడా సెంటు భూమి లేదు. అవార్డులో కూడా పేరు లేదు. అయినా స్వర్ణవారిగూడెంలో నకిలీ హక్కు పత్రంతో 166–4ఎ సర్వే నంబర్‌లో 0.73 సెంట్లు, 200–3ఎ సర్వే నంబర్‌లో 3.35 ఎకరాలు అప్పగించారు. ఇలాంటి నకిలీల పేర్లు ఇక్కడ చాలానే కనిపిస్తున్నాయి. తాట్కూరుగొమ్ము రెవెన్యూలో నాగులగూడేనికి చెందిన ఓ గిరిజనుడికి సెంటు భూమి లేదు.
వాస్తవంగా అతనికి చిగురుమామిడి రెవెన్యూలో ఎకరా భూమి ఉండగా లాండ్ టు లాండ్ కింద బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెంలో భూమి అప్పగించారు. ఇటీవల అతనికి స్వర్ణవారిగూడెంలో 6.25 ఎకరాలు, అతని మనుమడికి మరో 6.25 ఎకరాలు.. మొత్తం 12.50 ఎకరాలు కట్టబెట్టేశారు. ఈ భూమిలో సగం వాటా రెవెన్యూ అధికారులదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment