సాక్షి, అమరావతి: ‘రైతులకు సాంకేతికతను చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కృషి బాగుంది. మీ ఆలోచన విధానాలు ప్రపంచానికే ఆదర్శం. మాది వ్యవసాయాధారిత దేశం. మీ విధానాలు, సాంకేతికత అందిపుచ్చుకోవాలని ఆశిస్తున్నాం. అందుకు తగిన సహకారం అందించండి’ అని ఇథియోపియా దేశ ప్రతినిధి బృందం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐదు రోజుల పర్యటన కోసం సోమవారం రాష్ట్రానికి విచ్చేసిన ఇథియోపియా బృందానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ స్వాగతం పలికారు. అనంతరం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం(ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్), ఆర్బీకే చానల్ స్టూడియోలను ఇథియోపియా బృందం సందర్శించింది. ఆర్బీకేలు, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వల్లూరు శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు.
ఆర్బీకే యూట్యూబ్ చానల్ స్టూడియోలో శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వివిధ పంటల సాగులో అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు తెగుళ్లు, పురుగుల నివారణకు వ్యవసాయ విశ్వవిద్యాలయ, వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తల సూచనలతో రూపొందిస్తున్న వీడియోలను వారు పరిశీలించారు. రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేస్తున్న తీరును పరిశీలించడంతో పాటు ఆర్బీకేల ద్వారా అందిస్తున్న రైతు భరోసా సచిత్ర మాస పత్రిక గురించి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ కృషిని ఇథియోపియా బృందం ప్రశంసించింది. తమ దేశంలోనూ రైతులకు ఈ తరహా విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేసింది. బృందంలో ప్రపంచ బ్యాంకు సలహాదారు హిమ్మత్ పటేల్, ఇథియోపియా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు డా.ఆదిషు బెజ్ బెహ్ అలి, అన్ దువాలేమ్, అబ్రహాం టేస్ పాయె, ఆరెగా సేమెగా, ఎల్ షాడే బెలేటే తదితరులున్నారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, గన్నవరం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అధికారి వై.అనురాధ తదితరులు పాల్గొన్నారు.
నేడు గొల్లపూడి ఆర్బీకే సందర్శన
ఇథియోపియా ప్రతినిధి బృందం మంగళవారం గొల్లపూడి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించనుంది. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించి.. సంబంధిత సిబ్బంది, రైతులతో మాట్లాడనుంది. అనంతరం సమీప గ్రామాల్లో పర్యటిస్తుంది.
బీమా కవరేజ్‌లో ఏపీ అద్భుతం
సాక్షి, అమరావతి: కేంద్రం నోటిఫై చేసిన పంటలకు రైతులపై పైసా భారం పడకుండా.. సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర వ్యవసాయ కుటుంబ, సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) సీఈవో, నాఫెడ్ ఎండీ రితీశ్ చౌహాన్ ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం ఆయన అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ పరిధిలోని దొడ్డిపల్లి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఆర్బీకే ద్వారా అందిస్తోన్న సేవలను పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు. ఈ–క్రాప్ నమోదు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు తీరుపై ఆరా తీశారు. ఈ–క్రాప్ నమోదుకు సంబంధించిన రశీదులను పరిశీలించి, ఎలా నమోదు చేస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గతంలో సాగు చేసిన పంటలకు కేంద్రం నిర్దేశించిన ప్రీమియం చెల్లించిన వారికే పరిహారం దక్కేదని రైతులు ఆయనకు తెలిపారు. అయితే తమ రాష్ట్రంలో ప్రస్తుతం నోటిఫై చేసిన ప్రతి పంటకు, ప్రతి ఎకరాకు బీమా సదుపాయం లభిస్తోందని చౌహాన్‌కు వివరించారు. దీంతో ఈ తరహా యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పించడం నిజంగా అద్భుతమని ఆయన కొనియాడారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకొని ఫసల్ బీమా యోజన నిబంధనల్లో పలు మార్పులు చేశామన్నారు. ఖరీఫ్–22 సీజన్ నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకంతో పీఎంఎఫ్‌బీవైను అనుసంధానం చేసి అమలు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment