‘హాథీరాం బావాజీ’ ప్రాంగణంలో బీభత్సం | Demolition of temple buildings in the dark | Sakshi
Sakshi News home page

‘హాథీరాం బావాజీ’ ప్రాంగణంలో బీభత్సం

Published Fri, Sep 6 2024 5:21 AM | Last Updated on Fri, Sep 6 2024 5:21 AM

Demolition of temple buildings in the dark

చీకట్లో ఆలయ కట్టడాలు కూల్చివేత 

తిరగబడిన బంజార జాతి ప్రజలు 

బంజార సేవా సంఘ నాయకుడి అక్రమ అరెస్టు 

అవన్నీ అక్రమ నిర్మాణాలు.. హాథీరాంజీ మఠం ఏఏఓ

తిరుపతి రూరల్‌: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామితో పాచికలు ఆడిన హాథీరాం బావాజీకి ప్రపంచంలోనే ప్రప్ర­థ­మంగా తిరుపతిలో నిర్మిస్తున్న ఆలయం ప్రాంగణంలో గురువారం తెల్లవారుజామున మఠం అధికారులు బీభత్సం సృష్టించారు. చీకట్లో జేసీబీలతో వచ్చి ఆలయానికి చెందిన కట్టడాలను ధ్వంసం చేశారు. కూల్చివేతలను అడ్డుకొనకుండా ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం నాయ­కుడు శివనాయక్‌ను బుధవారం అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. 

ఆ తర్వాత కాసేపటికే కూల్చివేతలు ప్రారంభించారు. మఠం ఏఏఓ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మఠం సిబ్బంది పోలీసులతో వచ్చి బావాజీ ఆలయం ప్రాంగణంలోని వసతి సముదాయం, విజ్ఞాన మందిరం, పోటు, పూజా సామగ్రి గదులను కూల్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, బంజారా జాతి ప్రజలు ఈ కూల్చివేతలను అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కోర్టు ఇంజెంక్షన్‌ ఆర్డర్‌ ఉన్నా ఆస్తులను ఎలా ధ్వంసం చేస్తారని నిలదీశారు. అయినా మఠం సిబ్బంది దౌర్జన్యంగా నిర్మాణాలను కూల్చేశారు. 

బంజారాలు పూజించే హా«థీరాం బావాజీకి ఇప్పటివరకు ఆలయం లేదు. దీంతో ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు శివనాయక్‌ ఆలయ ధర్మకర్తగా బంజారా జాతి ప్రజలు ఆలయం నిర్మాణానికి పూనుకొన్నారు. తిరుపతికి సమీపంలోని వేదాంతపురం పంచాయతీ పరిధిలో హాథీరాంజీ మఠం భూముల్లో ప్రపంచంలోనే ప్రప్రథమంగా బావాజీ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బంజారా జాతి ప్రముఖులు సొంత నిధులతో ఈ ఆలయాన్ని, వసతి గృహాలను నిర్మిస్తున్నారు. 

బంజారాల విజ్ఞప్తి మేరకు గతంలో హాథీరాంజీ మఠం మహంతుగా పనిచేసిన అర్జునదాస్‌ కేటాయించిన భూమిలోనే ఆలయాన్ని నిర్మిస్తున్నామని, అవినీతికి సహకరించలేదనే కక్షతో కొందరు మఠం అధికారులు ఆలయాన్ని, వసతి గృహాలను తొలగించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నట్లు గతంలో పలుమార్లు తెలిపారు. అధికారుల బెదిరింపులతో కోర్టుకు వెళ్లి ఇంజెంక్షన్‌ ఆర్డర్‌ పొందినట్లు తెలిపారు.

అయితే, అవన్నీ అక్రమ నిర్మాణాలని మఠం ఏఏఓ శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. మఠం భూములకు, శివనాయక్‌కు సంబంధం లేదన్నారు. ఆలయం పేరుతో మఠం భూములను కబ్జా చేస్తున్నందునే అక్రమ నిర్మాణాలన్నింటినీ దేవదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలతో కలిసి తొలగించామని చెప్పారు. 

ఆలయాన్ని నిర్మించడమే తప్పా 
వేల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా హాథీరాంజీ మఠం అధికారులు హాథీరాం బావాజీకి ఇంత వరకు ఆలయాన్ని నిర్మించలేదు. బంజారాలు ఆరాధించే బావాజీకి ప్రపంచంలోనే ప్రప్రథమంగా తిరుపతిలో ఆలయాన్ని నిర్మించేందుకు బంజారా సేవా సంఘం పలుమార్లు మహంతు అర్జునదాస్‌కు విన్నవించాం. ఆయన స్థలం కేటాయించడంతో బంజారాలం అందరం చందాలు వేసుకుని మరీ ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పుడు కూల్చివేయడం అన్యాయం. అక్రమం. – శివనాయక్, ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement