ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు బ్రిటన్‌ బృందం ఆసక్తి | Deputy High Commissioner of Britain meets with CM Jagan | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు బ్రిటన్‌ బృందం ఆసక్తి

Published Wed, Aug 11 2021 2:51 AM | Last Updated on Wed, Aug 11 2021 2:51 AM

Deputy High Commissioner of Britain meets with CM Jagan - Sakshi

ఆండ్రూ ఫ్లెమింగ్‌కు జ్ఞాపిక అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్‌ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ను మంగళవారం క్యాంపు కార్యాలయంలో బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (ఏపీ, తెలంగాణ) డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్‌ ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి, పలువురు బృంద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆ బృందం సీఎం జగన్‌కు వివరించింది. అనంతరం డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సీఎం సత్కరించి జ్ఞాపిక అందజేశారు.  

సీఎస్‌తో సమావేశం
బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ను మర్యాదపూర్వంగా కలిశారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న వివిధ పథకాలు, ప్రాజెక్టుల వివరాలను సీఎస్‌ ఆయనకు వివరించారు. అలాగే, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకుగల అనువైన రంగాలు, ప్రాంతాల వివరాలను కూడా తెలియజేశారు. ఆ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు వచ్చేలా తగిన కృషిచేయాల్సిందిగా బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ను కోరారు. దీనిపై ఆండ్రూ ఫ్లెమింగ్‌ స్పందిస్తూ.. ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్‌కు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు సీఎస్‌కు వివరించారు. అంతకుముందు.. ఫ్లెమింగ్‌ను ఆదిత్యనాధ్‌ దాస్‌  శాలువ, జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, బ్రిటీష్‌ ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి, పలువురు యూకే డెలిగేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సేవలో ఫ్లెమింగ్‌ 
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) :ఆండ్రూ ఫ్లెమింగ్‌ మంగళవారం తన బృందంతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement