Andrew Fleming
-
ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఆర్థిక, వ్యవసాయ, ఆక్వా, పర్యాటక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ చెప్పారు. విశాఖలో మంగళవారం ఆండ్రూ ఫ్లెమింగ్, ముంబైలోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ దక్షిణాసియా కమిషనర్ అలన్ గెమ్మెల్ ఓబీఈ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్‌మాలి తదితరులతో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని మంత్రి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌ను కోరారు. దీనిపై ఫ్లెమింగ్ మాట్లాడుతూ ఏపీలో సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, ఇక్కడ పవన విద్యుత్ ఉత్పత్తికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు యూకేకు చెందిన కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో ఐటీ రంగానికి అనువైన అన్ని మౌలిక సదుపాయాలు, మానవవనరులు ఉన్నాయని చెప్పారు. అలన్ గెమ్మెల్ ఓబీఈ మాట్లాడుతూ మెరైన్, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. ఏపీ, బ్రిటిష్ ప్రభుత్వాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించేందుకు ఇక్కడ ఏపీతో కలిసి ష్రింప్ సమ్మిట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి నుంచి కె.రామేశ్వర్, అముక్తామెహర్ పాల్గొన్నారు. -
చెత్త.. వేస్ట్ కాదు వనరు!
సాక్షి, సిద్దిపేట: ప్రజల భాగస్వామ్యం, పారిశుధ్య కార్మికుల పనితనంతో స్వచ్ఛతలో సిద్దిపేట దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన బయో–సీఎన్జీ ప్లాంట్‌ను సోమవారం ఆయన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో కలసి ప్రారంభించారు. తడి చెత్తతో ఈ ప్లాంట్‌లో బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. రాష్ట్రంలో ఈ తరహా ప్లాంట్ ఇదే మొదటిది కావడం గమనార్హం. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బయో–సీఎన్జీ ప్లాంట్ ఏర్పాటుకు బలం, బలగం సిద్దిపేట పుర ప్రజలేనని పేర్కొన్నారు. భారీగా పోగవుతున్న చెత్త కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోందని, భూమి, నీరు కలుషితం అవుతున్నాయని అన్నారు. సిద్దిపేట పట్టణంలో రోజుకు 55 వేల కిలోల చెత్త పోగవుతోందని, అయితే సమర్థ నిర్వహణ పద్ధతుల ద్వారా ప్రజల భాగస్వామ్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల కృషితో సిద్దిపేట స్వచ్ఛ పట్టణంగా రూపుదిద్దుకుందని వివరించారు. తాము చెత్తను ఆదాయ వనరుగా మార్చామన్నారు. బయో –సీఎన్జీ ప్లాంట్‌లో త యారయ్యే గ్యాస్‌ను పట్టణంలో హోటళ్లకు సరఫరా చేస్తామ ని చెప్పారు. అలాగే మున్సిపల్ వాహనాలకు ఇంధనంగా ఈ సీఎన్జీ గ్యాస్‌ను ఉపయోగిస్తామని మంత్రి వెల్లడించారు. స్వచ్ఛతలో రాష్ట్రానికి ఆదర్శం సిద్దిపేట.. స్వచ్ఛత విషయంలో సిద్దిపేట జిల్లా తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు.« నాయకుల ధృడ సంకల్పం, దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు. వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకోవడం గొప్ప విషయం అన్నారు. ప్రసంగం ప్రారం భంలో ఆయన సభకు నమస్కారం.. అని తెలుగులో మాట్లా డి సభికులను ఆకట్టుకున్నారు. అనంతరం ప్లాంట్‌లో తిరు గుతూ ఫొటోలు తీసుకున్నారు. చెత్త రహిత వార్డుకు తులం బంగారం సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణంలో చెత్త రహిత వార్డు.. ఘనత సాధించే కౌన్సిలర్‌కు తులం బంగారం, వార్డు రిసో ర్స్ పర్సన్‌కు ఒక పట్టుచీరను బహుమతిగా ఇస్తా మని మం త్రి హరీశ్‌రావు ప్రకటించారు. సోమవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తో ఆయన సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి పూట కొందరు రోడ్లపై చెత్త వేయడం వల్ల రోడ్లు అపరిశుభ్రంగా మారుతున్నాయని, అలాంటి ఘటనలు జరగకుండా గట్టి నిఘా పెట్టాలని హరీశ్‌రావు అధికారులకు సూచించారు. బయో సీఎన్జీ తయారీ ఇలా.. ఇంటింటా సేకరించిన తడిచెత్తను తొలుత క్రషింగ్ చేస్తారు. అనంతరం పైప్ ద్వారా ప్రి–డిజాస్టర్ ట్యాంక్‌లోకి పంపిస్తారు. దాన్ని మూడ్రోజులు నిల్వ ఉంచు తారు. అది ద్రావణంగా మారాక మరో ట్యాంక్‌లోకి పం పిస్తారు. అనంతరం అందులో మైక్రో ఆర్గాన్లు కలుపుతారు. ఆ సమయంలో విడుదలయ్యే మీథేన్ గ్యాస్ నుంచి సీఎన్జీని వేరుచేసి సిలిండర్లలో నింపుతారు. -
100 నగరాలు కన్నా.. విశాఖే మిన్న
-
Visakhapatnam: 100 నగరాలు కన్నా.. విశాఖే మిన్న
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ పాలనా తీరులో సమూల మార్పులు తెచ్చిందని, అందులోనూ మహిళల భాగస్వామ్యం పెరిగిందని బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. విద్య, వైద్య రంగాల్లో అమలవుతున్న నాడు–నేడు కార్యక్రమం సీఎం వైఎస్ జగన్ దార్శనికతకు అద్దం పడుతోందన్నారు. విశాఖకి ‘గ్లోబల్ పొటెన్షియాలిటీ’ ఉందని, పెట్టుబడులకు ఎంతో అనుకూల నగరమని చెప్పారు. అభివృద్ధికి విశాఖలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఆండ్రూ ఫ్లెమింగ్ మూడు రోజుల రాష్ట్ర పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వెళుతూ ఎంపిక చేసిన కొద్దిమంది మీడియా ప్రతినిధులతో గురువారం ముచ్చటించారు. ఒకసారి విశాఖను సందర్శిస్తే మళ్లీమళ్లీ రావాలనే భావన ఎవరికైనా కలుగుతుందని, తనకూ అదే భావన కలిగిందని ఫ్లెమింగ్ తెలిపారు. మనుషులను ఆకర్షించే గుణం ఉన్న నగరానికి అభివృద్ధి సహజసిద్ధంగానే వచ్చి చేరుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 నగరాల్లో పర్యటించిన తాను విశాఖతో ప్రేమలో పడిపోయానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేసుకోవడం అభివృద్ధికి, నగర విస్తరణకు దోహదం చేస్తుందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే రాష్ట్రాభివృద్ధికి విశాఖ చుక్కానిలా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. విశాఖ గురించి ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. నివాసయోగ్యం.. క్వాలిటీ లైఫ్ నివాసయోగ్యమైన నగరంగా విశాఖకు మంచి మార్కులు పడతాయి. జీవన వ్యయం కూడా తక్కువే. యూనివర్సిటీలు ఉండటం వల్ల మెరుగైన విద్యావకాశాలు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యం ఉన్న వర్క్‌ఫోర్స్ దొరుకుతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఉన్న కంపెనీలు తమ సిబ్బందిని విశాఖకు మారుస్తామంటే వెళ్లడానికి ముందుంటారు. నగరంలో క్వాలిటీ లైఫ్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా చూస్తే విశాఖ పెద్ద నగరం. మరోవైపు మిగతా వాటితో పోలిస్తే జనాభా తక్కువ. అభివృద్ధికి, విస్తరణకు బాగా అవకాశం ఉంది. స్పెయిన్‌లో రిసార్టులకు ప్రసిద్ధి చెందిన శాన్ సెబాస్టియన్, బ్రెజిల్‌లోని రియో డీజనీరియో నగరాలను విశాఖ పోలి ఉంది. సకాలంలో వైద్య చికిత్స.. వైద్య రంగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నాడు -నేడు ద్వారా మౌలిక వసతులు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడం, రోగాన్ని సకాలంలో గుర్తించి చికిత్సను గ్రామీణ ప్రాంతంలోనే సకాలంలో అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. పెట్టుబడులపై.. గత ఆర్థిక సంవత్సరంలో బ్రిటీష్ కంపెనీలు తెలుగు రాష్ట్రాల్లో 50 మిలియన్ పౌండ్ల మేర పెట్టుబడులు/లావాదేవీలు చేశాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు బ్రిటన్‌లో దాదాపు 70 మిలియన్ పౌండ్ల లావాదేవీలు/పెట్టుబడులు పెట్టాయి. ప్రజల జీవితాలు, జీవనోపాధులను మెరుగుపరచడం లక్ష్యంగా ‘2030 విజన్’ రూపొందించాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వచ్చా. మూడు రోజుల పర్యటన ఫలవంతంగా సాగింది. విద్య, వైద్యం, అగ్రిటెక్, ఎనర్జీ, వాతావరణ మార్పులు.. తదితరాల్లో పరిస్థితులను అర్థం చేసుకోవడం, అవకాశాలను పరిశీలించడానికి నా పర్యటన దోహదం చేసింది. యూకేపై భారతీయ విద్యార్థుల ఆసక్తి.. యూకేలో చదువుకోవడానికి భారతీయ విద్యార్థుల ఆసక్తి చూపిస్తున్నారు. వీసాల జారీలో బ్రిటన్ ‘రిజిడ్’గా ఉంటుందనే ఆరోపణ నిజం కాదు. ఇప్పుడు చదువు ముగిసిన తర్వాత రెండేళ్లు యూకేలో ఉండటానికి అవకాశం కల్పించారు. చదువు పూర్తి చేశాక ఉద్యోగం/పని అనుభవం సంపాదించడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి కుమార్తె కూడా యూకేలో చదువుకున్నారు. మహిళా సాధికారతలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పరిశీలించాం. స్థానిక సంస్థలు, పలు ప్రభుత్వ సంస్థలు, కంపెనీల్లో మహిళలు నాయకత్వ స్థానాల్లో స్వతంత్రంగా పనిచేస్తున్న తీరు ఆకట్టుకుంది. ఇంధన రంగంలో అపార అవకాశాలు.. ఇంధన రంగంలోనూ ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాం. క్లీన్ ఎనర్జీ పట్ల ఆసక్తిగా ఉన్నాం. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శితోనూ చర్చించాం. మరింత క్షుణ్నంగా చర్చలు జరిగితే పెట్టుబడుల విషయంలో స్పష్టత వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. రవాణా వ్యయాన్ని చౌకగా మార్చేందుకు ఈ వాహనాలు అవసరం. సుదీర్ఘ మన్నిక, నాణ్యత ఉన్న బ్యాటరీల తయారీపై ఇంకా రీసెర్చ్ జరగాలి. ఈ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం ఎంతో ఉపయోగం.. ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లి్లష్ మీడియం ప్రవేశపెట్టడం కూడా విప్లవాత్మక మార్పు. టీచర్ల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మా వంతు సహకారం అందిస్తాం. ఇంగ్లీషులో టీచింగ్ స్కిల్స్ పెంచుకోవడం అసాధ్యం ఏమీ కాదు. విద్యార్థులు ఇంగ్లీషు నేర్చుకోవడం వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. రంగులు పులమడం కాకుండా.. నేను పరిశీలిస్తున్న అంశాల్లో ‘జెండర్’ కూడా ఉంది. విద్యా సంస్కరణల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలను మార్చేసింది. సంస్కరణలంటే కేవలం రంగులు పులిమి కలర్ఫుల్గా తయారు చేయడం కాకుండా అన్ని స్కూళ్లలో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. బాలికలు స్కూళ్లకు దూరం కావటానికి బడి ఆవరణలో టాయిలెట్ లేకపోవడం కూడా ప్రధాన కారణమని ఇప్పటికే గుర్తించారు. అన్ని స్కూళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేయడం వల్ల బాలికల డ్రాపౌట్స్ దాదాపుగా ఉండవు. ఇలాంటి పలు విషయాలను ఏపీలో మేం గమనించాం. విద్యారంగంలో సహకారం అందిస్తాం.. విద్యారంగంలో బ్రిటీష్ కౌన్సిల్ ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తోంది. విద్యా సంస్కరణలతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న మార్పులు, వాస్తవ పరిస్థితులకు మధ్య అంతరాన్ని (గ్యాప్స్) గుర్తించి అధిగమించేందుకు యూకే విద్యాసంస్థలు సహకారం అందిస్తాయి. ముఖ్యమంత్రి జగన్ ఆశయాల సాధనలో మా సహకారం అవసరం ఎక్కడ ఉంటుందో పరిశీలిస్తాం. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ యూనివర్సిటీలు భారత్‌లో కార్యకలాపాలు సాగించడంపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చర్యలు చేపడతాయి. విద్యారంగంలో మార్పులు చేపట్టడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో మా దేశ (బ్రిటన్) విద్యావ్యవస్థ అనుభవం, ఆలోచనలు ఉపకరిస్తాయేమో చూడాలి. ముఖ్యమంత్రి జగన్ దార్శనికుడు.. విద్య, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెస్తున్న సంస్కరణలు ముఖ్యమంత్రి జగన్ దార్శనికతకు నిదర్శనం. సమూల మార్పు కోసం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమం బాగుంది. ఈ రంగాల్లో కలసి పనిచేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఉమ్మడిగా వర్కింగ్ గ్రూప్స్ ఏర్పాటు చేద్దామని ప్రభుత్వానికి ప్రతిపాదించా. వైద్య రంగంలో అంబులెన్స్ ప్రాజెక్టు(108 అంబులెన్స్‌లు)లో ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాం. మరిన్ని అంశాల్లో కలసి పనిచేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినప్పుడు.. తాను చేపట్టనున్న కార్యక్రమాలు, తన సంకల్పం, ఆశయాలను వివరించారు. ఇప్పుడు ఆ దిశగా వేసిన అడుగులు కనిపించాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు బ్రిటన్ బృందం ఆసక్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. సీఎం వైఎస్ జగన్‌ను మంగళవారం క్యాంపు కార్యాలయంలో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్ మాలి, పలువురు బృంద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆ బృందం సీఎం జగన్‌కు వివరించింది. అనంతరం డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సీఎం సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సీఎస్‌తో సమావేశం బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను మర్యాదపూర్వంగా కలిశారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న వివిధ పథకాలు, ప్రాజెక్టుల వివరాలను సీఎస్ ఆయనకు వివరించారు. అలాగే, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకుగల అనువైన రంగాలు, ప్రాంతాల వివరాలను కూడా తెలియజేశారు. ఆ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు వచ్చేలా తగిన కృషిచేయాల్సిందిగా బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్‌ను కోరారు. దీనిపై ఆండ్రూ ఫ్లెమింగ్ స్పందిస్తూ.. ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్‌కు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు సీఎస్‌కు వివరించారు. అంతకుముందు.. ఫ్లెమింగ్‌ను ఆదిత్యనాధ్ దాస్ శాలువ, జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, బ్రిటీష్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్ మాలి, పలువురు యూకే డెలిగేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. దుర్గమ్మ సేవలో ఫ్లెమింగ్ ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) :ఆండ్రూ ఫ్లెమింగ్ మంగళవారం తన బృందంతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. -
సీఎం జగన్‌ను కలిసిన బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్
సాక్షి, తాడేపల్లి: బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్ హెడ్ వరుణ్ మాలి, పలువురు బృంద సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్ టీంను కోరారు. ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు బ్రిటన్ టీం సీఎం జగన్‌కు వివరించింది. అనంతరం సీఎం జగన్.. డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. -
వావ్.. సిద్దిపేట!
సాక్షి, గజ్వేల్/వర్గల్/సిద్దిపేటజోన్: వృక్ష సొరంగం, పల్లె అందాల సోయగాన్ని చూసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ముగ్ధుడయ్యారు. ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని పలు గ్రామాలను మార్నింగ్ వాక్‌లో భాగంగా సందర్శించిన ఆయన, పల్లె అందాలను స్వయంగా కెమెరాలో బంధించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రధానంగా వర్గల్ మండలంలోని నవోదయ విద్యాలయ సమీపంలోని రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను వృక్ష సొరంగంగా అభివర్ణించారు. సిద్దిపేట జిల్లా గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ బస పేరుతో పల్లె అందాలను, వ్యవసాయ పనిముట్లుగా వాడే ఎడ్లబండి, నిండుకుండలా ఉన్న వర్గల్‌లోని పెద్దచెరువు, సైకిల్, గడ్డివాము రక్షణకు కట్టిన చీర, కనువిందు చేసిన గోగి పూవు తదితర భిన్నమైన దృశ్యాలను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. తన పోస్టులకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సైతం ట్యాగ్ చేశారు. ఒకప్పుడు తాను చూసిన సిద్దిపేట జిల్లా.. ప్రస్తుతం ఊహించనంతగా మారిందని ప్రశంసించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సిద్దిపేట ఎంతగానే మారిందని.. మూడేళ్ల క్రితం తాను చూసిన దానికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం కనిపిస్తోందని పేర్కొన్నారు. నీరు పుష్కలంగా ఉండటంతో సాగు భూములు కనుచూపు మేర పచ్చదనం సంతరించుకుని శోభాయమానంగా కనువిందు చేస్తున్నాయని తెలిపారు. Sunday walk in Siddipet#RuralTelangana pic.twitter.com/Psirtbezj0 — Dr Andrew Fleming (@Andrew007Uk) February 14, 2021 Good morning Siddipet! pic.twitter.com/YUd3S1cIoI — Dr Andrew Fleming (@Andrew007Uk) February 14, 2021 -
మూడు రాజధానులను సందర్శిస్తా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కోసం ప్రవేశపెట్టిన బిల్లును గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ప్లెమింగ్ స్వాగతిస్తూ గొప్ప పరిణామంగా కొనియాడారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఆ మూడు నగరాలు సంక్షేమ సౌభాగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. శాసన రాజధాని అమరావతి, పరిపాలన రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు నగరాలను సందర్శించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కరాళ నృత్యం తగ్గిన తర్వాత తప్పకుండా వీటిని సందర్శించేందుకు ఏపీకి వస్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మూడు రాజధానుల బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) (వైజాగ్‌ని చాలా మిస్ అవుతున్నా..) -
వైజాగ్‌ని చాలా మిస్ అవుతున్నా..
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖ తీరం చిత్రమిది.. చాలామంది వైజాగ్ అని పిలుచుకునే ఈ సిటీ ఆఫ్ డెస్టినీ.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం. అంతేకాదు.. అత్యధికమంది అంతర్జాతీయ ఉద్యోగులున్న హెచ్ఎస్బీసీ విశాఖలో ఉంది. కరోనా కారణంగా మూడు నెలలుగా ఈ సుందరమైన నగరాన్ని చాలా మిస్ అవుతున్నాను’ అంటూ తెలుగు రాష్ట్రాల యూఎస్ డిప్యూటీ హైకమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు. వైజాగ్ లాంటి సుందర ప్రదేశం ఎక్కడా లేదనీ.. విశాఖ నగరంలో ఉన్న రోడ్లు దేశంలో ఎక్కడా కనిపించవని.. గతంలోనూ పలు ట్వీట్లు చేశారు. తాజాగా.. విశాఖని మిస్ అవుతున్నానంటూ.. ఏరియల్‌వ్యూ ఫొటోతో ఫ్లెమింగ్ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు లైక్‌లు.. రీట్వీట్లు చేస్తున్నారు. As we continue to move #AroundAndhra here is a view of the coastal court of #Visakhapatnam, known by many as #Vizag and dubbed The City of Destiny. It is the largest city in AP, and the biggest international employer is 🇬🇧- @HSBC. I am much missing my visits these past 3 months. pic.twitter.com/yupU1Kop8n — Dr Andrew Fleming (@Andrew007Uk) July 5, 2020 -
కంగ్రాట్స్ సీఎం సార్
సాక్షి, అమరావతి: వెయ్యికి పైగా అత్యాధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బుధవారం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాజెక్టులో సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసు పాలు పంచుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. (దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్) 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ల ప్రాజెక్టుల్లో టెక్నికల్, లీడ్ పార్టనర్లుగా ఉన్న అరబిందో ఫార్మా, యూకేకి చెందిన నేషనల్ హెల్త్ సర్వీసులో భాగమైన సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసులకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. (గొప్ప పాలసీని తీసుకొస్తున్నాం : మంత్రి మేకపాటి) -
‘నిర్లక్ష్యం తగదు’
బంజారాహిల్స్: చారిత్రక ప్రదేశాలపై నిర్లక్ష్యం తగదని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు. బంజారాహిల్స్‌లోని షేక్‌పేట మండల కార్యాలయం వెనకాల ఉన్న ఓ పురాతన భవనం ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. 1922లో నిర్మించిన ఈ భవనం గత 40 ఏళ్లుగా ఎవరూ లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. సంబంధిత అధికారులు ఈ భవనాన్ని గుర్తించి దీన్ని లైమ్‌లైట్‌లోకి తీసుకురావాలని వీటి పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. -
శ్రీసిటీలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు
సాక్షి, తడ: శ్రీసిటీ పారిశ్రామికవాడలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పెట్టుబడులకు ఎంతో ఈ ప్రాంతం అనుకూలమని, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెవిుంగ్ కితాబిచ్చారు. మంగళవారం శ్రీసిటీ పర్యటనకు వచ్చిన ఆయనకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీసిటీ మౌలిక సదుపాయాలు, ప్రత్యేకతలు, అభివృద్ధిని వివరించారు. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన రోటోలోక్, ఎంఎండీతో సహా 7 సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తి కేంద్రాలను శ్రీసిటీలో ఏర్పాటు చేశాయని వివరించారు. అనంతరం డాక్టర్ ఆండ్రూ ఫ్లెవిుంగ్ మాట్లాడుతూ.. శ్రీసిటీ యాజమాన్యం ధార్శినికత, అభివృద్ధి తమకెంతో నచ్చాయన్నారు. శ్రీసిటీలో 7 బ్రిటిష్ పరిశ్రమలు ఏర్పాటుకావడం సంతోషదాయకమన్నారు. యూకే ప్రభుత్వ అంతర్జాతీయ వాణిజ్యాన్ని విస్తృతపరిచే దిశగా శ్రీసిటీ పర్యటనకు వచ్చామన్నారు. త్వరలో మరిన్ని బ్రిటిష్ కంపెనీలు శ్రీసిటీకి రానున్నాయని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతంషగా భారతదేశం అవతరించిందన్నారు. మన దేశంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్న ఐరోపా దేశాలలో యూకే అగ్రస్థానంలో ఉందన్నారు.అనంతరం శ్రీసిటీ వ్యాపార వాణిజ్య కేంద్రంలో ఇరువురి మధ్య పరస్పర చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో శ్రీసిటీ గురించి వివిధ అంశాలపై డాక్టర్ ఫ్లెవిుంగ్ ఆరా తీశారు. వీరి వెంట ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్ మాలీ, దక్షిణ భారతదేశం ఇన్వర్డ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ సిద్ధార్థ్ విశ్వనాథన్, లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ సీనియర్ ట్రేడ్ అడ్వైజర్ హర్‡్ష ఇంద్రారుణ్, పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్, ప్రెస్, కమ్యూనికేషన్స్ హెడ్ పద్మజా కొనిశెట్టి, హెచ్ఆర్ ఆఫీసర్ నిధి శ్రీవాస్తవ ఉన్నారు. -
భారతీయ సంస్కృతి చాలా గొప్పది
కడ్తాల్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని హైదరాబాద్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్మన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన దసరా ఉత్సవాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్) వ్యవస్థాపకుడు కె.లక్ష్మారెడ్డి, చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఆయుధపూజ, జమ్మిపూజలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి కోలాటం వేశారు. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. సీజీఆర్ సంస్థ, గ్రేస్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన తూర్పు కనుమల పర్యావరణ నివేదికను ఆండ్రూ ఫ్లెమింగ్, జోయల్ రిఫ్మన్లకు అందించారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ మాజీ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, పారిశ్రామికవేత్తలు విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సూదిని పద్మారెడ్డి, దేవేంద్ర ఫౌండేషన్ డైరెక్టర్ విజయేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కుక్కను కాపాడి.. ఆకలి తీర్చి
బంజారాహిల్స్: బిజీ రోడ్డులో ఓ కుక్క పిల్ల రోడ్డు దాటుతూ కారు చక్రాల కింద పడే క్రమంలో అటుగా వెళ్తున్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సతీమణి వ్యాన్ ఫ్లెమింగ్ తన కారును ఆపి హుటాహుటిన అక్కడికెళ్లి కుక్కను ప్రమాదం నుంచి కాపాడారు. దీన్ని ఆమె ట్విట్టర్లో పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఆమె తన కారులో వెళ్తుండగా రోడ్డు పక్క నుంచి ఓ కుక్కపిల్ల అటువైపు వెళ్తుండగా ఓ వాహనం దానిపై నుంచి వెళ్లే క్రమంలో తప్పించుకుంది. ఇది గమనించిన ఫ్లెమింగ్ తన కారును ఆపి అంత రద్దీలోనూ రోడ్డు దాటి కుక్కపిల్లను పట్టుకొని అక్కడ చెరుకు రసం అమ్ముతున్న వ్యాపారి నుంచి నీళ్లు తీసుకొని దానికి తాగించారు. తర్వాత కొద్ది దూరంలో ఉన్న ఫార్మసీలో డాగ్ఫీడ్ను తీసుకొచ్చి తినిపించారు. దాంతో గంటపాటు సరదాగా గడిపారు. ‘మీరు వీధి కుక్కలను దత్తత తీసుకోకపోయినా పర్వాలేదు. కానీ మూగజీవాల పట్ల కొంత ప్రేమను చూపండి’ అంటూ ట్వీట్ చేశారు. -
టక్కున చేరుకొని.. అక్కున చేర్చుకొని..
అది ఫిలింనగర్ బస్టాప్. ఓ మహిళను ఆమె భర్త కర్రతో విచక్షణారహితంగా కొడుతున్నాడు. ఆమె రోదిస్తూ కాళ్లావేళ్లాపడుతున్నా కనికరించడంలేదు. చుట్టుపక్కల వారంతా చోద్యం చేస్తున్నారే, కానీ ఏ ఒక్కరూ ఆపేందుకు ప్రయతి్నంచడంలేదు. హైదరాబాద్‌లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సతీమణి వ్యాన్ ఫ్లెమింగ్ అదే సమయంలో ఫిలింనగర్ మీదుగా జూబ్లీహిల్స్‌కు కారులో వెళుతున్నారు. వెంటనే కారు దిగి వెళ్లి దాడిని వారించారు. అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. బాధితురాలిని ఫ్లెమింగ్ అక్కున చేర్చుకొని ఓదార్చారు. ఏం జరిగిందని ఆరా తీశారు. తన భర్త రోజూ కొడుతున్నాడని, గదిలో బంధిస్తున్నాడని చెబుతూ బాధితురాలు కన్నీరుమున్నీరైంది. స్నేహితులకు సమాచారం ఇచ్చి ఎవరికి ఫిర్యాదు చేయాలంటూ ఫ్లెమింగ్ అడిగారు. దీనిపై ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా స్పందించారు. గురువారం జరిగిన ఈ ఘటనపై ఉమెన్ సేఫ్టీ ఐజీకి సమాచారం అందించారు. – బంజారాహిల్స్ -
పెట్టుబడులపై ఆసక్తిగా ఉన్నాం
సాక్షి, అమరావతి: సుదీర్ఘ పాదయాత్రలో యువత కష్టాలను చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి భరోసా ఇచ్చే విధంగా పలు చర్యలు తీసుకుంటున్నారని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కొనియాడారు. దౌత్య సదస్సుకు హాజరైన సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం శుభసూచకమన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఫ్లెమింగ్ తెలిపారు. యువ ముఖ్యమంత్రి నాయకత్వంలోని పరిపాలన తీరు తమను ఎంతగానో ఆకట్టుకుంటోందని.. విద్య, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో రాష్ట్రంతో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆదాయం పెంచే విధంగా దిగుబడులు పెంచడం, శీతల గిడ్డంగుల నిర్మాణం, ఎస్ఎంఈ వంటి రంగాల్లో కూడా పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుండటంతో ఈ అవకాశాన్ని తాము వినియోగించుకోనున్నట్లు తెలిపారు. శ్రీసిటీ వంటి సెజ్లతో మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగాను, వైజాగ్‌ను ఐటీకి కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుండటంతో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో బ్రిటన్ సత్సంబంధాలను కలిగి ఉందని, యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఈ బంధం మరింత దృఢపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. విశాఖలో హెచ్ఎస్బీసీని ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటికే 3,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. దౌత్య సదస్సు సందర్భంగా ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులతో చర్చలు చాలా బాగా జరిగాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అంశాలకు సంబంధించి చర్చించడానికి త్వరలోనే రెండోసారి ముఖ్యమంత్రితో సమావేశం కానున్నట్లు ఫ్లెమింగ్ తెలిపారు. సీఎంను కలిసిన యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. -
తెలంగాణ సంస్కృతి, ఎంతో ఇష్టం
చిలకలగూడ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలంటే తనకెంతో ఇష్టమని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. ఆదివారం రాత్రి ఆయన చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ కృష్ణ, స్థానిక కార్పొరేటర్ సామల హేమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే బోనాల జాతరను ఎంతో ఆస్వాదిస్తానని, జాతరలో కలియతిరగడం తనకెంతో సరదా అని పేర్కొన్నారు. బోనాల జాతరలో కలియతిరిగి సెల్ఫీలు దిగిన ఆయన ఫలహారం బళ్లు, తొట్టెల ఊరేగింపులో పాల్గొని సందడి చేశారు. స్థానిక కార్పోరేటర్ సామల హేమతోపాటు పలువురు భక్తులతో సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో బ్రిటీష్ ఎంబసీ అధికారులు ఖాజామొయినుద్థీన్, ప్రవల్లిక, బీజేపీ నాయకులు, ఫ్యామిలీ ఫ్రెండ్ అరుణ, సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, టీఆర్ఎస్ నాయకుడు త్రినేత్రగౌడ్ పాల్గొన్నారు. -
బ్రిటన్ డిప్యూటీ హైకమీషనర్‌తో సాక్షి ఇంటర్వ్యూ