(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ పాలనా తీరులో సమూల మార్పులు తెచ్చిందని, అందులోనూ మహిళల భాగస్వామ్యం పెరిగిందని బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. విద్య, వైద్య రంగాల్లో అమలవుతున్న నాడు–నేడు కార్యక్రమం సీఎం వైఎస్ జగన్ దార్శనికతకు అద్దం పడుతోందన్నారు. విశాఖకి ‘గ్లోబల్ పొటెన్షియాలిటీ’ ఉందని, పెట్టుబడులకు ఎంతో అనుకూల నగరమని చెప్పారు. అభివృద్ధికి విశాఖలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఆండ్రూ ఫ్లెమింగ్ మూడు రోజుల రాష్ట్ర పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వెళుతూ ఎంపిక చేసిన కొద్దిమంది మీడియా ప్రతినిధులతో గురువారం ముచ్చటించారు.
ఒకసారి విశాఖను సందర్శిస్తే మళ్లీమళ్లీ రావాలనే భావన ఎవరికైనా కలుగుతుందని, తనకూ అదే భావన కలిగిందని ఫ్లెమింగ్ తెలిపారు. మనుషులను ఆకర్షించే గుణం ఉన్న నగరానికి అభివృద్ధి సహజసిద్ధంగానే వచ్చి చేరుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 నగరాల్లో పర్యటించిన తాను విశాఖతో ప్రేమలో పడిపోయానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేసుకోవడం అభివృద్ధికి, నగర విస్తరణకు దోహదం చేస్తుందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే రాష్ట్రాభివృద్ధికి విశాఖ చుక్కానిలా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. విశాఖ గురించి ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
నివాసయోగ్యం.. క్వాలిటీ లైఫ్
నివాసయోగ్యమైన నగరంగా విశాఖకు మంచి మార్కులు పడతాయి. జీవన వ్యయం కూడా తక్కువే. యూనివర్సిటీలు ఉండటం వల్ల మెరుగైన విద్యావకాశాలు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యం ఉన్న వర్క్‌ఫోర్స్ దొరుకుతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఉన్న కంపెనీలు తమ సిబ్బందిని విశాఖకు మారుస్తామంటే వెళ్లడానికి ముందుంటారు. నగరంలో క్వాలిటీ లైఫ్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా చూస్తే విశాఖ పెద్ద నగరం. మరోవైపు మిగతా వాటితో పోలిస్తే జనాభా తక్కువ. అభివృద్ధికి, విస్తరణకు బాగా అవకాశం ఉంది. స్పెయిన్‌లో రిసార్టులకు ప్రసిద్ధి చెందిన శాన్ సెబాస్టియన్, బ్రెజిల్‌లోని రియో డీజనీరియో నగరాలను విశాఖ పోలి ఉంది.
సకాలంలో వైద్య చికిత్స..
వైద్య రంగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నాడు -నేడు ద్వారా మౌలిక వసతులు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడం, రోగాన్ని సకాలంలో గుర్తించి చికిత్సను గ్రామీణ ప్రాంతంలోనే సకాలంలో అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
పెట్టుబడులపై..
గత ఆర్థిక సంవత్సరంలో బ్రిటీష్ కంపెనీలు తెలుగు రాష్ట్రాల్లో 50 మిలియన్ పౌండ్ల మేర పెట్టుబడులు/లావాదేవీలు చేశాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు బ్రిటన్‌లో దాదాపు 70 మిలియన్ పౌండ్ల లావాదేవీలు/పెట్టుబడులు పెట్టాయి. ప్రజల జీవితాలు, జీవనోపాధులను మెరుగుపరచడం లక్ష్యంగా ‘2030 విజన్’ రూపొందించాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వచ్చా. మూడు రోజుల పర్యటన ఫలవంతంగా సాగింది. విద్య, వైద్యం, అగ్రిటెక్, ఎనర్జీ, వాతావరణ మార్పులు.. తదితరాల్లో పరిస్థితులను అర్థం చేసుకోవడం, అవకాశాలను పరిశీలించడానికి నా పర్యటన దోహదం చేసింది.
యూకేపై భారతీయ విద్యార్థుల ఆసక్తి..
యూకేలో చదువుకోవడానికి భారతీయ విద్యార్థుల ఆసక్తి చూపిస్తున్నారు. వీసాల జారీలో బ్రిటన్ ‘రిజిడ్’గా ఉంటుందనే ఆరోపణ నిజం కాదు. ఇప్పుడు చదువు ముగిసిన తర్వాత రెండేళ్లు యూకేలో ఉండటానికి అవకాశం కల్పించారు. చదువు పూర్తి చేశాక ఉద్యోగం/పని అనుభవం సంపాదించడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి కుమార్తె కూడా యూకేలో చదువుకున్నారు.
మహిళా సాధికారతలోనూ..
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పరిశీలించాం. స్థానిక సంస్థలు, పలు ప్రభుత్వ సంస్థలు, కంపెనీల్లో మహిళలు నాయకత్వ స్థానాల్లో స్వతంత్రంగా పనిచేస్తున్న తీరు ఆకట్టుకుంది.
ఇంధన రంగంలో అపార అవకాశాలు..
ఇంధన రంగంలోనూ ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాం. క్లీన్ ఎనర్జీ పట్ల ఆసక్తిగా ఉన్నాం. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శితోనూ చర్చించాం. మరింత క్షుణ్నంగా చర్చలు జరిగితే పెట్టుబడుల విషయంలో స్పష్టత వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. రవాణా వ్యయాన్ని చౌకగా మార్చేందుకు ఈ వాహనాలు అవసరం. సుదీర్ఘ మన్నిక, నాణ్యత ఉన్న బ్యాటరీల తయారీపై ఇంకా రీసెర్చ్ జరగాలి. ఈ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయి.
ఇంగ్లీష్ మీడియం ఎంతో ఉపయోగం..
ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లి్లష్ మీడియం ప్రవేశపెట్టడం కూడా విప్లవాత్మక మార్పు. టీచర్ల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మా వంతు సహకారం అందిస్తాం. ఇంగ్లీషులో టీచింగ్ స్కిల్స్ పెంచుకోవడం అసాధ్యం ఏమీ కాదు. విద్యార్థులు ఇంగ్లీషు నేర్చుకోవడం వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది.
రంగులు పులమడం కాకుండా..
నేను పరిశీలిస్తున్న అంశాల్లో ‘జెండర్’ కూడా ఉంది. విద్యా సంస్కరణల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలను మార్చేసింది. సంస్కరణలంటే కేవలం రంగులు పులిమి కలర్‌ఫుల్‌గా తయారు చేయడం కాకుండా అన్ని స్కూళ్లలో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. బాలికలు స్కూళ్లకు దూరం కావటానికి బడి ఆవరణలో టాయిలెట్ లేకపోవడం కూడా ప్రధాన కారణమని ఇప్పటికే గుర్తించారు. అన్ని స్కూళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేయడం వల్ల బాలికల డ్రాపౌట్స్ దాదాపుగా ఉండవు. ఇలాంటి పలు విషయాలను ఏపీలో మేం గమనించాం.
విద్యారంగంలో సహకారం అందిస్తాం..
విద్యారంగంలో బ్రిటీష్ కౌన్సిల్ ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తోంది. విద్యా సంస్కరణలతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న మార్పులు, వాస్తవ పరిస్థితులకు మధ్య అంతరాన్ని (గ్యాప్స్) గుర్తించి అధిగమించేందుకు యూకే విద్యాసంస్థలు సహకారం అందిస్తాయి. ముఖ్యమంత్రి జగన్ ఆశయాల సాధనలో మా సహకారం అవసరం ఎక్కడ ఉంటుందో పరిశీలిస్తాం. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ యూనివర్సిటీలు భారత్‌లో కార్యకలాపాలు సాగించడంపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చర్యలు చేపడతాయి. విద్యారంగంలో మార్పులు చేపట్టడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో మా దేశ (బ్రిటన్) విద్యావ్యవస్థ అనుభవం, ఆలోచనలు ఉపకరిస్తాయేమో చూడాలి.
ముఖ్యమంత్రి జగన్ దార్శనికుడు..
విద్య, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెస్తున్న సంస్కరణలు ముఖ్యమంత్రి జగన్ దార్శనికతకు నిదర్శనం. సమూల మార్పు కోసం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమం బాగుంది. ఈ రంగాల్లో కలసి పనిచేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఉమ్మడిగా వర్కింగ్ గ్రూప్స్ ఏర్పాటు చేద్దామని ప్రభుత్వానికి ప్రతిపాదించా. వైద్య రంగంలో అంబులెన్స్ ప్రాజెక్టు(108 అంబులెన్స్‌లు)లో ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాం. మరిన్ని అంశాల్లో కలసి పనిచేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినప్పుడు.. తాను చేపట్టనున్న కార్యక్రమాలు, తన సంకల్పం, ఆశయాలను వివరించారు. ఇప్పుడు ఆ దిశగా వేసిన అడుగులు కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment