
చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్
చిలకలగూడ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలంటే తనకెంతో ఇష్టమని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. ఆదివారం రాత్రి ఆయన చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ కృష్ణ, స్థానిక కార్పొరేటర్ సామల హేమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే బోనాల జాతరను ఎంతో ఆస్వాదిస్తానని, జాతరలో కలియతిరగడం తనకెంతో సరదా అని పేర్కొన్నారు. బోనాల జాతరలో కలియతిరిగి సెల్ఫీలు దిగిన ఆయన ఫలహారం బళ్లు, తొట్టెల ఊరేగింపులో పాల్గొని సందడి చేశారు. స్థానిక కార్పోరేటర్ సామల హేమతోపాటు పలువురు భక్తులతో సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో బ్రిటీష్ ఎంబసీ అధికారులు ఖాజామొయినుద్థీన్, ప్రవల్లిక, బీజేపీ నాయకులు, ఫ్యామిలీ ఫ్రెండ్ అరుణ, సీతాఫల్‌మండి కార్పొరేటర్ సామల హేమ, టీఆర్‌ఎస్ నాయకుడు త్రినేత్రగౌడ్ పాల్గొన్నారు.