
సాక్షి, తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు లేవనడానికి.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా దాడులే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. సాక్షాత్తూ కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడటం లేదు. ప్రజాస్వామ్యం లేదన్నది ఎన్నికల్లో రుజువైంది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితులున్నాయో చెప్పడానికి పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ఉదాహరణ. పోలింగ్ బూత్ లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేరు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు బూత్ లలో లేకుండా చేసి రిగ్గింగ్ చేసుకున్నారు. పోలీసుల ప్రోద్భలంతో రిగ్గింగ్ చేసుకున్నారు. దేశంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిగింది ఇక్కడే
పులివెందులలో జరిగింది ఎన్నిక అంటారా?
పోలింగ్ బూత్ ఏజెంట్లకు కొన్ని హక్కులు.. బాధ్యతలుంటాయ్. నకిలీ ఓటర్లను గుర్తించడం , అభ్యంతరాలను తెలియజేయడం , పోలింగే వివరాలను తెలుసుకోవడం వంటి బాధ్యతలుంటాయి. పోలింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఫామ్ -12 ఇస్తారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల నుంచి ఫామ్ -12 ను పోలీసులు,టిడిపి వాళ్లు లాక్కున్నారు. పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరగడం చరిత్రలో ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిపోయిన పరిస్థితులు ఏపీలోనే చూస్తున్నాం. ఎన్నిక ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. ఇవన్నీ ఎన్నికలో జరిగాయా?. ఏజెంట్లే లేకుండా జరిగితే వాటిని ఎన్నికలు అంటారా?..
ఇదే తరహాలో ఎన్నికలు జరిపితే హాస్యాస్పదమే అవుతుంది. ఇంతటి దానికి ఎన్నికలు జరపడం దేనికి. ప్రజలకు మంచి చేయాలనే ఉద్ధేశం ఈ ప్రభుత్వానికి లేదు. దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇది వాళ్ల విధానం. ఒకప్పుడు బందిపోట్ల పేరు చెబితే వినిపించే చంబల్ లోయను మరిపించేలా చంద్రబాబు పులివెందుల ఎన్నిక జరిపారు. సాక్షాత్తూ పోలీసులు దగ్గరుండి ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా ఛాలెంజ్.. ప్రజలు మీకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంటే ఎన్నికలను రద్దు చేయండి. కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నిక జరపండి..
.. ప్రజాస్వామ్యంలో మీకు ఓట్లు వేసే అవకాశం లేదు. ప్రతీ బూత్ లో వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం మీకుందా?. ఎవరెవరు బయటి నుంచి వచ్చారు..ఎవరెవరు బూత్ లను ఆక్రమించుకున్నారో ఆధారాలిస్తా. అడ్డగోలు రాజకీయాలు చేసే వాళ్లను మోసగాడు అంటారు. ఏ ఎన్నిక జరిగినా ఆ ఊర్లో ప్రజలే అక్కడ ఓటేస్తారు ... గతంలోనూ అదే జరిగింది
ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో చంద్రబాబు పోలింగ్ బూత్ లను మార్చేశారు. పోలింగ్ బూత్ లు మార్చడం వల్ల నాలుగు వేల ఓట్ల పై ప్రభావం పడింది. పోలింగ్ బూత్ లకు వెళ్లకుండా దారిలోనే అడ్డుకున్నారు. పులివెందుల ఎన్నికలు ఆరు పంచాయతీల పరిధిలో జరిగాయి. ఈ ఆరు పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు ఈ గ్రామాల్లో పాగా వేశారు. పోలీసులే వారిని ప్రోత్సహించారు.

ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారు
పోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు. ప్రతీ బూత్ లో 400 లకు పైగా టీడీపీ రౌడీలు తిష్ట వేశారు. ఒక్కో ఓటరుకి ఒక్కో రౌడీని పెట్టారు. మంత్రి సవిత మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి , ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మనుషులు పోలింగ్ బూత్ లలో తిష్టవేశారు. బిటెక్ రవి పులివెందుల రూరల్ ఓటరు కాదు. కానీ కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేశాడు.
ఓట్లు వేసేందుకు వెళ్లిన వారిని కొట్టి..వారి స్లిప్పులను లాగేసుకున్నారు. ఆ స్లిప్పులతో వాళ్లు ఓట్లేసుకున్నారు. టిడిపికి ఓటేసేవాడైతేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనిచ్చారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారు. జమ్మలమడుగు నుంచి వచ్చిన టిడిపి నేతలు పులివెందులలో ఓట్లేశారు. ఇవాళ జరిగే రీపోలింగ్ లో కూడా దొంగఓట్లు వేశారు. అన్యాయమని ప్రశ్నిస్తే పోలీసులు తరిమితరిమి కొట్టారు. మహిళ ఏజెంట్లను కూడా ఇబ్బంది పెట్టారు. టీడీపీ వాళ్లు వందల మంది ఒకేచోట ఉన్నా.. షామియానాలు వేశారు.
పోలీసులు.. పచ్చ చొక్కా వేసుకోవాల్సిందే!
ఏరికోరి పోలీసులను నియమించుకున్నారు. పచ్చచొక్కాలు వేసుకుని పోలీసులు టిడిపికి పనిచేశారు. డీఐజీ కోయ ప్రవీణ్ .. టీడీపీ మాజీ ఎంపీ సమీప బంధువు. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజి కోయ ప్రవీణ్ పర్యవేక్షలో ఈ ఎన్నిక జరిపారు. చంద్రబాబు మాట వినకపోతే డిజి స్థాయి అధికారులైనా ఇబ్బంది పడాల్సిందే. పీఎస్.ఆర్ ఆంజనేయులు,సునీల్ కుమార్,విశాల్ గున్నీల పై కేసులు పెట్టారు ..కొందరిని అరెస్ట్ చేశారు. ఈ డీఐజీ మాఫియా రింగ్ లీడర్. బెల్ట్ షాపుల కలెక్షన్ల నుంచి పర్మిట్ రూమ్ లు , ఇసుక,మట్టి,క్వార్ట్జ్, సిలికా, పేకాట శిభిరాలకు అనుమతి వరకూ అంతా డిఐజినే చూసుకుంటున్నాడు. ఈ కలెక్షన్లలో వాటాలను చంద్రబాబు,చినబాబు,ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు. ఇలాంటి డీఐజీ పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించారు
వైఎస్సార్‌సీపీ వాళ్లే లక్ష్యంగా..
ఉదయం 4 గంటల నుంచే టిడిపి వాళ్లు పోలింగ్ బూత్ లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పులివెందుల టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టిడిపి నేతలు రెచ్చిపోయారు. మోట్నుతలపల్లిలో పోలింగ్ బూత్ లకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓటర్లను అడ్డుకున్నారు. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోనికి రాకుండా అడ్డుకున్నారని ఓటర్లే చెబుతున్నారు. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి పోలీసులు గన్ తో బెదిరించారు
ఎర్రబల్లిలో రిగ్గింగ్ చేయడానికి వచ్చిన టిడిపి వాళ్లకు పోలీసులే స్వాగతం పలికారు. కనంపల్లిలో పోలింగ్ బూత్ లకు ఏజెంట్లు వెళ్లకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నాడు. ఓటు వేయనివ్వండని ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. కనంపల్లి ఓటర్లు ఓటు వేయలేకపోయామని ఆవేదన చెందారు. పులివెందుల జడ్పీటీసి అభ్యర్ధి హేమంత్‌ను ఇంటి నుంచి కూడా బయటికి రానివ్వలేదు. భూపేజ్ రెడ్డి పీఏ సుదర్శన్ రెడ్డికి పులివెందులలో పనేంటి?.
పులివెందుల రూరల్ లో ఎన్నికలు జరుగుతుంటే టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డి ఆఫీస్ కు వెళ్లి డిఐజి హడావిడి చేశాడు. పులివెందులలో డీఎస్పీ ‘‘కాల్చిపడేస్తా నాకొడకా’’ అని వైఎస్సార్‌సీపీ వాళ్లను బెదిరించాడు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒంటిమిట్టలో పోలింగ్ బూత్ లో రౌడీయిజం చేశాడు. రాయచోటి ఎమ్మెల్యే,మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఒంటిమిట్టలో ఏం పని?
చంద్రబాబుకి ఇదే హెచ్చరిక
ప్రజలు ఓటేస్తారనే నమ్మకం నీకుంటే ఎందుకు ఇలాంటి పనులు చేయడం చంద్రబాబు. ప్రజలు నీకు ఓటు వేయరనే ఇలా దిగజారిపోయావు?. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలానే చేశాడు. నంద్యాలలో గెలిచి సంకలు గుద్దుకున్నాడు. ఏడాదిలోనే నంద్యాలలో గెలిచాం. రాష్ట్రవ్యాప్తంగా టిడిపిని భూ స్థాపితం చేశాం. కళ్లుమూసి తెరిచేలోగా ఏడాదిన్నర గడిచిపోయింది. మరో మూడున్నరేళ్లు కూడా అలానే గడిచిపోతుంది. ప్రజాస్వామ్యం చేజారిపోతే నక్సలిజం పుడుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి
జరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి. చంద్రబాబు తప్పుడు పునాదులకు బీజం వేస్తున్నారు. రేపు ఇదే మీకు చుట్టుకుంటుంది. చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎన్నిక కావొచ్చు. కృష్ణారామా.. అనుకుంటూ ఇప్పటికైనా మార్పు తెచ్చుకో.
మీడియా ప్రతినిధి: ఎన్నిక రద్దు కోరతారా?
ఇలా జరిగేవాటికి ఎన్నికలు జరపడం ఎందుకు?. అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయారు. కచ్చితంగా ఈ ఎన్నికను కోర్టుల్లో సవాల్ చేస్తాం. మా అభ్యర్థులిద్దరినీ అందుకే పిలిపించాం. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో.. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రెండు ఉప ఎన్నికలు జరిపించాలని కోర్టులను కోరతాం.
మీడియా ప్రతినిధి: ఓట్ చోరీ పేరిట ఇండియా బ్లాక్ చేపట్టిన ర్యాలీకి దూరంగా ఎందుకు ఉన్నారు?
ఓట్లు చోరీ అయ్యాయని మాట్లాడే రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడడు. ఎన్నికలకు సంబంధించి దేశంలోనే 12.5 శాతం తేడా ఉన్నది ఏపీలో మాత్రమే. అంటే.. పోలింగ్ నాటికి-కౌంటిగ్ నాటికి 48 లక్షల ఓట్లు పెరిగాయి. ఎలా?. ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణికం ఠాకూర్ ఏరోజైనా చంద్రబాబు గురించి మాట్లాడాడా?. కానీ, నా గురించి మాట్లాడుతున్నాడు. ఏపీలో జరుగుతున్న అక్రమాల పై ఏరోజైనా మాట్లాడాడా?. కాంగ్రెస్ అధిష్టానంతో చంద్రబాబు టచ్‌లో ఉన్నారు. రేవంత్ ద్వారా రాహుల్ గాంధీకి టచ్‌లో ఉన్నారు. ఏపీలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. వీటి గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడడం లేదు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
