దర్శకుడు రాంగోపాల్‌వర్మ స్పష్టీకరణ
ఏడాది క్రితం నా ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయట!.. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి?
అలాంటప్పుడు ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?
పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తున్నారు.. నిర్మాతకు నష్టం వస్తుందని షూటింగ్ వదిలేసి విచారణకు రాలేకపోతున్నా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘ఏడాది క్రితం నేను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని చెబుతున్నారు.
ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? అలాంటప్పుడు ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తున్నారు. అమెరికా, యూరఫ్, ఇక్కడా అదే జరుగుతోంది. ప్రస్తుతం నేను ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నాను. మధ్యలో వదిలేసి వస్తే నిర్మాతకు నష్టం వస్తుందని విచారణకు రాలేకపోతున్నా’ అని ఆర్జీవీ పేర్కొన్నారు.
ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ
సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ జరపనుంది.
ఈ వ్యాజ్యాల గురించి వర్మ తరఫు న్యాయవాది మంగళవారం న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి బుధవారం విచారణ జరుపుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment