సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ పురోభివృద్ధి కోసం చేపడుతున్న సంస్కరణలు ప్రశంసనీయమని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కొనియాడారు. సమర్థత గల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసించారు. ‘21వ శతాబ్దంలో శక్తిమంతమైన సమాజ నిర్మాణం’ అనే అంశంపై ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ శనివారం దృశ్యమాధ్యమ పద్ధతిలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన ప్రత్యేక విశిష్ట ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించింది. కస్తూరి రంగన్ ముఖ్య ప్రసంగం చేస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తిగా విన్నాను. విద్యాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంస్కరణలు విద్యారంగంలో వినూత్న, ఉన్నత ప్రమాణాలకు బాటలు వేస్తాయి.
పాఠశాల స్థాయి, ఉన్నత విద్యాస్థాయిలో ఈ కార్యక్రమాలు అద్భుతంగా అమలు చేయడం ముదావహం. విద్యారంగంపై ఇంత చిత్తశుద్ధితో పనిచేసే సమర్థత గల నాయకుడు ఉండటం గొప్పవిషయం. విద్యాభివృద్ధి పథకాలను రూపొందించడం, వాటిని సమర్థంగా అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా ఎంతో చిత్తశుద్ధితో కృషి చేయడం ప్రశంసనీయం. నూతన విద్యావిధానంలో సూచించిన మేరకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడ అనేక మంచి ఆలోచనలతో కార్యక్రమాలు అమలు చేయడం, అందుకు తగ్గ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం మంచి ఫలితాలను అందిస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇది నాలెడ్జి సొసైటీని మరింతగా ప్రోత్సహిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించగలుగుతుంది. జాతీయ విద్యావిధానం అమలు పరిచే దిశలో ఏపీ అన్ని రాష్ట్రాలకన్నా ముందంజలో ఉంది’ అని ప్రశంసించారు.
విద్యారంగానికి రూ.30 వేల కోట్లు
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏటా రూ.30 వేల కోట్ల బడ్జెట్‌ను విద్యా రంగానికి కేటాయిస్తున్నామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సారథ్యంలో వినూత్న సంస్కరణలు చేపట్టి విద్యా వ్యవస్థను పటిష్ట పరుస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వీఎస్ రావు మాట్లాడుతూ ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రొ వైస్ చాన్సలర్ డి. నారాయణరావు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయలక్ష్మి సక్సేనా, ఎస్‌ఆర్‌ఎం రిజిస్ట్రార్ వినాయక్ కల్లూరి, డాక్టర్ రఘునాథన్, ప్రొఫెసర్లు డాక్టర్ రంజిత్ తాషా, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ పంకజ్ పాఠక్, రవ్వా మహేశ్, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, పరిశోధనా రంగ నిపుణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment