
సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు: రాష్ట్రం చలికి వణుకుతోంది. పశ్చిమ గాలుల ప్రభావంతోనే చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్మింది. ఉత్తర భారతదేశంతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు చలి గాలులు వీస్తుండటం వల్ల రాష్ట్రంలోనూ చలి పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ పరిసర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 1 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగులలో సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా 1.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు, డుంబ్రిగూడ, చింతపల్లి, అరకు తదితర ప్రాంతాలు చలికి గజగజ వణుకుతున్నాయి. అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురవడంతో పలు ప్రాంతాలలో మంచు గడ్డ కట్టింది. పాడేరుకు సమీపంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట నిలిపిన కారుపై మంచు పేరుకుపోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పంట భూముల వద్ద మంచు పొరలు ఏర్పడ్డాయి. ఏజెన్సీలో మంచు గడ్డకట్టిన దృశ్యాలను ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు.
రాష్ట్రంలోని మిగిలి ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీల మేర పడిపోయాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ అరకు మాదిరిగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 6.3, ఆలూరు మండలం కమ్మరచేడులో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల, సత్యసాయి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం 8 డిగ్రీలకంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరో 3, 4 రోజులు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 1.9 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 2 డిగ్రీలు, కుంతలం, హుకుంపేటలో 2.3, జీకే వీధిలో 2.6, చింతపల్లిలో 2.8, అరకు, డుంబ్రిగూడలో 3.2, పాడేరులో 3.6, కొక్కిసలో 4.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 6.3, కమ్మరచేడులో 6.5, జి.శింగవరంలో 6.6, కె.నాగలాపురంలో 6.8 డిగ్రీలు నమోదయ్యాయి. విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంలో 11.6, తిరుపతిలో 14.7, విజయవాడ రూరల్ నున్నలో 14.9, విజయవాడ గుణదలలో 16.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment