సాక్షి, అమరావతి: పదో తరగతి ధ్రువపత్రాల్లో తలెత్తే లోపాలు విద్యార్థులకు ఆ తరువాతి కాలంలో పెద్ద సమస్యగా, ఇబ్బందికరంగా మారుతుంటాయి. చివరి నిమిషంలో వాటిని సరిచేయించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతుంటారు. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన నామినల్ రోల్స్‌లో వారి వివరాలను సరైన రీతిలో పొందుపరచకపోతే అవే పొరపాట్లు ధ్రువపత్రాల్లో నమోదవుతుంటాయి. ఈ సమస్యలకు ముందుగానే చెక్‌పెట్టేలా ఎస్సెస్సీ బోర్డు తాజాగా ఎడిట్ ఆప్షన్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది.
ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు తమ స్కూలు ద్వారా టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలను సరిచూసుకుని పొరపాట్లు లేకుండా సవరించుకునేందుకు ఈ ఎడిట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ లాగిన్ నుంచి ఈ ఎడిట్ ఆప్షన్ వినియోగించి నామినల్ రోల్స్‌లోని వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. బుధవారం (నేడు) నుంచి ఈనెల 20వ తేదీవరకు ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆలోగా వివరాలు సరిచూసుకోవాలని ఆయన కోరారు.
సరిచూసుకోవలసిన అంశాలు
► విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు
► పుట్టిన తేదీ
► విద్యార్థి ఎంచుకున్న ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కాంబినేషన్
► విద్యార్థి ఎంపిక చేసుకున్న మాధ్యమం
► ఓఎస్సెస్సీ సబ్జెక్టు కోడ్
► వొకేషనల్ ఎస్సెస్సీ సబ్జెక్టు, కోడ్
► విద్యార్థి ఐడెంటిఫికేషన్ చిహ్నాలు (పుట్టుమచ్చలు)
► విద్యార్థి ఫొటో, సంతకం
Comments
Please login to add a commentAdd a comment