గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అంతా రహస్యం
నోరెత్తవద్దంటూ విద్యార్థులకు ఆంక్షలు
కాదు కూడదని మీడియాకు చెబితే చర్యలు తప్పవని బెదిరింపులు
తమ ఆదేశాలను ధిక్కరిస్తే వేటేస్తామని యాజమాన్యం హెచ్చరికలు
విద్యార్థినులపై పోలీస్ అస్త్రం
విచారణ ముగియకముందే బలవంతంగా హాస్టల్ నుంచి తరలింపు
అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులపై పచ్చ మూకల దాడి
చెప్పులు, గొడుగులతో చితకబాది ఈడ్చేసిన యాజమాన్యం రౌడీలు
మరోవైపు అక్కడ ఏమీ జరగలేదంటున్న ప్రభుత్వ పెద్దలు
దర్యాప్తు పేరుతో ఘటనను కప్పిపుచ్చేందుకు పన్నాగం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గుడివాడ రూరల్: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినుల వాష్‌రూమ్‌ల్లో రహస్య కెమెరాల వ్యవహారం శనివారం కూడా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కళాశాలలోకి వెళ్లడానికి ప్రయతి్నంచిన విద్యార్థి సంఘం నాయకులను, విద్యార్థులను యాజమాన్యానికి చెందిన రౌడీలు, పచ్చ గూండాలు చితకబాదారు. చెప్పులు, గొడుగులతో తీవ్రంగా కొట్టి ఈడ్చిపారేశారు. రహస్య కెమెరాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఎవరూ ఈ అంశంపై నోరెత్తవద్దని ఆంక్షలు విధించింది. తమ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా మీడియాతో మాట్లాడితే వారిని కళాశాల నుంచి బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది.
విచారణ ముగియకుండానే హాస్టల్‌లో ఉన్న విద్యార్థినులకు నాలుగు రోజులు బలవంతపు సెలవులు ఇచ్చేసింది. నిజాలు తేలే వరకు హాస్టల్ నుంచి వెళ్లబోమని భీషి్మంచిన విద్యార్థినులను బలవంతంగా కళాశాల బస్సుల ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేసింది. వీడియోల వ్యవహారంపై విచారణ అధికారిణిగా గుడివాడ సిసి సీఐ రమణమ్మను నియమించామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు తెలిపారు. అయితే శనివారం హాస్టల్‌లో విచారణకు రమణమ్మకు బదులుగా కోడూరు ఎస్‌ఐ శిరీష రావడం గమనార్హం. ఈ క్రమంలో శాంతియుతంగా హాస్టల్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థినులను ఎస్‌ఐ తీవ్రంగా బెదిరించారు. ఆందోళన ఆపకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. హాస్టల్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ విద్యార్థినులకు హుకుం జారీ చేశారు. విద్యార్థినులు వెళ్లడానికి నిరాకరించడంతో బలవంతంగా పోలీసులు వారిని బస్సులు ఎక్కించి ఇంటికి పంపించేశారు.
తరిమి తరిమి కొట్టిన రౌడీలు..
విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు, విద్యార్థులు గుడ్లవల్లేరు మంచినీటి చెరువు వద్ద విద్యార్థినులను తరలిస్తున్న బస్సును అడ్డుకునేందుకు యతి్నంచారు. అయితే అప్పటికే కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన రౌడీలు, పచ్చ గూండాలు విద్యార్థి సంఘాలు, విద్యార్థులపై దాడులకు తెగబడ్డారు. చెప్పులు, గొడుగులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. రోడ్డుపై ఈడ్చుతూ, దుర్భాషలాడుతూ తరిమితరిమి కొట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా రౌడీలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ప్రాణభయంతో విద్యార్థులు ఇళ్లల్లోకి వెళ్లి తలుపులేసుకున్నారు. అదే సమయంలో దాడిని చిత్రీకరిస్తున్న మీడియాపైనా రౌడీలు దాడులకు తెగబడి కెమెరాలు లాక్కున్నారు.
మరోవైపు ప్రభుత్వం ఈ ఘటనను పూర్తిగా కప్పిపెట్టే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థినులకు సంబంధించి 300 వీడియోలు బయటకు వచ్చాయని తెలుస్తున్నా అదేమీ లేదంటూ బుకాయిస్తోంది. గుడ్లవల్లేరు కళాశాల యాజమాన్యం తమ సామాజికవర్గానికే చెందినది కావడంతో టీడీపీ ప్రభుత్వం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హాస్టల్‌లో రహస్య కెమెరాల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని కళాశాలలోనే శుక్రవారం అర్థరాత్రి 3 గంటల వరకు పోలీసులు విచారించినా ఏ విషయం వెల్లడి కాలేదు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినిని కూడా పోలీసులు కళాశాలలో విచారించినా ఏ ఆధారాలు సేకరించలేదు.
ప్రభుత్వానికి పట్టదా?
అసలు కళాశాలలో విచారణ జరగకుండానే, దర్యాప్తు పూర్తికాకుండానే అక్కడ ఏమీ జరగలేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు ఎలా చెబుతారని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బయటికి చెబుతున్నట్లు 300 కాకుండా ఇంకా పెద్ద సంఖ్యలోనే వీడియోలు ఉన్నాయని విద్యార్థినులే చెబుతున్నారు. వాష్‌రూమ్‌లో పదుల సంఖ్యలో రహస్య కెమెరాలు పెట్టారని.. వాటన్నింటిని తొలగించి, ఇప్పుడు ఏమీలేదని కళాశాల యజమాన్యం బుకాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో తమకు, తమ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకపోయినా ప్రభుత్వానికి పట్టదా అని ధ్వజమెత్తుతున్నారు. పక్కా ప్రణాళికలో భాగంగానే.. జిల్లా ఎస్పీ కళాశాలకు రాకుండానే ఎలాంటి సీసీ కెమెరాలు లేవని ప్రకటించారని మండిపడుతున్నారు. విచారణ పూర్తి కాకుండానే ముందే క్లీన్‌చిట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రికి రహస్య కెమెరాలను తొలగించి అక్కడ ఏమీలేదని తమను మభ్యపెడుతున్నారని దుయ్యబడుతున్నారు.
కెమెరాలున్నాయని ఒప్పుకున్న విద్యార్థిని..
రహస్య కెమెరాలు అమర్చిన విషయాన్ని బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఒప్పుకుందని బాధిత విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. పైగా ‘మీరేం చేయగలరు నన్ను’ అంటూ ఎదురుతిరగడమే కాకుండా బెదిరిస్తోందని వాపోతున్నారు. యాజమాన్యం ఆ యువతిని హాస్టల్‌లో భద్రంగా ఉంచి సకల మర్యాదలు చేస్తోందని మండిపడుతున్నారు. ఆమెకు రక్షణగా నలుగురు మహిళా కానిస్టేబుళ్లను కూడా నియమించారని చెబుతున్నారు. ఆ యువతి తల్లిదండ్రులు, సోదరుడు సైతం హాస్టల్‌కు వచ్చి ఉంటున్నారని అంటున్నారు. మరోవైపు బాలుర హాస్టల్‌లో ఉన్న నిందితుడిని తోటి విద్యార్థులు ప్రశి్నస్తే రహస్య కెమెరాలు, వీడియోలు ఉన్నాయని ఒప్పుకున్నాడని.. తీరా ఇప్పుడు పోలీసుల విచారణలో మాట మారుస్తున్నాడని చెబుతున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బాలికలకు, బాలురకు ఒక్కరే వార్డెన్..
కాగా బాలికలు, బాలురకు వేర్వేరు వసతి గృహాలున్నాయి. ఈ రెండు వసతి గృహాలకు ఒక్కరే వార్డెన్ (పురుషుడు)గా ఉండటం గమనార్హం. బాలికల హాస్టల్‌లో రహస్య కెమెరాలున్నాయనే విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయతి్నంచారు. దీంతో విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు రంగప్రవేశం చేసి షవర్లను తీసుకుపోయారని.. పూర్తిగా యాజమాన్యానికి అనుకూలంగా నడుచుకున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా చూపిస్తున్నారు.
షవర్లను తమ ముందు ఊడదీస్తే అందులో కెమెరాలున్నాయో, లేదో తెలిసేదని విద్యార్థినులు అంటున్నారు. ఇలా చేయకుండా పోలీసులు తమతోపాటు షవర్లను తీసుకుపోవడంతో వాటిలో రహస్య కెమెరాలున్నాయనే తమ వాదనకు బలం చేకూరుతోందని స్పష్టం చేస్తున్నారు. గుడ్లవల్లేరు కళాశాల టీడీపీ నేతల బంధువులది. రహస్య కెమెరాలతో తీసిన విద్యార్థినుల వీడియోలను కొందరు టీడీపీ నేతలకు కూడా పంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కళాశాల యాజమాన్యం పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని విద్యార్థులు అంటున్నారు. దోషులను వెనకేసుకురావడమే ఇందుకు నిదర్శనమని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment